logo

మీరూ..స్టీరింగ్‌ తిప్పేయండి

భారీ వాహనాలు నడపాలని ఉందా.. శిక్షణ పొందేందుకు మీ సమీపంలో ఎలాంటి సంస్థలూ లేవా.. అయితే తమ దగ్గరకు రండి అంటోంది ఆర్టీసీ.

Published : 01 Feb 2023 03:05 IST

ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ

న్యూస్‌టుడే, విజయనగరం కోట: భారీ వాహనాలు నడపాలని ఉందా.. శిక్షణ పొందేందుకు మీ సమీపంలో ఎలాంటి సంస్థలూ లేవా.. అయితే తమ దగ్గరకు రండి అంటోంది ఆర్టీసీ. లారీలు, బస్సులతో పాటు ఇతర పెద్దతరహా వాహనాల చోదకానికి తర్ఫీదునిస్తోంది. సాధారణంగా చాలాచోట్ల కార్లు, ఇతర వాటికి సంబంధించి మెలకువలు నేర్పిస్తారు. కానీ ఇక్కడ అన్నివిభాగాల వారూ చేరొచ్చు. కేవలం ఆర్టీసీ సిబ్బందికే కాకుండా బయటవారు సైతం ప్రవేశాలు పొందవచ్చు. తద్వారా పలువురికి ఉపాధి బాటలు వేస్తూనే ఆదాయాన్ని ఆర్జిస్తోందని ప్రజా రవాణా సంస్థ. విజయనగరం జిల్లా కేంద్రంలో జోనల్‌ శిక్షణా కళాశాల పేరుతో ఈ సేవలు అందిస్తోంది.

 

డ్రైవింగ్‌కు ఉపయోగిస్తున్న బస్సు

చేరాలంటే ఇలా..

శిక్షణ పొందాలనుకునే వారు సమీపంలోని ఆర్టీసీ అధికారులను సంప్రదించాలి. చిన్నతరహా వాహనాలు నడిపేందుకు రవాణాశాఖ ఇచ్చిన లైసెన్స్‌ ఉండాలి. భారీ అయితే ఎల్‌ఎల్‌ఆర్‌ తప్పనిసరి. కొత్తగా కావాలంటే దరఖాస్తు సైతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు అందిస్తే ప్రవేశం కల్పిస్తారు. 40 రోజుల పాటు మెలకువలు నేర్పిస్తారు. ఒక్కో అభ్యర్థీ రూ.23,600 చెల్లించాలి. ప్రక్రియ పూర్తయిన తరువాత ధ్రువపత్రం అందిస్తారు. ఆర్టీసీ ఆమోద ముద్ర ఉండడంతో దీనికి ఎంతో విలువ ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

చోదకమే కాదు..

అభ్యర్థులకు చోదకంతో పాటు అత్యవసర సమయాలు, విపత్తులు సంభవించేటప్పుడు ఎలా వ్యవహరించాలో నేర్పుతారు. టైర్లు మార్చడం, ఇంజిన్‌లో సమస్యలను పరిష్కరించడం, ఇతరత్రా మరమ్మతులను సొంతంగానే చేసుకోవడం, వేగం, డీజిల్‌ పొదుపు.. తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 10 బృందాలు చేరాయి. ఒక్కో బ్యాచ్‌లో 16 మంది చొప్పున ఉంటారు. త్వరలో 11 బ్యాచ్‌ రానుంది.

సొంత వారికి కూడా..

ఆర్టీసీలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి కూడా ఈ కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈమేరకు ప్రతి డిపోలో ఒక సేఫ్టీ డ్రైవింగ్‌ ఇనస్ట్రక్టర్‌ను నియమించారు. వీరు ఎప్పటికప్పుడు బస్సులు నడపడంపై సూచనలు చేస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అధికంగా ఇంధనాన్ని వాడడం, ప్రమాదాలకు పాల్పడేవారిని గుర్తించి, ఇక్కడ చేర్పిస్తారు. ఇలా ఇప్పటివరకు 24 మంది వరకు చేరారు. అలాగే పొరుగు సేవల డ్రైవర్లు ఇక్కడ తప్పనిసరిగా శిక్షణ పొందాలని అధికారులు ఆదేశించారు.

ఇంజిన్‌పై అవగాహన కల్పిస్తున్న నిపుణులు

శిక్షణలో భాగంగా టైరు మార్చుతున్న అభ్యర్థులు


ఆసక్తి ఉన్నవారికి అవకాశం..

ఆసక్తి గలవారు ఎవరైనా రావొచ్చు. తమను సంప్రదిస్తే ప్రవేశాలు కల్పిస్తాం. తరగతుల నిర్వహణకు నిపుణులైన సిబ్బందిని నియమించాం. వారు అభ్యర్థులకు తగిన సూచనలు చేస్తారు. అభ్యర్థుల్లో ఎవరైనా బాగా రాణిస్తే.. అవసరం మేరకు ఆర్టీసీలో పొరుగు సేవల కింద తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

కె.శ్రీనివాసరావు, ప్రజా రవాణా అధికారి, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని