ఆ ప్రకృతే పాపం అంటోంది

కల్మషం లేని మనుషులు.. అడవి తల్లి ఒడిలో బతుకుతున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ ఆ కొండకోనలనే నమ్ముకున్నారు.. అలాంటి వారిపై ప్రకృతి కన్నెర్రజేసింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది.

Published : 04 Jun 2022 03:33 IST

ఈనాడు-విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, న్యూస్‌టుడే : కల్మషం లేని మనుషులు.. అడవి తల్లి ఒడిలో బతుకుతున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ ఆ కొండకోనలనే నమ్ముకున్నారు.. అలాంటి వారిపై ప్రకృతి కన్నెర్రజేసింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది. కనీసం తలదాచుకోవడానికి నిలువ నీడనూ మిగల్చలేదు. వారికి అండగా నిలవాల్సిన యంత్రాంగం వదిలేసింది. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి హామీలు గుప్పించిన నాయకులూ కన్నెత్తి చూడటం లేదు. వారి బాధలు చూసి ప్రకృతే అయ్యో పాపం అంటోంది. 

తిత్లీ తుపాను 2018 అక్టోబర్‌ 11న అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సుమారు 146 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలన్నీ పడిపోయాయి. అమాయక గిరిజనం తెల్లవార్లూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. జరడ పంచాయతీ కేంద్రంతో పాటు దీని పరిధిలోని జంపరకోట, మూలిగూడ, పొడిదం, గెడ్డగూడ, నెమలిమానుగూడ, పటాయిగెడ్డ, ఈతమానుగూడ, కొత్తగూడ గ్రామాల్లో 79 గృహాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడో కొండలపై గ్రామాలు ఉండటంతో సుమారు 24 గంటల వరకు ఈ విషయం బాహ్య ప్రపంచానికి కూడా  తెలియలేదు.

పరామర్శలకే పరిమితం 

తుపాను మరుసటి రోజు ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులను పరామర్శించి ఇళ్లు కట్టిస్తాం.. పంటలకు పరిహారం ఇస్తామన్నారు. 30 జనవరి 2020న అప్పటి ఐటీడీఏ పీవో అంబేడ్కర్‌ జరడలో గిరిజనులు చిన్నచిన్న పరదాలు వేసుకొని కొందరు.. స్నానాల గదుల్లో ఇంకొందరు.. పాఠశాల వసతిగృహంలో మరికొందరు తలదాచుకోవడాన్ని చూసి చలించిపోయారు. వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే గృహ నిర్మాణ శాఖ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేరలేదు. జరడ పంచాయతీకి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో 96 ఇళ్లు మంజూరు చేశారు. పాతవి వదిలేసి వీటిని నిర్మించుకోవాలని అధికారులు చెప్పారు. అప్పులు చేసి పనులు చేపడితే బిల్లులు రాకపోతే పరిస్థితి ఏమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

రేషన్‌కార్డులు కుదువ పెట్టి..

మూడేళ్ల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ సిమెంటు రేకులు అందించడంతో కొందరు వాటిని వేసుకొని మట్టి ఇళ్లలో ఉంటున్నారు. మరికొందరు పరదాలు కప్పుకొని నీడ కల్పించుకున్నారు. జరడ పంచాయతీలో పలు వీధుల్లో మొండి గోడలే కనిపిస్తున్నాయి. చాలామంది అప్పులు చేసి వీటిని నిర్మించుకున్నారు. ఇప్పటివరకు వాటికి బిల్లులు రాకపోవడంతో వాటిని మధ్యలోనే వదిలేశారు. కొందరు రేషన్‌కార్డులు కుదువ పెట్టి అప్పులు తెచ్చుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గతంలో ఇచ్చినవి రద్దు: కూర్మినాయుడు, గృహ నిర్మాణ శాఖ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా

తుపాను బాధితులకు గతంలో మంజూరు చేసిన ఇళ్లన్నీ రద్దు చేశాం. పోర్టల్‌ నుంచి తొలగించాం. వారందరికీ ప్రధాన ఆవాస్‌ యోజన కింద కొత్తగా ఇళ్లు కేటాయించాం. నిర్మాణం చేపడితే దశల వారీగా బిల్లులు చెల్లిస్తాం. గతంలో మధ్యలో ఆగిపోయిన వాటికి సంబంధించి వాటిస్థాయి ఆధారంగా డబ్బులు చెల్లిస్తాం. 

జీడి తోటలకూ పైసా ఇవ్వలేదు
తిత్లీ ధాటికి ఐటీడీఏ పరిధిలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో జీడి తోటలకు నష్టం వాటిల్లింది. పోడు పంటలూ దెబ్బతిన్నాయి. ఉద్యాన అధికారులు 400 ఎకరాల్లో జీడికి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు పైసా పరిహారం ఇవ్వలేదు. ఒకప్పుడు  తోటలతో పచ్చగా కళకళలాడిన కొండలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని