logo

పేరుకుపోతున్న వ్యర్థాలు.. మూసుకుంటున్న కాలువలు

బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) పరిధిలోని పలు వార్డుల వీధుల్లో పేరుకుపోతున్న వ్యర్థాలతో కాల్వలు మూసుకుపోతున్నాయి. వీటివల్ల కాల్వల్లో నీరు సజావుగా ప్రవహించక ఎక్కడికక్కడ మురుగు నిల్వఉండి వర్షాలు పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

Published : 04 Jun 2023 02:21 IST

ప్రేమనగర్‌ ప్రాంతంలోనున్న పెద్దకాల్వ దుస్థితి

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) పరిధిలోని పలు వార్డుల వీధుల్లో పేరుకుపోతున్న వ్యర్థాలతో కాల్వలు మూసుకుపోతున్నాయి. వీటివల్ల కాల్వల్లో నీరు సజావుగా ప్రవహించక ఎక్కడికక్కడ మురుగు నిల్వఉండి వర్షాలు పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒడిశా డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు కింద 2017లో రహదారులు, మురుగుకాల్వలు నిర్మాణం జరిపేందుకు అప్పట్లో స్థానిక ప్రేమనగర్‌ ప్రాంతంనుంచి హౌసింగ్‌బోర్డు కూడలి మీదుగా నీలకంఠనగర్‌, మామిడి పండ్ల మార్కెట్‌ ప్రాంతం వరకు ఇరువైపులా తవ్వేసి పనులు మధ్యలో నిలిపివేసిన విషయం విదితమే. నాటినుంచి ఆయా ప్రాంతాల్లోనున్న పెద్దకాల్వలు వ్యర్థాలతో నిండిపోయాయి. వాటిని శుభ్రం చేయక పారిశుద్ధ్యం సిబ్బంది అలానే వదిలేశారు. దీనివలన వర్షాలు పడిన సమయంలో కాల్వలు చెత్తచెదారాలతో నిండి రహదారులపై పారుతూ మళ్లీ కాల్వల్లోకి పేరుకుపోతున్నాయి.

మరికొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది కాల్వల్లోనున్న చెత్తలు తొలగించి ఆ పక్కనే రోడ్లపై పడేసి వాటిని అక్కడినుంచి వెంటనే తొలగించకపోవడంతో మళ్లీ అవి కాల్వల్లోకే పోతున్నాయి. దీనితో సమస్య మరింత జటిలమవుతోంది. వర్షాకాలంలోపు వ్యర్థాలతో మూసుకుపోయిన కాల్వలను శుభ్రం చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని నగరవాసులు వాపోతున్నారు. దీనిపై బీఈఎంసీ కార్యనిర్వాహక ఇంజినీరు లలిత్‌దాస్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ అన్ని వార్డులలో రహదారులు, కాల్వల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఇందుకోసం అనుసంధానంగానున్న కాల్వలను మూసివేస్తున్నామని, దీనివలన చెత్తలు పేరుకుంటున్నాయన్నారు. ప్రసుత్తం ప్రేమనగర్‌ నుంచి అందపసరరోడ్డు వరకు రహదారి, ఇరువైపులా కాల్వలు నిర్మాణ పనులు జరుగుతున్నాయని మరో మూడునెలల్లో ఆయా పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత కాల్వల్లో చెత్తలు పేరుకుపోయే సమస్యలుండవని ఆయన చెప్పారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలని వివిధ వ్యర్థాలు కాల్వల్లో వేయకుండా వాటిని చెత్తసేకరించే వాహనాల్లో వేయాలని లేదా చెత్త డంపింగ్‌పాయింట్లలో వేయాలని దాస్‌ చెప్పారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వార్డులలోని కాల్వలు శుభ్రంచేసే పనులు పారిశుద్ధ్య సిబ్బంది జరుపుతున్నారని కాల్వల్లో మట్టిని, ఇతరత్రాలు చెత్తలను తొలగించి నీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకుంటున్నామని దాస్‌ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని