logo

లారీ ఢీకొని 34 గొర్రెల మృత్యువాత

లారీ డ్రైవరు నిర్లక్ష్యం.. 34 జీవాల మృతికి కారణమైంది. పోలీసుల వివరాల మేరకు.. లక్కవరపుకోట మండలం కిత్తన్నపేటకు చెందిన దుక్క గంగునాయుడు, యలమల సూరిబాబు, బర్నికాన అంజి, గొలగాని భూలోక సోమవారం వేకువజామున 300 గొర్రెలను కొత్తవలస నుంచి స్వగ్రామానికి తోలుకెళ్తున్నారు.

Updated : 31 Jan 2023 05:44 IST

కొత్తవలస, న్యూస్‌టుడే: లారీ డ్రైవరు నిర్లక్ష్యం.. 34 జీవాల మృతికి కారణమైంది. పోలీసుల వివరాల మేరకు.. లక్కవరపుకోట మండలం కిత్తన్నపేటకు చెందిన దుక్క గంగునాయుడు, యలమల సూరిబాబు, బర్నికాన అంజి, గొలగాని భూలోక సోమవారం వేకువజామున 300 గొర్రెలను కొత్తవలస నుంచి స్వగ్రామానికి తోలుకెళ్తున్నారు. అడ్డువానిపాలేనికి సమీపంలో మందపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో 34 గొర్రెలు  అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. లారీ డ్రైవరు పరారయ్యాడు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హఠాత్పరిణామానికి కాపరి భూలోక కుప్పకూలారు. మిగిలిన వారు గమనించి అతన్ని 108లో ఎస్‌.కోట ప్రాంతీయాసుపత్రికి తరలించారు. కొత్తవలస ప్రభుత్వ పశువుల ఆసుపత్రి సహాయ సంచాలకుడు గంగాధర్‌ గాయపడిన వాటికి వైద్యం చేశారు. సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరజనార్దన్‌ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. అధికారులు స్పందించి బాధితులకు పరిహారం అందించాలని కోరారు. ఆమె వెంట ఎల్‌.కోట మాజీ ఎంపీపీ రమణమూర్తి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కె.ఈశ్వరరావు తదితరులున్నారు.

కాపరుల ఆవేదన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని