logo

కార్మికుల సంక్షేమానికి రూ.2,961 కోట్లు

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ.2,961.52కోట్లు ప్రభుత్వం వెచ్చింది.

Published : 03 Jun 2023 02:49 IST

పదిహేనేళ్లలో అన్నివిధాల సాయం: మంత్రి వెల్లడి

పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ.2,961.52కోట్లు ప్రభుత్వం వెచ్చింది. గత 15ఏళ్లలో 38లక్షల మందికిపైగా కార్మికులు ఒడిశా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేర్లను నమోదు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. గురువారం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కార్మికశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.  అనంతరం ఆశాఖ మంత్రి శారదా ప్రసాద్‌ నాయక్‌ వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం... రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒడిశా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు 2008 డిసెంబర్‌లోె ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకు 15ఏళ్ల కాలంలో వసూలైన పన్నేతర రుసుం(సెజ్‌) నుంచి  వివిధ పథకాల కింద కార్మికుల సంక్షేమానికి రూ.2,961.52కోట్లను వెచ్చించారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన కార్మికులకు సకాలంలో ఆర్థిక సాయం అందజేసేలా ఏపీ, తెలంగాణ, దిల్లీ, సూరత్‌ తదితరచోట్ల ప్రత్యేక హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశారు.
వలస కార్మికులు 1.07లక్షల మంది: సంక్షేమ బోర్డులో వలస కార్మికులు 1,07,330 మంది తమపేర్లను నమోదు చేసుకున్నట్లు మంత్రి నాయక్‌ తెలిపారు. సామాజిక భద్రత కింద అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. వీరి కోసం ఒడిశా అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత బోర్డు (ఓయూడబ్ల్యుఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్లు, ఇందులో 3.65లక్షల మందికిపైగా పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించారు. కొవిడ్‌-19 సమయంలో నిర్మాణ్‌ శ్రామిక కల్యాణ్‌ యోజన కింద అన్ని వర్గాల కార్మికులకు రూ.1,500 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయాన్ని రెండు దశల్లో పంపిణీ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. మొదటి దశలో 18.53లక్షల మంది కార్మికులకు రూ.278.05కోట్లను, రెండో దశలో 20.72లక్షల మందికి రూ.310.91కోట్లను అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్‌ఐ ఆసుపత్రులు, మరో 41 ఈఎస్‌ఈ డీస్పెన్సరీల ద్వారా బీమా సౌకర్యం ఉన్న 7.41లక్షల మంది కార్మికులకు వైద్య ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నట్లు మంత్రి నాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని