logo

గందరగోళం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌)లో పర్యవేక్షకుల నియామకాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టుల నియామకం అంతా విశాఖ జోన్‌ కేంద్రంగా జరుగుతోంది.

Updated : 26 Sep 2022 05:57 IST

అంగన్‌వాడీ పర్యవేక్షకుల నియామకాలపై అనుమానాలు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌)లో పర్యవేక్షకుల నియామకాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టుల నియామకం అంతా విశాఖ జోన్‌ కేంద్రంగా జరుగుతోంది. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 50 ఏళ్లలోపు వయసున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ పోస్టులకు అర్హులు. ఈ నెల 18న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయకుండా నేరుగా మెరిట్‌ పేరిట కొందరి పేర్లతో జాబితా తయారు చేసి వారికి మాత్రమే సమాచారం ఇచ్చినట్లు భోగట్టా. దీంతో మిగిలిన వారికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈనాడు-విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 1925 మంది పర్యవేక్షకుల కోసం పరీక్ష రాశారు. ఇందులో 48 మందితో మాత్రమే ఎంపిక జాబితాను తయారు చేశారు. ఏ పరీక్షకైనా నిర్వహణ అనంతరం కీ విడుదల చేస్తారు. తరువాత ఫలితాలు, మార్కుల జాబితా వివరాలు ప్రకటిస్తారు. ఇవేవీ లేకుండా నేరుగా మౌఖిక పరీక్షకు ఎంపికైన వారి వివరాలు పంపించారు. శనివారం సాయంత్రం సూపర్‌వైజర్లకు దీనిపై సమాచారం ఇచ్చారు. ఆదివారం సాయంత్రంలోగా ఎంపికైన వారు ఆంగ్లంలో మాట్లాడిన వీడియోను అప్‌లోడ్‌ చేయించాలని సూచించారు. ఈ మేరకు జాబితా పంపిస్తామన్నారు.

రాతపరీక్ష
45 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఐదు మార్కులకు మౌఖిక పరీక్ష ఉంటుంది. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. వృత్తికి సంబంధించిన అంశంపై అభ్యర్థి మూడు నుంచి ఐదు నిమిషాల నిడివిలో ఆంగ్లంలో మాట్లాడి ఈ వీడియోను అప్‌లోడ్‌ చేయాలి. పదో తరగతి అర్హతతో ఉద్యోగం సాధించిన అంగన్‌వాడీ కార్యకర్తల్లో చాలా మందికి ఆంగ్లంలో మాట్లాడడం రాదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే. దీంతో ఎంపికైన వారు ఆందోళన చెందుతున్నారు. రాత పరీక్షల వరకు సజావుగానే జరిగినా.. ఆ తరువాత పరిణామాలపైనే అనుమానాలు కలుగుతున్నాయని అభ్యర్థులు అంటున్నారు. డబ్బులు కూడా చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

67 మందికి ఒక్కరే
సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఎవరూ ఉత్తీర్ణత సాధించలేదని కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రామభద్రపురం మండలం నుంచి ఒక్కరే మౌఖిక పరీక్షకు ఎంపికైనట్లు సమాచారం. గంట్యాడ ప్రాజెక్టు పరిధిలో 67 మంది రాస్తే ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం. మార్కుల జాబితా విడుదల చేస్తే లోపాలు, తప్పొప్పులు తెలుస్తాయని, అధికారులు దాచిపెట్టడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకాలపై జిల్లా అధికారులు కేవలం దరఖాస్తులు తీసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇతర అంశాలతో సంబంధం లేకపోవడంతో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. దీనిపై విజయనగరం ఐసీడీఎస్‌ పీడీ అనంతలక్ష్మిని వివరణ కోరగా.. రాష్ట్ర స్థాయిలోనే నియామక ప్రక్రియ జరుగుతుందని, అంతా పారదర్శకంగానే చేస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని