logo

నేర వార్తలు

విజయనగరంలోని బీసీ కాలనీ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Updated : 07 Feb 2023 03:29 IST

రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: విజయనగరంలోని బీసీ కాలనీ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. డెంకాడ మండలం పినతాడివాడ గ్రామానికి చెందిన మీసాల పైడినాయుడు(77) కొన్నాళ్లుగా నగరంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న ఓ విద్యాసంస్థలో కాపలాదారునిగా పనిచేస్తున్నారు. ఉదయం విధి నిర్వహణలో భాగంగా పట్టాలు దాటి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రవివర్మ తెలిపారు.


వాహనం పైనుంచి పడి మహిళ మృత్యువాత

గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రెల్ల గ్రామానికి చెందిన మండంగి పంచమి(35) సోమవారం ఓ వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా కోసంగిభద్ర సమీపంలో కళ్లు తిరిగి పడిపోయారు. తలకు తీవ్రగాయం కావడంతో భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రానికి రిఫర్‌ చేశారు. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


యువకుడి ఆత్మహత్య

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: నగరంలోని రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో ప్లాట్‌ఫాం- 4 సమీపంలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. బొండపల్లి మండలానికి చెందిన ఎన్‌.సన్యాసి(23) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం విజయనగరం వచ్చి తిరిగి వెళ్లే సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి ఎవరూ లేరని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్సై రవివర్మ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


శాలకు నిప్పు: నిందితుడికి జైలు

తెర్లాం, న్యూస్‌టుడే: పశువుల శాలకు నిప్పుపెట్టి అందులోని ఆవు, లేగదూడ మృతికి కారకుడైన వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ బొబ్బిలి పీజేసీజే, జేఎఫ్‌సీఎం కోర్టు మేజిస్ట్రేట్‌ సరోజనమ్మ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ఆర్‌.రమేష్‌ తెలిపారు. సోమవారం పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. తెర్లాం మండలంలోని రాజయ్యపేటకు చెందిన రెడ్డి సింహాచలం గతేడాది మార్చి 14న అదే గ్రామంలో ఉన్న పశువుల శాలను కాల్చేశాడు. దీంతో అందులోని ఆవు, దూడ సజీవదహనమయ్యాయి. దీనిపై అప్పట్లో బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి బొబ్బిలి కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు ఇచ్చారని, కేసును ప్రభుత్వ న్యాయవాది నరేష్‌ వాదించారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు