logo

అధ్యక్షా.. కూత పట్టించుకోరూ!!

పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారాక సాలూరు పట్టణ ప్రాధాన్యం పెరిగింది. కొఠియా, మన్యం, మైదాన ప్రాంతాలు కలగలిపి ఉండడం, పెద్దఎత్తున పత్తి, వరి, ఉద్యాన పంటల పండుతుండడంతో ఇక్కడి నుంచి రాకపోకలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Updated : 31 Jan 2023 05:44 IST

సాలూరు, న్యూస్‌టుడే

పిచ్చిమొక్కలతో నిండిన రైల్వేస్టేషన్‌, ట్రాక్‌

పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారాక సాలూరు పట్టణ ప్రాధాన్యం పెరిగింది. కొఠియా, మన్యం, మైదాన ప్రాంతాలు కలగలిపి ఉండడం, పెద్దఎత్తున పత్తి, వరి, ఉద్యాన పంటల పండుతుండడంతో ఇక్కడి నుంచి రాకపోకలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈమేరకు రవాణా సౌకర్యం లేదు. ప్రధానంగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే లైన్‌ వ్యవస్థ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం స్టేషన్‌ ఉన్నా.. నిరుపయోగంగా దర్శనమిస్తోంది. పునరుద్ధరిస్తామని, బాగు చేస్తామని ఏళ్ల నుంచి పాలకులు చెబుతున్నా.. ఆ హామీలన్నీ నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర రాష్ట్ర ఉన్నతాధికారుల ద్వారా సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడారు. దీంతో మరోసారి అభివృద్ధి మాట వినిపిస్తోంది. ఈసారైనా మోక్షం కలుగుతుందని అంతా భావిస్తున్నారు.

సాలూరులోని రైల్వేస్టేషన్‌ ఉమ్మడి జిల్లాలోనే పురాతనమైనది. బ్రిటిష్‌ వారి కాలంలో ఇక్కడి నుంచి పెద్దఎత్తున ఎగుమతులు జరిగేవి. ఇతర ప్రాంతాల నుంచి రోజూ పదుల సంఖ్యలో గూడ్సులొచ్చేవి. దీంతో రానురానూ అభివృద్ధి చెందుతుందని భావించినా.. నిర్వహణ లోపం.. పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. ప్రయాణికుల సౌకర్యార్థం సాలూరు- బొబ్బిలి మధ్య డీజిల్‌ ఇంజిన్‌తో రెండు బోగీలు తిరిగేవి. అయితే 1998లో ఏకంగా స్టేషన్‌నే మూసేశారు. అనంతరం రైలు బస్సు నడిపారు. సాలూరు, శివరాంపురం, పారన్నవలస, భవానీపురం, రొంపల్లి, మిర్తివలస, నారాయణప్పవలస తదితర గ్రామాలమీదుగా రోజూ అయిదు ట్రిప్పులు నడిచేది. ప్రస్తుతం ఆ పరిస్థితి దూరమైంది.

వినతులే మిగిలాయ్‌..: అభివృద్ధి చేయాలని, కొత్త రైళ్లు నడపాలని అప్పట్లో మాజీ ఎంపీ గీత, ప్రస్తుత ఎంపీ జి.మాధవి సంబంధిత అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చారు. దీంతో స్పందించి విద్యుత్తు లైన్‌ వేసి వదిలేశారు. అరకు, బొర్రా, సాలూరు, పార్వతీపురం స్టేషన్లను మోడల్‌గా మార్చాలని ఎంపీ మాధవి ఇటీవల విన్నవించారు.

అధ్వానంగా ప్రవేశమార్గం

రూ.కోట్లతో అభివృద్ధి చేసినా..

సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా పార్వతీపురం, రాయగడ, అక్కడి నుంచి విశాఖ వరకు పాసింజర్‌ నడపాలని గతంలో ప్రతిపాదన చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో పునరుద్ధరణ పనులతో పాటు రూ.కోట్లు ఖర్చు చేసి విద్యుత్తు లైన్‌ కూడా వేశారు. దండిగాం రోడ్డు వద్ద ప్రయాణికులు వేచి ఉండేందుకు షెల్టర్‌ నిర్మించారు. 2017లో రైల్వే డివిజనల్‌ అధికారులు పరిశీలించారు. దీంతో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ కొవిడ్‌ నేపథ్యంలో స్టేషన్‌ ఇతర ప్రాంతాలవారికి పార్కింగ్‌ స్థలంగా మారిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన రైళ్లను ఇక్కడ కొన్ని నెలలపాటు నిలిపారు. కొవిడ్‌ ఆంక్షలు తొలగాయి కానీ, రైలు రాలేదు. గతంలో నడిపిన రైలు బస్సు పునరుద్ధరించలేదు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

ప్రస్తుతం స్టేషన్‌ పరిసరాలు, దండిగాం రోడ్డులో నిర్మించిన షెల్టర్‌ అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా మారాయి. విద్యుత్తు లైన్లు, ట్రాక్‌ అధ్వానంగా మారింది. గచ్చులన్నీ ఊడిపోయాయి. ఈదురు గాలులకు షెల్టర్ల రేకులు గాలికి ఎగిరిపోయాయి. ఫ్లాట్‌ఫాం అంతా కలుపు మొక్కలతో నిండిపోయింది. గోడలు బీటలువారి, టైల్స్‌ పగిలిపోయాయి.

మళ్లీ విన్నవిస్తాం..: ఇప్పటికే ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేశాం. సానుకూలంగా స్పందించారు. సేవలు పునరుద్ధరిస్తే పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాం. సాలూరు నుంచి జిల్లా కేంద్రం పార్వతీపురం వెళ్లేందుకు రైలు ఎంతో అవసరం. ఇతర రవాణాకూ ఉపయోగం. ఈ విషయాలను తెలియజేశాం. అవసరమైతే ప్రభుత్వం ద్వారా మరోసారి విన్నవిస్తాం.

పి.రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని