logo

నేడు చతుర్థామూర్తుల స్నానవేడుక

జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు) స్నానవేడుక, జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పూరీ శ్రీక్షేత్రం దేవస్నాన మండపం వేదికగా జరగనున్న ఈ యాత్ర విశిష్టమైనది.

Published : 04 Jun 2023 02:21 IST

పూరీ శ్రీక్షేత్రంలో ఏర్పాట్లు
నిర్ణీత వేళల్లో సేవలు... గట్టి బందోబస్తు

చతుర్థామూర్తుల జలాభిషేకం

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు) స్నానవేడుక, జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పూరీ శ్రీక్షేత్రం దేవస్నాన మండపం వేదికగా జరగనున్న ఈ యాత్ర విశిష్టమైనది. ఏడాదికోసారి భక్తుల సమక్షంలో చతుర్థామూర్తులకు 108 కలశాల జలాభిషేకం ఉత్సవం తిలకించడానికి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్వామి లీలలు అనంతం: జగన్నాథుని లీలలు అనంతం. వేడుకలంటే ఆ స్వామికి మహాప్రీతి. పూరీ శ్రీక్షేత్రం వేదికగా 12 నెలల్లో 13 యాత్రలు, ఇతర ఉత్సవాలు జరుగుతాయి. అందుకే పురుషోత్తమ సన్నిధిని ‘వైకుంఠపురి’గా భక్తులు అభివర్ణిస్తారు. స్వామి సన్నిధిలో జరిగే ప్రతి ఉత్సవం వెనక అర్థం, పరమార్థం, మానవ కళ్యాణం, దివ్యసందేశం ఉంటుంది. ఏ పని తలపెట్టినా, చేసినా త్రికరణ శుద్ధి ఉండాలని, శ్రీక్షేత్ర ఆస్థాన పురాణంలో లిఖితమైఉంది. స్వామి దేవస్నానం విషయానికొస్తే... నిత్యం శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనంపై చతుర్థామూర్తులకు సేవాయత్‌లు స్నానం చేయిస్తారు. అలంకరణ చేసే సమయంలో ఎదురుగా అద్దం ఉంచుతారు. శృంగార ప్రియుడైన స్వామి తన శింగారం అద్దంలో తిలకించి పారవశ్యానికి గురవుతాడని భక్తుల నమ్మకం. అంతర శుద్ధి, బాహ్యశుద్ధి, స్థల శుద్ధి.. ఈ మూడు అంతమందికీ వర్తిస్తాయి. దీన్ని ప్రత్యక్షంగా జ్యేష్ఠ పౌర్ణమినాడు పురుషోత్తముడు తన భక్తులకు చూపిస్తాడు. వారి సమక్షంలో జలాభిషేకం చేయించుకుంటాడు. రమణీయం, కమనీయం, నేత్రపర్వం ఈ ఉత్సవం.

గజానన రూపంలో దివ్యదర్శనం: జగన్నాథుని స్నానవేడుక తర్వాత స్వామికి గజానన (వినాయక) అవతారంలో భక్తులు చూడగలుగుతారు. ఏడాదికోసారి ఈ దివ్య మంగళ రూప దర్శనం స్నానమండపంపై ఏర్పాటవుతుంది. పురుషోత్తమునికి వినాయకుని రూపంలో తిలకించడం శుభకరం, ఫలప్రదమని భక్తులంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ముగ్గురు మూర్తుల అలంకరణ జరుగుతుంది. 3 గంటల నుంచి స్వామిని గజానన రూపంలో అంతా దర్శనాలు చేసుకోగలుగుతారు. రాత్రి 9 తర్వాత ‘ఒనొసోనో’ (చీకటి) మందిరం పొహండి జరగనుంది. స్వామి సేవలు, వేడుకలన్నీ నిర్ణీత వేళల్లో జరిగేలా శ్రీక్షేత్ర యంత్రాంగం చర్యలు చేపట్టింది.

పొహండి: దేవస్నానాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం మధ్యాహ్నం 12 వరకు జగన్నాథ దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో సేవాయత్‌లు ఆదివారం చేపట్టే వేడుకల ముందుగా గోప్యసేవలన్నీ పూర్తి చేశారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల దేవస్నాన పొహండిలో కీలకమైనది సేనాపటసేవ. గర్భగుడి నుంచి వెలుపలకు (స్నాన మండపానికి) తేవడానికి ఈ సేవ చేపడతారు. ఇందుకు సేవాయత్‌లు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి నిర్ణీత వేళల్లో అన్ని కార్యక్రమాలు చేపట్టిన వారంతా ఆదివారం ఉదయం 6 గంటల కల్లా చతుర్థామూర్తులను స్నాన మండపానికి పొహండిగా తెస్తారు. 9 కల్లా జలాభిషేకం జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు