logo

ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలు

అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడి వ్యవసాయ స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 02:21 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే

జిల్లా వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో చర్చిస్తున్న వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి

అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడి వ్యవసాయ స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు చేపట్టిన చర్యలు, రైతుల సమస్యలను జేసీ ఆనంద్‌ వివరించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా సూక్ష్మ సేద్యానికి మూడేళ్లుగా పరికరాలు అందించలేకపోయామని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు టార్పాలిన్లు ఇస్తామన్నారు. వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో 50 గిడ్డంగులను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.


* ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు  ఉన్నాయి. వ్యవసాయ సమాచారం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకున్న వారి వివరాలు చిన్న వీడియోల రూపంలో క్రోడీకరిస్తే రైతులకు ఉపయోగపడుతుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. 

 - జి.మాధవి, ఎంపీ, అరకు

* పొరుగున ఉన్న తమిళనాడులో రైతు పెట్టిన పెట్టుబడిలో కొంత మొత్తం ప్రభుత్వం అందజేస్తుంది. ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుంది. సంకిలి కర్మాగారం పరిధిలో వరికి ప్రత్యామ్నాయ పంటగా రైతులు చెరకు వైపు వెళుతున్నారు. వారికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలి.

- పి.విక్రాంత్‌, ఎమ్మెల్సీ, పాలకొండ

* భామినిలో శీతల గిడ్డంగులు నిర్మించాలి. అనాస, జీడి పంటలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే గిరిజనులకు మేలు జరుగుతుంది. జిల్లాలో ఏనుగులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

- వి.కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ

* జిల్లాలో సాగునీటి వనరులను అభివృద్ధి పరచాలి. ఈ పంట నమోదులో ముందున్నాం. ధాన్యం కొనుగోలుకు అధికారులు భరోసా ఇస్తున్నారు. గతేడాది ప్రకృతి సహకరించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలి.

  - ఎ.జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం, వి.నాగేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు

* ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం తగ్గించాలి. తేలికపాటి, చిన్న యంత్రాలను అందించాలి. జంఝావతి హై లెవెల్‌ కాలువ పనులు పూర్తి చేయాలి. ఏనుగులను దూరంగా తరలించి, గిరిజనులకు అల్లం, పసుపు విత్తనాలు అందించాలి. ఉద్యాన పంటలకు ప్రోత్సాహం, ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.

- రైతులు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని