logo

చదువుకునేందుకు కూలి పని..

నిరుపేద కుటుంబంలో పుట్టిన మట్టిలో మాణిక్యం ఆ బాలిక. ఆమె తెలివి తేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు.

Published : 03 Jun 2023 02:49 IST

సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ విశాల్‌ సింగ్‌

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబంలో పుట్టిన మట్టిలో మాణిక్యం ఆ బాలిక. ఆమె తెలివి తేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. సమస్యలు ఎదురైనా ఏకాగ్రతతో చదువుకున్న బాలిక ఇంటర్‌లో 80 శాతం మార్కులు సాధించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో భువనేశ్వర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందింది. అక్కడ ఉండాలంటే ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వేసవి సెలవులకు ఊరొచ్చిన విద్యార్థిని కూలి పనులు వెళుతోంది మల్కాన్‌గిరి జిల్లా ఖైరపుట్‌ సమితిలో బొండఘాటి ప్రాంతంలోని బండిపోడ గ్రామానికి చెందిన కర్మా ముదులి. గతేడాది ఇంటర్‌లో 80 శాతం మార్కులు సాధించి జిల్లాస్థాయిలో మొదటి స్థానం దక్కించుకుంది. జిల్లా యంత్రాంగం అభినందించి ప్రశంసించగా గవర్నర్‌ గణేశీలాల్‌ ఆమె ప్రతిభను మెచ్చి ప్రత్యేకంగా సన్మానించారు. నిరుపేద గిరిజన విద్యార్థి కావడంతో ప్రభుత్వం ఖర్చులు భరించి భువనేశ్వర్‌ రమాదేవి మహిళా కళాశాలలో ప్రవేశం కల్పించారు. కొన్ని రోజులు సాఫీగానే నడిచినా.. భువనేశ్వర్‌లో వ్యక్తిగత ఖర్చులు, పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడింది. కుటుంబానికి డబ్బు పంపించే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ పుస్తకాల్లోనే పెన్సిల్‌తో రాసి మళ్లీ దానిని చెరిపి రాసుకుని వాడుకుంది. ఇటీవల వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన కర్మా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. రోజుకు రూ.220 దొరుకుతోందని రెండు నెలలు పని చేసి సంపాదించిన డబ్బు చదువు సంబంధించిన ఖర్చులకు వాడుకుంటానని తెలిపింది. ప్రభుత్వం అన్ని ఖర్చులు భరిస్తామని హమీ ఇచ్చి మధ్యలో వదిలేయడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. చదువు కోసం కూలి పనులకు వెళుతున్న కర్మా ముదిలిని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ విషయం తెలుసు కున్న మల్కాన్‌గిరి కలెక్టర్‌ విశాల్‌ సింగ్‌ ముఖ్యమంత్రి సహానిధి నుంచి రూ.30 వేలను విద్యార్థినికి అందజేశారు.

కూలి పనిలో కర్మా ముదులి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని