logo

దూరాభారం!

జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రజల అవసరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పాత రహదారులను నియోజకవర్గాల మధ్య అనుసంధానం చేస్తే మరింత సౌకర్యం ఏర్పడుతుంది.

Updated : 30 Jan 2023 06:26 IST

నియోజకవర్గాల మధ్య  రహదారులకు మోక్షమేదీ?
నిధులున్నా కానరాని ప్రగతి
న్యూస్‌టుడే, గజపతినగరం, బొబ్బిలి, గరివిడి

జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రజల అవసరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పాత రహదారులను నియోజకవర్గాల మధ్య అనుసంధానం చేస్తే మరింత సౌకర్యం ఏర్పడుతుంది. గజపతినగరం, బొబ్బిలి, చీపురుపల్లి నియోజకవర్గాల్లో నాలుగేళ్ల కిందట ఏపీఆర్‌ఆర్‌ పథకంలో రూ.120 కోట్లతో 64 పనులు మంజూరు చేశారు. వాటిలో 24 పూర్తి కాగా 15 పనులను ప్రారంభించలేదు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

* గజపతినగరం నియోజకవర్గంలో మర్రివలస వంతెన నిర్మాణం, పాపయ్యవలస, కరకవలస రహదారుల పనులు ప్రారంభించాల్సి ఉంది. మరడాం, మర్రివలస, ఎస్‌.చింతలవలస పనులు జరుగుతుండగా.. గోభ్యాం, వంగర గ్రామాల్లో ప్రారంభదశలో ఉన్నాయి.

* బొబ్బిలిలో 20 పనులు ప్రారంభదశలో ఉన్నాయి. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో ఆరు పూర్తి కాగా.. మరో పది ప్రారంభంలోనే మూలుగుతున్నాయి.

* గజపతినగరం నియోజకవర్గంలో కెంగువ రహదారి అభివృద్ధికి రూ.7.5 కోట్లతో ప్రతిపాదనలున్నాయి. ఉపాధి హామీ నిధులతో 50 రహదారులను తారురోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలున్నాయి.

* చీపురుపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులు రూ.24 కోట్లతో 42 రహదారుల అభివృద్ధికి టెండర్లు పిలవాల్సి ఉంది.


ఇది తెర్లాం మండలం ఉద్దవోలు నుంచి గడిముడిదాం మీదుగా రాజాంకు వెళ్లే రహదారి. 5 కి.మీ. రహదారిని అభివృద్ధి చేస్తే బొబ్బిలి, రాజాం నియోజకవర్గాల మధ్య కొన్ని గ్రామాలకు దగ్గర దారి ఏర్పడుతుంది. చదును చేసే పనులకు రూ.6 లక్షలు వినియోగించారు. అభివృద్ధి పనులకు రూ.1.5 కోట్ల ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. సాంకేతిక సమస్యలతో పనులు నిలిచిపోయాయని పీఆర్‌ ఏఈఈ రుక్మాంగదనాయుడు తెలిపారు.

న్యూస్‌టుడే, తెర్లాం


ఇది గజపతినగరం మండలం వేమలి, దత్తిరాజేరు మండలం ఎం.కొత్తవలస గ్రామాల రహదారి. మధ్యలో కొండవాగుకు కల్వర్టు నిర్మించాల్సి ఉంది. రెండు కి.మీ. రహదారిని అభివృద్ధి చేస్తే చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల మధ్య దూరం తగ్గుతుంది. రెండు దశాబ్దాల కిందట నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 


సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం నుంచి బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలాన్ని కలిపే రహదారిలో ఎర్రిగెడ్డపై వంతెన నిర్మిస్తే రాకపోకలు సులభమవుతాయి. మెంటాడ మండల వాసులు నేరుగా బొబ్బిలి డివిజన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు 20 కి.మీ. దూరం తగ్గుతుంది. పోరాం ఉన్నత పాఠశాల సమీపంలో రహదారి నిర్మాణానికి గ్రావెల్‌ వేసి వదిలేశారు. రహదారి, వంతెన నిర్మాణ పనులను ప్రతిపాదించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 

న్యూస్‌టుడే, మెంటాడ


దగ్గర దారులకు ప్రతిపాదనలేవీ?

కొత్తగా జిల్లాల స్వరూపం మారిన నేపథ్యంలో చిన్న చిన్న రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. గజపతినగరం, గుర్ల మండలాల్లో మునకాలపేట రోడ్డు, కెంగువ వద్ద కల్వర్టు, వేమలి నుంచి ఎం.లింగాలవలస రహదారి, బాడంగి మండలంలో గొల్లాది వద్ద వంతెన, మెంటాడ మండలంలో పోరాం వద్ద ఎర్రిగెడ్డపై కల్వర్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రాజాం, తెర్లాం మండలాల మధ్య చిన్న రహదారులను అభివృద్ధి చేయాలి. వీట మంజూరుకు ప్రయత్నిస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.


పనులు వేగవంతం చేయిస్తాం
- అప్పలనాయుడు, రమణమూర్తి, రామ్మోహనరావు,  పీఆర్‌ ప్రాజెక్టు విభాగం డీఈఈలు, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి 

ఏపీఆర్‌ఆర్‌పీ నిధులతో మంజూరైన రహదారుల పనులు ప్రారంభమయ్యాయి. వాటిని వేగవంతం చేయిస్తాం. రహదారుల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం, ఏఎంసీ నిధులతో ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని