logo

పురాల ఆశలపై నీళ్లు !

ఉమ్మడి జిల్లాల్లోని పట్టణాలు, నగర పంచాయతీల్లో ఇంటింటికీ శుద్ధ జలం అందించేందుకు ప్రభుత్వం ఏఐఐబీ (ఏషియన్‌ మౌలిక సదుపాయాల కల్పన బ్యాంకు) నిధులతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులకు అయిదేళ్లుగా అడుగులు పడడం లేదు.

Published : 05 Feb 2023 04:20 IST

ఇంటింటికీ శుద్ధ్ధ జలం పనుల్లో కానరాని పురోగతి

 మే నెల నాటికి పూర్తి ప్రశ్నార్థకమే

బొబ్బిలిలో వీధి కుళాయి వద్ద కష్టాలు

బొబ్బిలి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల్లోని పట్టణాలు, నగర పంచాయతీల్లో ఇంటింటికీ శుద్ధ జలం అందించేందుకు ప్రభుత్వం ఏఐఐబీ (ఏషియన్‌ మౌలిక సదుపాయాల కల్పన బ్యాంకు) నిధులతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులకు అయిదేళ్లుగా అడుగులు పడడం లేదు. అయిదు పట్టణాల్లో పనులు ఈ ఏడాది మే నెల నాటికి పూర్తి కావాల్సి ఉన్నా, చాలాచోట్ల 10-20 శాతం కూడా అయిన దాఖలాలు లేవు. దీంతో ‘పట్టణాల్లో రానున్న 30 ఏళ్లల్లో తాగునీటి ఇబ్బందులు ఉండకూడదు.. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా జలాలు అందివ్వాలి’ అన్న ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోంది. 

నిధులే అసలు సమస్య

ఈ నిర్మాణాలకు బ్యాంకు నిధులు విడుదల చేసినప్పటికీ గుత్తేదార్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి కట్టబెట్టడం, కొన్ని చోట్ల చేసిన పనులకు రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో పూర్తిచేసేందుకు ముందుకు రావడం లేదు. చాలా చోట్ల ప్రారంభించి వదిలేశారు. నదుల్లో మట్టి నమూనాలు సేకరించి ఇసుక ర్యాంపులు తవ్వి వదిలేశారు. పైపులైన్ల సామగ్రి కొనుగోలు చేసి అలాగే ఉంచారు. పట్టణాల్లో కొత్త కుళాయిలకు దరఖాస్తు చేసుకుంటే నీటి లభ్యత లేదని సాకుగా చూపుతున్నారు. గతేడాది అక్టోబరులో మంత్రి బొత్స సత్యనారాయణ బొబ్బిలిలో ఈ పనులకు భూమిపూజ చేశారు. ఆ తర్వాత ఒక అడుగు కూడా వేయలేదు.

ఆరంభ శూరత్వమే

ఈ పనుల కోసం అధికారులు త్వరితగతిన టెండర్లు పూర్తిచేసి, ఓ నిర్మాణ సంస్థకు కట్టబెట్టారు. వేగంగా పూర్తవ్వాలని పైపులైన్ల ఏర్పాటు, రిజర్వాయర్ల నిర్మాణం ఇలా వేర్వేరుగా పనులు విభజించారు. తొలుత నదుల్లో బావులు తవ్వి గ్యాలరీల నిర్మాణం పూర్తి చేయాలి. అక్కడి నుంచి పట్టణాల్లో నిర్మించిన రిజర్వాయర్ల వరకు పైపులైన్లు అమర్చాలి. కీలకమైన వీటి పూర్తికి వేసవి మంచి సమయం. గడువు లోగా చేయకపోతే మళ్లీ పొడిగింపు వ్యవధి కోరాల్సి ఉంటుంది.


గుత్తేదారుకు నోటీసులిచ్చాం  

పనులు ప్రారంభించాలని గుత్తేదారుకు నోటీసు ఇచ్చాం. బిల్లుల్లో కొంత జాప్యం జరగడంతో ఇదిగో.. అదిగో అంటున్నారు. త్వరలోనే ప్రారంభిస్తాం. గతంలో ఇచ్చిన గడువు పూర్తి కావడంతో వచ్చే ఏడాది ఆగస్టు వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇవి పూర్తయితే పురపాలికల్లో తాగునీటి ఇబ్బందులు తొలగుతాయి.
దక్షిణామూర్తి, కార్యనిర్వాహక ఇంజినీరు, ప్రజారోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని