logo

భూ సమస్యలకు.. ‘స్పందన ప్లస్‌’తో పరిష్కారం

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘స్పందన’లో భూసంబంధిత అర్జీలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల సబ్‌ కలెక్టరు భావన, పాలకొండ ఆర్డీవో హేమలత ఆధ్వర్యంలో జరిగిన ‘స్పందన’లోనూ ఈ ఫిర్యాదులే కనిపించాయి.

Published : 03 Oct 2022 03:28 IST

జిల్లాలో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం

వినతులు పరిశీలిస్తున్న కలెక్టరు నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘స్పందన’లో భూసంబంధిత అర్జీలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల సబ్‌ కలెక్టరు భావన, పాలకొండ ఆర్డీవో హేమలత ఆధ్వర్యంలో జరిగిన ‘స్పందన’లోనూ ఈ ఫిర్యాదులే కనిపించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో ‘స్పందన్‌ ప్లస్‌’ అనే కార్యక్రమాన్ని జిల్లాలో త్వరలో ప్రారంభించనున్నారు.

కార్యక్రమం సాగేదిలా..

ఇప్పటివరకు కలెక్టరు, ఎస్పీ నిర్వహించిన ‘స్పందన’లో వచ్చిన భూ సమస్యలను ముందుగా పరిశీలిస్తారు. తమ పరిధిలోనివి, కోర్టు వివాదాల్లో లేని వాటిపై దృష్టి సారిస్తారు. ఆయా మండలాల తహసీల్దార్లు, పోలీసుస్టేషను హౌస్‌ ఆఫీసర్లు హాజరై కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. అనంతరం అర్జీదారులు, వారు ఫిర్యాదు చేసిన వ్యక్తులను పిలిపించి చర్చిస్తారు. ఇలా వారంలో గరిష్ఠంగా 10 అర్జీలనైనా పరిష్కరించాలని చూస్తున్నారు.  


* తన ఇంటి స్థలాన్ని కొందరు దొంగ సంతకాలతో కబ్జా చేశారని సీతానగరం మండలానికి చెందిన తిరుపతిరావు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు కలెక్టరేట్‌ నుంచి లేఖ వెళ్లింది. వారం గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుపతిరావు మరోసారి కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.


* తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, దీనికి సంబంధించిన రికార్డులు తారుమారు కావడంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని నర్సిపురానికి చెందిన కుమార్‌ తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి వారం కలెక్టరేట్‌కు వచ్చి పరిష్కారం కోసం విన్నవిస్తున్నారు.


రెవెన్యూ అర్జీలే అధికం

* జిల్లా ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు జరిగిన ‘స్పందన’లో 3,301 వినతులు వచ్చాయి. వీటిలో 899 రెవెన్యూ శాఖవే. ఇందులో ఎక్కువ పరిష్కారం కాలేదని అధికారులే గుర్తించారు. ప్రస్తుతం వీటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

* భూ సమస్యలను కోర్టుల్లో తేల్చుకోవాలని చాలా మంది సూచిస్తారు. ఇలా కాకుండా రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చర్చిస్తే పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. వీటిపై కలెక్టర్‌, ఎస్పీ ప్రత్యేక చొరవ చూపడం ద్వారా పరిష్కారం దొరికే అవకాశముందని అర్జీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


వినూత్న ప్రయత్నం -నిశాంత్‌కుమార్‌, కలెక్టరు

అర్జీదారులు అధికారులపై ఎంతో నమ్మకంతో వచ్చి సమస్యలు చెబుతున్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని భూ సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అందుకే ‘స్పందన ప్లస్‌’ను రూపొందించాం. త్వరలోనే కార్యక్రమం ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని