logo

శ్మశానాల్లో కబ్జా ‘భూ’తాలు!

కొండలు.. మెట్టలు.. ప్రభుత్వ భూములు.. కాదేదీ ఆక్రమణలకు అనర్హం అన్నట్లు కబ్జాదారులు ఎక్కడికక్కడే పాతుకుపోతున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున భూములు కాజేసి, రూ.కోట్లలో దోచుకున్నారు. ఇటీవల శ్మశానాలపై పడ్డారు. పట్టణాలు, గ్రామ శివార్లలో ఉన్న వాటికల్లో భూములను ఆక్రమించి, పంట పొలాలుగా మార్చేస్తున్నారు.

Published : 26 Sep 2022 03:11 IST

పంట పొలాలుగా మారిన బొబ్బిలి ఐటీఐ కాలనీ వాటిక

న్యూస్‌టుడే, గరివిడి, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం: కొండలు.. మెట్టలు.. ప్రభుత్వ భూములు.. కాదేదీ ఆక్రమణలకు అనర్హం అన్నట్లు కబ్జాదారులు ఎక్కడికక్కడే పాతుకుపోతున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున భూములు కాజేసి, రూ.కోట్లలో దోచుకున్నారు. ఇటీవల శ్మశానాలపై పడ్డారు. పట్టణాలు, గ్రామ శివార్లలో ఉన్న వాటికల్లో భూములను ఆక్రమించి, పంట పొలాలుగా మార్చేస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఈ ప్రక్రియ తీవ్రమైంది. దీంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి, స్వాధీనానికి చర్యలు చేపడుతున్నారు.

అభివృద్ధి లేకే..
దాదాపు అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎకరా నుంచి అయిదారు ఎకరాలకు పైగా విస్తరించిన వాటికలున్నాయి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరుభూముల ఆక్రమణపై దృష్టిసారించాలని ఆదేశించింది. అలాగే వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలాప్రాంతాల్లో హద్దులు, రక్షణ గోడలు లేకపోవడంతో ఆక్రమణలకు ఆస్కారం కలుగుతోంది.
దృష్టి ఏదీ..
భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రతి గ్రామంలో వాటికల రక్షణపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. కొన్నిచోట్ల ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు అరకొరగానే ఉన్నాయి. హద్దులు నిర్ణయించి, రక్షణ గోడలను ఏర్పాటు చేయాలి. ఆక్రమణలున్న చోట తొలగించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పరిస్థితి ఇదీ..
* గంట్యాడ మండలం నరవలో ఉన్న వాటిక ఆక్రమణలతో కుచించుకుపోవడంతో దహన సంస్కారాలను రహదారి పక్కనే చేస్తున్నారు. పొల్లంకి, రామవరంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.*   గజపతినగరం మండలం మధుపాడ, చిట్టేయవలసలో ఆక్రమణలు జరిగాయి*   బొండపల్లి మండలం గొల్లుపాలెం, బి.రాజేరు, నెలివాడ, పాత బొబ్బిలిలో ముస్లిం వాటిక, బైరెడ్డిసాగరంలో మూడు వార్డులకు సంబంధించి శ్మశానానికి రక్షణ గోడలు లేవు. దీంతో క్రమేపీ కబ్బాకు గురవుతున్నాయి. ః  గుర్ల మండలం చింతపల్లిపేటలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాలను ఆక్రమించేశారు.*   చీపురుపల్లి- లావేరు రోడ్డు, కరకాం, మెరకముడిదాం, ఎం.గదబవలస, తోండ్రంగిలోనూ ఇదే దుస్థితి.*   రేగిడి మండలం పెదశిర్లాం, రాజాంలో ఆక్రమణలు తొలగించాలని కోరినా అధికారుల స్పందన లేదని మెంటిపేట వాసులు చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..
గరివిడి మండలం దేవాడలో శ్మశానవాటిక ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వేచేసి చర్యలు తీసుకుంటున్నామని చీపురుపల్లి ఆర్డీవో అప్పారావు తెలిపారు. ఇంకెక్కడైనా ఆక్రమణలుంటే తొలగించి హద్దులు నిర్ధారించాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని, క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికలను కాపాడతామని బొబ్బిలి ఆర్డీవో పి.శేషశైలజ హెచ్చరించారు.
గరివిడి మండలంలోని దేవాడలో శ్మశానవాటిక వాస్తవ విస్తీర్ణం 3.44 ఎకరాలు. ఇందులో సుమారు 2 ఎకరాలకు పైగానే భూములను ఆక్రమించి ఎంచక్కా పొలాలుగా మార్చేశారు. ఇటీవల అధికారులు గుర్తించి, స్వాధీనానికి చర్యలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని