logo

తరుణం ఆసన్నం

ఏటా బ్యాంకులు పరపతి ప్రణాళికలు తయారు చేసినా... కొన్ని రంగాలకు సంబంధించి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి.

Published : 01 Feb 2023 03:05 IST

నాబార్డు ప్రణాళికను విడుదల చేస్తున్న అధికారులు

ఈనాడు-విజయనగరం, విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఏటా బ్యాంకులు పరపతి ప్రణాళికలు తయారు చేసినా... కొన్ని రంగాలకు సంబంధించి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. తాజాగా ఉమ్మడి జిల్లాలో 2023-24 ఏడాదికి గానూ మళ్లీ పరపతి ప్రణాళికల రూపకల్పనకు సిద్ధమవుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణాలకు పెద్దపీట వేయనున్న నేపథ్యంలో ముందునుంచే లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

వివరాలిలా...:  

అన్ని రంగాలకు రుణ సామర్థ్య అంచనా ప్రణాళికను ఏటా నాబార్డు తయారు చేస్తుంది. దీని ఆధారంగానే జిల్లా స్థాయిలో లీడ్‌ బ్యాంకు రుణ లక్ష్యాలను రూపొందిస్తుంది. గత నెల 23న పీఎల్‌పీ (పొటెన్షియల్‌ లింక్‌డ్‌ ప్లాన్‌)ని నాబార్డు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో రూ.10,028.45 కోట్లతో ప్రణాళిక రూపొందించగా, విజయనగరానికి రూ.6095.92 కోట్లు, పార్వతీపురం మన్యానికి రూ.3932.53 కోట్లుగా పొందుపర్చారు. దీన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదానికి పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.

గతేడాది కౌలురైతులకు మొండి చేయి..:

కౌలు రైతులకు బ్యాంకర్లు మొండిచెయ్యే చూపిస్తున్నారు. జిల్లాలో సుమారు 4 లక్షల మంది రైతులుండగా.. 30 నుంచి 40 శాతం కౌలురైతులే ఉంటారు. వీరికి సీసీఆర్సీ గుర్తింపు కార్డులివ్వడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇవి ఉంటేనే ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. భూ యజమానులు సైతం భూమిని కౌలుకు ఇచ్చినట్లు సాగుదారులకు అంగీకార పత్రాలు ఇవ్వడం లేదు. 2022-23 ఏడాదిలో ఐదు వేల మంది కౌలురైతులను అర్హులుగా గుర్తించగా, 2 వేల మంది వివరాలనే బ్యాంకులకు అందించారు. మార్చి నాటికి అందరికీ రుణసాయం చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నా.. రబీలో అవసరాలు ఎక్కువగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విద్యా రుణాలకు వెనుకడుగు..:

ఉన్నత, విదేశీ విద్య చదువుకొనే విద్యార్థులకు రుణాలు ఇవ్వడంలో 2022-23 ఏడాదికి సంబంధించి లక్ష్యాలు చేరుకోలేదు. అడ్డగోలు నిబంధనలు, పూచీకత్తు సమర్పణ వంటి వాటితో చాలామంది ప్రైవేటు రుణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి రూ.35.89 కోట్లు లక్ష్యాలు నిర్దేశించుకోగా.. నవంబరు వరకు రూ.18 కోట్లు మాత్రమే ఇచ్చారు. వచ్చే ఏడాదికి నాబార్డు రుణ ప్రణాళికలో రూ.38.60 కోట్లు ప్రతిపాదించింది. ఈసారైనా సాధించాలని ఆశిద్దాం.

పరిశ్రమలకు చేయూత..:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి 303 మందికి రుణాలు మంజూరు చేయగా..138 మందికి విడుదల చేశారు. ఇంకా 189 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వచ్చే ఏడాది పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే కొన్నింటికి క్లస్టర్‌ విధానంలో ప్రతిపాదించారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా రుణసాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భీమాళిలో తాండ్ర నిల్వకు శీతల కేంద్రం, రామభద్రపురం మండలంలో బెల్లం పొడి పరిశ్రమ, బుదరాయవలసలో ఇత్తడి బిందెల తయారీ, రూ.5 కోట్లతో తవుడు నుంచి నూనె తయారీ పరిశ్రమలకు రుణాలు ఇచ్చే అంశాన్ని ప్రణాళికలో చేర్చే అవకాశముంది.

* ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో వాటి సాగును ప్రోత్సహించనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు(ఎఫ్‌పీవో) ఇప్పటికీ నాబార్డు నేరుగా రుణ సాయమందిస్తోంది. ఈ ఏడాదిలో ఆయా సంస్థలకు రుణాలు అందించేలా లక్ష్యం నిర్దేశించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 50కి పైగా ఇవి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఇటీవల కొత్తగా 16 ఎఫ్‌పీవోలు అనుమతి పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది రూపొందించుకున్న లక్ష్యాలను చేరుకుంటామని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల లీడ్‌ బ్యాంకు ప్రబంధకులు ఎ.శ్రీనివాసరావు, మూర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు