logo

ఊరొదిలి.. ఇళ్లొదిలి ఎక్కడికి పొమ్మంటారు!

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2200 ఎకరాలు అవసరం కాగా.. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం మరో 500 ఎకరాలు సేకరించింది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33, బొల్లింకలపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు.

Updated : 31 Jan 2023 05:45 IST

ఈనాడు-విజయనగరం, భోగాపురం, న్యూస్‌టుడే

ఓ వైపు పునరావాస కాలనీల్లో ఇంకా గృహాల నిర్మాణం జరుగుతోంది. మరో వైపు ఆదివారం అధికారులు వచ్చి గ్రామాలు ఖాళీ చేయండి.. మీరున్న ఇళ్లు కూల్చేస్తామనడంతో కంగుతిన్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితులు. పోనీ.. కాలనీలో సదుపాయాలు ఉన్నాయా అంటే పనులు కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు ఊరొదిలి పొమ్మంటే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2200 ఎకరాలు అవసరం కాగా.. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం మరో 500 ఎకరాలు సేకరించింది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33, బొల్లింకలపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గూడెపువలసలో 17 ఎకరాలు, పోలిపల్లి రెవెన్యూ లింగాలవలసలో 25 ఎకరాల్లో కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇళ్లు చాలావరకు నిర్మాణంలో ఉండగా గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. వెళ్లకపోతే విద్యుత్తు, నీటి సరఫరా ఆపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ముడసర్లపేట, బొల్లింకపాలెంలో నాలుగు ఇళ్లతో పాటు ఒక పాఠశాల భవనాన్ని జేసీబీలతో తొలగించారు.

చదువులు అగమ్యగోచరం

నిర్వాసిత గ్రామాల్లోని పాఠశాలలు మూసేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చదువుతున్న పిల్లలను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. శనివారం రాత్రి ఆయన చరవాణి ద్వారా ఓ వాయిస్‌ మెసేజ్‌ పంపించారు. అందులో ‘రేపు ఉదయం పాఠశాలలను కూల్చేస్తారు. ముందుగానే నోటీసు ఇచ్చినట్లు భావించండి. విలువైన రిజిస్టర్లు, రికార్డులు, సామగ్రి సురక్షిత ప్రదేశానికి తరలించండి. ఉపాధ్యాయులు, సిబ్బంది సెలవులు పెడితే నాకు సంబంధం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే మీరే బాధ్యులు.’’ అని ఉంది. దీంతో ఆదివారం ఉపాధ్యాయులంతా విధుల్లో ఉండి సామగ్రిని తరలించారు.

అంతన్నారు.. ఇంతన్నారు

ఇంటి గ్రాంటు రూ.2.75 లక్షలు, ఆర్థిక సాయం రూ.5 లక్షలు, తాత్కాలిక భృతి నెలకు రూ.3 వేల చొప్పున 12 నెలలకు రూ.36 వేలు, పాత గ్రామం నుంచి నిర్వాసిత గ్రామానికి రవాణా ఛార్జీలు రూ.50 వేలు, పశువులశాలలు లేదా బడ్డీలకు రూ.25 వేలు, కుల వృత్తులు, చిరు వ్యాపారులకు రూ.25 వేలు, రీసెటిల్‌మెంట్‌ అలవెన్స్‌ రూ.50 వేలు ఇస్తామని ముందుగా ప్రకటించారు. కానీ రూ.9.20 లక్షల చొప్పున నిర్వాసితుల ఖాతాలో జమ చేశారు. ఈ మొత్తంలో దేనికి ఎంత అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. చాలామంది ఈ మొత్తం ఇంటి కోసం ఇచ్చారని, మిగతావి తర్వాత ఇస్తారేమోనని భావిస్తున్నారు. సామగ్రి తరలించడానికి రూ.50 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్థానికులు కాదు.. పరిహారం ఇవ్వలేం

ఆ నాలుగు గ్రామాల నుంచి చాలామంది పొట్ట కూటి కోసం విశాఖ, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలామంది ప్రతి నెలా రాలేక  సరకులు ఉన్నచోటే తీసుకోవచ్చనే ఉద్దేశంతో రేషన్‌, ఆధార్‌ కార్డులను బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడిదే వారికి శాపంగా మారింది. వీరంతా స్థానికులు కాదని, పునరావాస కాలనీలో స్థలం, ఇళ్లను కేటాయించలేదు. వారంతా కొన్ని నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పుట్టిన ఊరిని వదిలేసి ఇప్పుడు తమను ఎక్కడికి వెళ్లమంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే పునరావాస కాలనీలో ఇల్లు కట్టుకుంటామని సుమారు 74 కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఊరు వదిలి వెళ్లే సమయంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు సుమారు 70 మంది వరకు ఉన్నారు.

తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి... నిర్వాసితులంతా పునరావాస కాలనీలోనే తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వలస వెళ్లిన వారి విషయంలో నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటికి మూడేళ్ల ముందు వరకు గ్రామంలో ఉంటే పరిహారం అందించాం. గ్రామసభలు ఏర్పాటు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. గ్రామం వదిలేసి వెళ్లే నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అడుగుతున్నారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది.


లింగాలవలస కాలనీలో నిర్మించిన ఈ పాఠశాల భవనానికి  విద్యుత్తు సదుపాయం కల్పించలేదు. మరుగుదొడ్లు, మూత్ర     శాలలు కడుతుండగా తాగునీటి అవసరాలకు బోరు వేయలేదు. మధ్యాహ్న భోజనం వంటగది కానరాలేదు. ఇవన్నీ ఇలా ఉండగా.. పాత గ్రామాల్లో పాఠశాలలను మూసేస్తున్నారు.


ఈ రెండు చిత్రాల్లో మొదటిది బొల్లింకలపాలెంలోని ప్రాథమిక పాఠశాల. బడి మూసేయడంతో తాత్కాలికంగా వరండాలో పిల్లలు కూర్చుని చదువుకుంటున్నారు. ఇక్కడి సామగ్రి అంతా పక్కనే ఉన్న గుడిసెలో ఉంచారు. రెండో చిత్రమే అది. ఇక్కడ ఏడుగురు విద్యార్థులుండగా.. ఐదుగురు సమీపంలోని రాళ్లపాలెం నుంచి వస్తారు. వీరంతా చదువుకోవాలంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని గూడెపువలస లేదా దల్లిపేటకు వెళ్లాలి.


లింగాలవలసలో నిర్వాసితుల పునరావాస కాలనీ ఇది. ఇక్కడ చాలా ఇళ్లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. కొందరు డబ్బులు చాలక పనులు ఆపేశారు. అధికారులు ఉన్న ఫళంగా వెళ్లిపోమంటే పూర్తి కాని ఇళ్లల్లో ఎక్కడ ఉండాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.


బొల్లింకలపాలెంలో ఓ నిర్వాసితుడి ఇంటిని ఆదివారం కూల్చేయడంతో సమీపంలోని ఓ పూరి గుడిసెలో తలదాచుకుంటున్నారు. కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి కాలేదని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని