Odisha Train Accident: శవాల గుట్టలు.. కన్నీటి ధారలు
ఒకవైపు గుట్టగా పడిఉన్న మృతదేహాలు, మరోవైపు వాటిని ఆసుపత్రులకు తరలించేందుకు వాహనాల్లో ఒకదానిపై మరొకటి పడేస్తున్న దృశ్యాలు. తమవారి పార్థివ దేహాలు కనిపిస్తాయోమోనన్న ఆతృతతో వెతుకుతున్న బంధువులు, చిందరవందరగా పడి ఉన్న బోగీలు, విరిగిన పట్టాలు, వంగిపోయిన విద్యుత్తు స్తంభాలు.
ఒకవైపు గుట్టగా పడిఉన్న మృతదేహాలు, మరోవైపు వాటిని ఆసుపత్రులకు తరలించేందుకు వాహనాల్లో ఒకదానిపై మరొకటి పడేస్తున్న దృశ్యాలు. తమవారి పార్థివ దేహాలు కనిపిస్తాయోమోనన్న ఆతృతతో వెతుకుతున్న బంధువులు, చిందరవందరగా పడి ఉన్న బోగీలు, విరిగిన పట్టాలు, వంగిపోయిన విద్యుత్తు స్తంభాలు. క్రేన్‌ల శబ్దాలు, సహాయక చర్యల్లో పాల్గొన్నవారి హడావుడి.. ఇదీ శుక్రవారం రాత్రి మూడు రైళ్ల ప్రమాదం జరిగిన బాలేశ్వర్ జిల్లాలోని బాహనాగ వద్ద పరిస్థితి.
న్యూస్‌టుడే, భువనేశ్వర్ అర్బన్
మృతదేహాలు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్‌టుడే: బాలేశ్వర్ జిల్లా బహనాగ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన మూడు రైళ్ల ప్రమాదం విషాదం మిగిల్చింది. 288 మంది మృతి చెందగా, 900 మందికిపైగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో వందల మృతదేహాలు కనిపించాయి. అందులో తమవారిని గుర్తించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట వేచి చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఉపాధి కోసం చెన్నై, ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరిన పలువురు కార్మికులు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు శనివారం పట్టాలపై బోగీల తొలగింపు, మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. మరో 24 గంటల వరకు రైళ్ల రాకపోకలకు అవకాశం లేనట్లు అంచనా వేస్తున్నారు. వందలాది మంది కార్మికులు ఈ పనుల్లో ఉన్నారు. ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... క్షతగాత్రులను తొలుత బాలేశ్వర్ ప్రధాన ఆసుపత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చారు. బాలేశ్వర్ జిల్లా ఆరోగ్య కేంద్రంలో చేరినవారిలో 20 మంది మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. జిల్లాలో ఉన్న ఆసుపత్రుల్లో శుక్రవారం రాత్రి 786 మంది బాధితులు చికిత్సల కోసం చేరారు. వారిలో ఆందోళనకరంగా ఉన్న కొంతమందిని కటక్ ఎస్సీబీ వైద్య కళాశాలకు తరలించారు.
ఘటనా స్థలం
క్షతగాత్రులను ఆదుకునేందుకు ముమ్మర చర్యలు: మంత్రి ప్రమీలా మల్లిక్
కటక్, న్యూస్‌టుడే: రైళ్ల ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అండగా ఉంటుందని మంత్రి ప్రమీలా మల్లిక్ అన్నారు. శనివారం ఆమె రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారు. బాలేశ్వర్‌లో జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతున్నవారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రమాదం నుంచి బయటపడినవారిని ఇళ్లకు చేర్చేందుకు 50కిపైగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. 100కి పైగా అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు
భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రమాదంపై ఒడిశా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేస్తూ సంతాప సూచకంగా ప్రభుత్వ కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలను రద్దు చేసింది. లోక్‌సేవా భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా ఛాంబరులో కంట్రోలు రూం ఏర్పాటు చేశారు. రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు, ఇతర అధికారులతో నిరంతరం సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్ గణేశీలాల్ బహనాగ వచ్చి కేంద్ర మంత్రులతో మాట్లాడిన అనంతరం ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
నిమిషాల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది
ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: చూస్తుండగానే తోటి ప్రయాణికులు తీవ్ర గాయాలతో మృతి చెందారని, ఏం జరుగుతుందో అర్థం కాలేదని, భగవంతుడి దయ వల్ల మృత్యు కోరల నుంచి బయట పడ్డామని మిడ్నాపూర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు శుక్రవారం రాత్రి సంఘటన గురించి చెప్పారు. ప్రమాదంలో గాయపడిన 39 మంది రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎమ్మెల్యే హిరణ్మయ్ చటోపాధ్యాయ్, ఇతర నాయకులు పరామర్శించారు.
యువతిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే హిరణ్మయ్
తల్లి పెద్దకర్మకు వచ్చి... అనంత లోకాలకు..
కటక్ న్యూస్‌టుడే: బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేష్ జెనా అనే యువకుడు తల్లి పెద్దకర్మలో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలేశ్వర్ వచ్చాడు. తిరిగి చెన్నై వెళుతుండగా రైళ్ల ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈయన సోదరుడు సురేష్ బాలేశ్వర్‌లో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ రమేష్ 14 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి స్థిరపడ్డాడని, తల్లి చనిపోవడంతో ఇంటికి వచ్చాడన్నారు. నాలుగు రోజుల క్రితం తల్లి పెద్దకర్మ జరిగిందని, తర్వాత తిరిగి చెన్నై బయలుదేరాడన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు రైల్వేస్టేషన్లో తాను ఆయనను విడిచిపెట్టానని, తనను వెళ్లిపోమన్నాడని, రైలు ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడన్నారు. ఇంతలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైందన్న సమాచారం తెలుసుకుని రమేష్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని, కొంతసేపటి తర్వాత మళ్లీ చేస్తే వేరెవరో ఫోన్ లిఫ్ట్ చేశారని, ఫోన్ యజమాని (రమేష్) మృతిచెందాడని చెప్పాడన్నారు. ప్రమాద స్థలానికి వెళ్లి తన సోదరుడి కోసం గాలించానని, మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారన్నారు. బాలేశ్వర్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో మృతదేహాన్ని గుర్తించామని, రైల్వేస్టేషన్‌లో వదిలిన గంటకే ప్రాణాలు కోల్పోయాడని బావురుమన్నాడు.
చుట్టూ చీకటి.. అంతటా హాహాకారాలు
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘రైలు ఒక్కసారిగా భారీ కుదుపుతో ఆగిపోయింది. బోగీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చుట్టూ చీకటి.. అంతటా ప్రయాణికుల హాహాకారాలు.. ఏం జరుగుతోందో తెలియని అయోమయం.. తోటి ప్రయాణికుల ఏడుపులు.. ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేం’ అని ప్రమాదానికి గురైన కోరమాండల్ రైల్లో ప్రయాణించిన జ్యోతిర్మయ హయతి (50) చెప్పారు. ప్రమాదం నుంచి భార్య, పదకొండేళ్ల కుమార్తె అద్రిజాలతో ఆయన సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. బాలేశ్వర్ నుంచి బస్సులో భువనేశ్వర్ చేరుకున్న ఆయన కుటుంబంతోసహా మరో బస్సులో బ్రహ్మపురలో నీలాంచల్‌నగర్‌లోని ఇంటికి శనివారం చేరుకున్నారు. సాయంత్రం ఆయన విలేకరులతో రైలు దుర్ఘటన మిగిల్చిన చేదు అనుభవాలను పంచుకున్నారు. హావ్‌డాకు చెందిన ఆయన గోపాలపూర్ సమీపాన గొళాబంధలోని ఆర్మీ కంటోన్మెంట్‌లో సివిల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పదిహేను రోజుల సెలవుపై కుటుంబంతో కలసి హావ్‌డా వెళ్లిన ఆయన కోరమాండల్ రైల్లో శుక్రవారం బ్రహ్మపురకు తిరిగి బయలుదేరారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో రైలు గట్టి కుదుపునకు గురైంది. వెంటనే బోగీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలియదు. పై బెర్తుపై విశ్రాంతి తీసుకుంటున్న భార్య కుదుపులకు కిందకు దిగిపోయారు. చీకట్లో కుమార్తె అద్రిజా కనబడకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను గట్టిగా పిలుస్తూ బోగీలో అటూ, ఇటూ వెతికారు. ఇంతలో తోటి ప్రయాణికుడు ఒకరు ఇదిగో మీ కుమార్తె అంటూ చెప్పగానే, ఆమెను చూసిన జ్యోతిర్మయ ఊపిరి పీల్చుకున్నారు. బోగీ వెనుకవైపు వెళ్లి చూడగా వెనుకనున్న బోగీలు కనిపించలేదు. బోగీలోని మరుగుదొడ్లు సమీపాన ప్రవేశ మార్గం ధ్వంసమైంది. విరిగిన కిటికీల నుంచి బయటకు చూస్తే అంతటా అంధకారం. ఇంతలో ఎవరో టార్చిలైటు వేశారు. ఆ వెలుతురులో పక్కనున్న పట్టాలపై బోల్తాకొట్టిన బోగీలను చూసిన ఆయన భారీ దుర్ఘటన జరిగిందని తెలుసుకుని భార్య, కుమార్తెతో కలిసి జాగ్రత్తగా రైలు దిగారు. దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డామని వివరించారు.
జ్యోతిర్మయ హయతి
మృతులకు నివాళి
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బాలేశ్వర్ జిల్లాలో రైళ్ల ప్రమాదంలో మృతిచెందినవారికి నివాళులర్పిస్తూ గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) శనివారం సంతాప సభ నిర్వహించింది. మధ్యాహ్నం జీబీఏ కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొని మౌనం పాటించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. గాయపడ్డ ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. స్థానిక అర్జున్ నవ్వుల క్లబ్ ఆధ్వర్యంలోనూ ప్రతినిధులు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు.
మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న న్యాయవాదులు
నిద్ర లేకుండా కష్టపడుతున్నాం
భువనేశ్వర్, అర్బన్, న్యూస్‌టుడే: సహాయ చర్యల్లో మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు శుక్రవారం రాత్రి నుంచి శ్రమిస్తున్నాయి. శనివారం ఎన్డీఆర్‌ఎఫ్ ఉద్యోగి భాస్కర్‌రెడ్డి మరో ఇద్దరితో కలసి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ శుక్రవారం రాత్రి నుంచి నిద్ర లేకుండా బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మరో మూడు బోగీలు ఒకదానిపై ఒకటి ఉండడం వల్ల అందులో కూడా మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. గ్యాస్ కట్టర్లతో బోగీలను కత్తిరిస్తూ లోపల ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కష్టమైనా పలువురిని ఆదుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందంలో సభ్యులు
పరిశీలిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత