logo

కూ..చుక్‌చుక్‌..కూత వినపడేనా!

రైలు బస్సు.. ఇటు విజయనగరం, అటు పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైలు.

Updated : 21 Mar 2023 07:29 IST

నిలిచిన ‘రైలుబస్సు’ సేవలు
బొబ్బిలి- సాలూరు పాసింజర్‌ రైలుకు ప్రతిపాదనలు

సాలూరుకు వెళ్లే ట్రాకుపై మరో రైలు నిలిపివేత

బొబ్బిలి, న్యూస్‌టుడే: రైలు బస్సు.. ఇటు విజయనగరం, అటు పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైలు. బొబ్బిలి- సాలూరు మధ్య నడిచే ఈ రైలు బస్సు సేవలు మూడేళ్లుగా నిలిచిపోయాయి. పదేళ్ల పాటు నడిచిన దీని ద్వారా ఈ మార్గంలో అనుకున్న మేర ఆదాయం రావడంలేదని, కొవిడ్‌ కారణంగా ఉన్నతాధికారులు దీని సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు దీన్ని పునరుద్ధరించాలంటూ ఈ ప్రాంత ప్రజలు రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయంగా పాసింజరు రైలు నడిపేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. కొత్త ప్రతిపాదనపై ప్రయాణికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ట్రాకు మెరుగు పనులు చేపట్టాల్సిందే

ఈ మార్గంలో రైల్వే ట్రాకు మెరుగు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. మూడేళ్లుగా నిర్వహణ లేక బలహీనంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యుద్ధీకరణ పనులు కూడా చేపట్టారు. ట్రాకు అభివృద్ధి చేపట్టనున్నారు. రైలు పునరుద్ధరించే నాటికి ఇవి పూర్తికావాలి. కరోనా సమయంలో కొన్ని రైళ్లను ఉంచేందుకు ఈ ట్రాకును వినియోగించారు. లైన్ల నిర్వహణ, ఇతర మరమ్మతులకు సంబంధించిన వాహనాలు, గూడ్సు రైళ్లు ఉంచేందుకు ఈ లైను ఉపయోగపడుతోంది. బొబ్బిలి నుంచి రామభద్రపురం మీదుగా సాలూరు వెళ్లాలంటే గంట సమయం పడుతుంది. అదే రైలు సేవలు ప్రారంభిస్తే ప్రయాణికులకు రూ.20 ఆర్థికభారం ఉండదు. 30 నిమిషాలు సమయం ఆదా అవుతుంది.

త్వరలో ఏర్పాటు చేస్తాం..

బొబ్బిలి- సాలూరు మధ్య రైలు బస్సును నడపలేం. ట్రాకు నాణ్యతగా లేదు. త్వరలోనే నిర్వహణ చేపట్టి పాసింజరు రైలు నడిపేందుకు ప్రతిపాదన చేస్తున్నామని ఇటీవల బొబ్బిలి రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ శత్పథి వెల్లడించారు. రైలు నడపాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండు మేరకు పరిశీలిస్తున్నామని ఆయన ప్రకటించారు. బొబ్బిలిలో సదుపాయాలు కూడా మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.  

పాసింజరు రైలుతో కష్టాలకు తెర...

గతంలో బొబ్బిలి- సాలూరు మధ్య మాత్రమే రైలు బస్సు నడిచేది. రోజుకు నాలుగు ట్రిప్పులు నడిపేవారు. సాలూరు, మక్కువ, పాచిపెంట, రామభద్రపురం, బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లోని పదుల సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది. ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ప్రయాణించేవారు. దూర ప్రాంతానికి వెళ్లే వారు మాత్రం ఏజెన్సీ నుంచి బొబ్బిలి వచ్చి మరో రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు సాలూరు నుంచి నేరుగా విజయనగరం మీదుగా విశాఖకు రైలు నడిపేందుకు రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. ఇది సాకారమైతే పైగ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. సాలూరులో రైల్వే సముదాయాలు కూడా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. రైల్వేశాఖకు మరింత ఆదాయం సమకూరుతుంది. 50 ఏళ్ల కిందట నుంచి సాలూరు-బొబ్బిలి- రాజాం మధ్య రైలు సదుపాయం కల్పించాలని ఈ ప్రాంత వాసులు డిమాండు చేస్తున్నారు. ప్రతిపాదనలూ ఉన్నాయి. కొత్త ట్రాకుల పునరుద్ధరణ సాధ్యపడదని రైల్వే ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. దీంతో పాసింజరు రైలు నడిపేందుకు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని