logo

పాడి అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు

ఉమ్మడి జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పశువులకు కొన్నాళ్లుగా ప్రబలుతున్న ముద్దచర్మ వ్యాధి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా రాయితీపై సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకుడు ఆర్‌.నీలయ్య తెలిపారు.

Published : 06 Feb 2023 04:29 IST

న్యూస్‌టుడే, బొబ్బిలి: ఉమ్మడి జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పశువులకు కొన్నాళ్లుగా ప్రబలుతున్న ముద్దచర్మ వ్యాధి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా రాయితీపై సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకుడు ఆర్‌.నీలయ్య తెలిపారు. రానున్న సీజన్‌లో తమ శాఖ చేపట్టబోయే ప్రణాళికలపై ఆయన ఆదివారం ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. 

రాయితీపై దాణా..

ఏటా వేసవిలో పశుగ్రాసం కొరత పాడి రైతులను వేధిస్తోంది. అధిక ధరకు కొనుగోలు చేయలేక పశువులను అమ్మేస్తుండడంతో పాల ఉత్పత్తి తగ్గుతోంది. దీనిని నియంత్రించేందుకు పౌషకాలతో కూడిన దాణాను రాయితీపై అందిస్తున్నాం. కిలో రూ.52 విలువ చేసే ప్యాకెట్ రూ.38లకే ఇస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా, బొబ్బిలి డివిజన్‌లో 76 టన్నుల మేర అందజేస్తాం. చేయూత పథకంలో భాగంగా రైతులు పశువులు కొని ఉపాధి పొందొచ్చు.

పూర్తిస్థాయిలో టీకాలు

రెండు జిల్లాల్లో ముద్ద చర్మవ్యాధి సమీప ఒడిశా సరిహద్దు నుంచి వ్యాపించింది. ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా కొన్నిచోట్ల కేసులు బయటపడుతున్నాయి. నిర్మూలనకు సుమారు లక్ష డోసుల వ్యాక్సిన్‌లు సరఫరా చేశాం. వ్యాధి పూర్తి నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

393 కేంద్రాల్లో పాలసేకరణ

తమ పరిధిలో 393 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 353కి స్థల సేకరణ పూర్తయింది. మిగిలిన వాటికి సంబంధించి గుర్తించాల్సి ఉంది. ఆపై నిర్మాణాలు చేపట్టాక సేకరణ ప్రారంభిస్తాం. విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సేకరించిన పాలను నిల్వ చేసేందుకు కూడా కొన్ని కేంద్రాలను గుర్తించాం. వాటి నిర్మాణానికి స్థల సేకరణ జరుగుతోంది.

పాడి ఉత్పత్తికి చర్యలు

మన్యం జిల్లా, బొబ్బిలి డివిజన్‌ పరిధిలో మొత్తం 2,18,635 పశు సంపద ఉంది. పాడి అభివృద్ధి చేసేందుకు ఆడదూడల ఉత్పత్తి పథకంలో భాగంగా కృత్రిమ గర్భధారణ కోసం రెండు వీర్యనాళికలను రాయితీపై అందిస్తున్నాం. దీని ధర రూ.1600 కాగా రాయితీపై రూ.500 లకే ఇస్తాం. ఒకవేళ ఆడదూడలు పుట్టకపోతే రైతు చెల్లించిన డబ్బులు వాపసు చేస్తాం. జెర్సీ రకాలకు సంబంధించిన చూడు కడుతున్నాం. దీనివల్ల పాడి ఉత్పత్తి పెరుగుతుంది. రైతుకు మెరుగైన ఆదాయం వస్తోంది. మినీ గోకులాల పనులు 72 చోట్ల జరుగుతున్నాయి. ఇటీవలే బిల్లులు చెల్లించాం. కొన్నిచోట్ల సాంకేతిక కారణాలతో నిలిచాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఉంది. ఎవరైనా తరలిస్తే చర్యలు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు