logo

నేర వార్తలు

సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి సొంతూరు వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

Updated : 24 Jan 2023 07:23 IST

కారు టైరు పేలి.. ప్రాణం తీసింది

శంకరరావు (పాతచిత్రం)

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి సొంతూరు వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ లోపు జరిగిన అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో విషాదాన్ని నింపాడు. గరుగుబిల్లి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై రాజేశ్‌ తెలిపిన వివరాల మేరకు.. జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడువలసకు చెందిన కొత్తాడ శంకరరావు(25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పండగకు ఇంటికి వచ్చిన ఆయన త్వరలో వెళ్లాల్సి ఉంది. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తుండగా పిట్టలమెట్ట వద్ద ఎదురుగా వస్తున్న కారు టైరు పంక్చరై ఇతని ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడకి చేరుకొని బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


గుర్తుతెలియని వాహనం ఢీకొని చోదకుడి మృతి

పాచిపెంట, న్యూస్‌టుడే: వాహనం ఢీకొని చోదకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పి.కోనవలస జాతీయ రహదారిపై జరిగింది. హెచ్‌సీ కృష్ణారావు వివరాల మేరకు.. పి.కోనవలస గ్రామానికి చెందిన సింగారపు తవిటినాయుడు(31) పదో తరగతి పూర్తిచేశాడు. ఇంటి వద్ద చిల్లర దుకాణం నడుపుతూనే మరోవైపు లారీ చోదకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం వేకువ జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు స్థానికంగా ఉన్న రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం డీకొంది. అక్కడివారు గమనించి సాలూరులోని ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఇతనికి తల్లిదండ్రులు ఎరకమ్మ, రాము, ఓ సోదరుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం: ఇద్దరికి తీవ్రగాయాలు

మాకవరపాలెం, న్యూస్‌టుడే: బీటెక్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బైక్‌పై వేగంగా వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఎస్సై రామకృష్ణారావు వివరాల ప్రకారం కోనసీమ జిల్లా పొదలాడకు చెందిన ఎల్‌.తరుణ్‌బాబు(20), విజయనగరం జిల్లా పాలవలసకు చెందిన ఎస్‌.దినేష్‌(20), శ్రీకాకుళం జిల్లా గొట్టివాడకు చెందిన ఆర్‌.లోకేశ్‌(20) రాచపల్లిలోని అవంతి కళాశాలలో చదువుతున్నారు. ఆదివారం ద్విచక్రవాహనంపై నర్సీపట్నం వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో తిరిగి వస్తుండగా.. కళాశాల సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టారు. తరుణ్‌బాబు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.


వివాహిత ఆత్మహత్యాయత్నం

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: తన మరిది శారీరకంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం మండలంలోని కాశిందొరవలసకు చెందిన వివాహిత దాసరి రామలక్ష్మి కొన్నిరోజుల కిందట తన మరిది సత్యనారాయణ వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. రెండ్రోజులుగా కేసు విషయమై ఆమె పోలీసులను అడగగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తనకు సత్వర న్యాయం చేయాలని డిమాండు చేస్తూ సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


ప్రధానోపాధ్యాయుడి అరెస్టు

సంతకవిటి: మండలంలోని ఓ పాఠశాల విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు అప్పలరాజును అరెస్టు చేసినట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు. దిశ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిందని, అనంతరం కోర్టులో హాజరు పరిచామన్నారు.


మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: మత్తు కలిగించే నిషేధిత ఇంజెక్షన్లను యువతకు విక్రయిస్తున్న ముఠాను విశాఖ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులు అరెస్టు చేశారు. ఎన్‌ఎస్‌టీఎల్‌ గేటు వద్ద విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కలిసి దాడులు జరిపారు. విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంకు చెందిన చందు, పెందుర్తికి చెందిన కె.కల్యాణ్‌సాయి, ఎం.గణేష్‌, భీమునిపట్నంకు చెందిన కె.హరిపద్మరాఘవరావును అరెస్టు చేశారు. వారి నుంచి 94 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీకి చెందిన ఆసిమ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన అనుపమ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నాలుగు ఫోన్లు, ద్విచక్రవాహనం, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని