logo

ఇవి చేస్తే.. మన్యం మకుటమే

సరిగ్గా వంద రోజుల క్రితం గిరిజనుల ఆశలకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం మన్యం పేరుతో జిల్లాలో పాలన ప్రారంభమైంది. కొత్త అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుంది.. సమస్యలను ఎలా ఎదుర్కొంటుందని అందరూ భావించే లోపే కొన్ని దీర్ఘకాలిక

Published : 12 Jul 2022 04:43 IST

జిల్లా ఏర్పడి నేటికి వంద రోజులు
 న్యూస్‌టుడే, పార్వతీపురం

గుమ్మలక్ష్మీపురం మండలంలో కాలినడకన కొండ దిగుతున్న గిరిజనులు

రిగ్గా వంద రోజుల క్రితం గిరిజనుల ఆశలకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం మన్యం పేరుతో జిల్లాలో పాలన ప్రారంభమైంది. కొత్త అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుంది.. సమస్యలను ఎలా ఎదుర్కొంటుందని అందరూ భావించే లోపే కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి ప్రజల మన్నన పొందింది. గిరిజనుల ఆదాయం పెరిగేలా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. వసతులు సమకూర్చుకుంటూ, వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.. అయితే కొన్ని శాఖలకు కార్యాలయాలు.. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం, గతం నుంచి వెంటాడుతున్న సమస్యలు.. అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించి, గిరిపుత్రులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ.. ప్రత్యేక కథనం.


మాకో దారి చూపండయ్యా


జియ్యమ్మవలస మండలంలో గర్భిణిని డోలీలో తీసుకెళ్తున్న యువకులు

కొత్త జిల్లాలో చాలా గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేవు. ప్రభుత్వం రహదారులకు నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవడంలో జాప్యంతో అడుగులు ముందుకు పడటం లేదు.
సాలూరు నియోజకవర్గంలో 11 రహదారులు మంజూరు కాగా అనుమతులు వచ్చాయి. కురుపాంలో 7, పాలకొండలో 7 మార్గాలకు అభ్యంతరాలున్నాయి. ఇవి పూర్తయితే 52 గ్రామాలకు రాకపోకలు సాగనున్నాయి.
గిరిజన ప్రాంతంలో రహదారి సౌకర్యం లేనివి సుమారు 417 గ్రామాలున్నాయి. ఉపాధి పథకంలో భాగంగా వీటికి కొత్త మార్గాలు వేసేందుకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు.  

కొన్నింటికే పల్లెవెలుగు
జిల్లాలో 916 గ్రామాలుండగా 305 వరకు బస్సులు తిరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో 80 శాతం సర్వీసులు నడుస్తుండగా గిరిజనులకు అరకొరగానే సేవలందుతున్నాయి. కొన్ని గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో ప్రజలకు నడకదారే దిక్కవుతోంది.


సారథులు చూడాలి వారధులు


పూర్తికాని నారాయణపురం వంతెన

కొమరాడ మండలంలోని పూర్ణపాడు- లాబేసు మధ్య నాగావళిపై 2017లో రూ.14 కోట్ల అంచనాతో చేపట్టిన వంతెన నిర్మాణం 60 శాతమే అయింది. నిధులు చాలక మిగిలిన పనులు వదిలేశారు. ఫలితంగా కొమరాడ మండల కేంద్రానికి చేరేందుకు 32 గ్రామాల ప్రజలు అదనంగా 30 కి.మీ.లు పయనిస్తున్నారు. బీ  సీతానగరం వద్ద సువర్ణముఖిపై గతేడాది జులైలో వంతెన పనులు ప్రారంభించారు. వచ్చే మార్చికి పూర్తి చేయాల్సి ఉన్నా రూ.5 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండటంతో పనులు నిలిపేశారు. ప్రస్తుతం 1936లో నిర్మించిన శిథిల వంతెన పైనుంచే రోజూ 2 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. బీ బలిజిపేట మండలంలోని నారాయణపురం-పెద్దింపేట వంతెన పనులు నాలుగేళ్ల క్రితమే అర్ధాంతరంగా నిలిచాయి.


అధికారులెక్కడ..?

ఇటీవల ఐటీడీఏ పీవో బదిలీపై వెళ్లగా జేసీకి ఆయన బాధ్యతలను అప్పగించారు.

ప్రస్తుతం చాలా పనులు ఉపాధి హామీ పథకంలో చేస్తున్నారు. పూర్తిస్థాయి పీడీ లేక విజయనగరం పీడీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

డీఆర్‌డీఏ పీడీగా ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ ఏపీడీ ఉన్నారు.

పౌర సరఫరాల అధికారిగా ఇక్కడ పనిచేసిన మధుసూదన్‌ విజయనగరం వెళ్లారు. అక్కడి అధికారి ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టారు. విద్యాశాఖదీ అదే పరిస్థితి.

తూ.కొ., గనులు, భూగర్భ, అటవీ, దివ్యాంగుల శాఖలు పూర్వ జిల్లా కేంద్రాల నుంచే సేవలు అందిస్తున్నాయి.

శ్రీకాకుళం పర్యాటక అధికారి జిల్లాకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

పరిశ్రమల శాఖకు డీడీ లేరు.


విద్య-వైద్యంలో వెనకడుగు..

గిరిజనులకు సాంకేతిక విద్యను అందించేందుకు కురుపాంలో మూడేళ్ల క్రితం గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. పనులు పూర్తికాక విద్య అందుబాటులోకి రాలేదు. 2022 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభిస్తామని ముందుగా ప్రకటించినా ఏడాది పాటు వాయిదా వేశారు. బీ 2016లో గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించారు. ఇటీవల దీనికి మెంటాడ-దత్తిరాజేరు మధ్య స్థలం కేటాయించారు. ఇది పూర్తయితే గిరిజన ప్రాంతానికే మకుటంగా నిలవనుంది. బీ  జిల్లా కేంద్రంలో ఆధునిక వైద్య సేవలు అందించేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు అధికారులు స్థలం కేటాయించారు. ఆ ప్రాంతంలోని పశు వైద్యశాలను ఖాళీ చేసేందుకు ఆ శాఖ షరతు పెట్టడంతో రెండేళ్లుగా ముందడుగు పడడం లేదు.


పట్టణాభివృద్ధి.. పారిశ్రామిక ప్రగతి  

- నిశాంత్‌కుమార్‌, కలెక్టర్‌

వందరోజుల్లో జిల్లాకు ఏం అవసరమో సమకూర్చుకోగలిగాం. రానున్న రోజుల్లో పట్టణాభివృద్ధికి కార్యాచరణ అమలుచేస్తాం. గ్రామీణ పరిశ్రమల ప్రోత్సాహానికి ఎంఎస్‌ఎంఈ పథకం రూపొందించింది. చింతపండు, జీడిపప్పు, బియ్యం తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. రానున్న రోజుల్లో కలెక్టరేట్‌, ఏఆర్‌ సముదాయాలు, పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నిర్మాణానికి చర్యలు చేపడతాం. ప్రజలకు మంచి పాలన అందించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని