logo

ఆధునికీకరణ నత్తనడక!

ఉమ్మడి జిల్లాల పరిధిలోని జలాశయాల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వెంగళరాయ, పెద్దగెడ్డ, వట్టిగెడ్డ, పెదంకలాం జలాశయాల పరధిలో కాలువల లైనింగ్‌ ఇతర పనులకు ఎట్టకేలకు జైకా నుంచి రూ.153 కోట్లు మంజూరు కాగా, గతేడాది పనులు ప్రారంభించారు.

Updated : 24 Mar 2023 03:19 IST

బిల్లులు అందక ముందుకు సాగని జలాశయాల పనులు

27న నిపుణుల బృందం పరిశీలన

వెంగళరాయ కుడి ప్రధాన కాలువలో లైనింగు పనులు

న్యూస్‌టుడే, బొబ్బిలి

ఉమ్మడి జిల్లాల పరిధిలోని జలాశయాల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వెంగళరాయ, పెద్దగెడ్డ, వట్టిగెడ్డ, పెదంకలాం జలాశయాల పరధిలో కాలువల లైనింగ్‌ ఇతర పనులకు ఎట్టకేలకు జైకా నుంచి రూ.153 కోట్లు మంజూరు కాగా, గతేడాది పనులు ప్రారంభించారు. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు చేతులెత్తేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి మూడునెలలైనా పనుల్లో వడి లేదు. వాటిని పరిశీలించేందుకు ఈ నెల 27న జైకా నిపుణుల బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పరిస్థితి పరిశీలిస్తే...


పెద్దగెడ్డలోనూ తాత్సారమే

పెద్దగెడ్డ జలాశయం పరిధిలో రూ.28.18 కోట్లతో పనులు చేపట్టారు. గేట్ల మరమ్మతులు, లైనింగు, మట్టికట్ట పనులు ప్రారంభించారు. సుమారు రూ.కోటిన్నర విలువ చేసే పనులు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంతవరకు రూపాయి బిల్లు చెల్లించకపోవడంతో జాప్యం చేశారు. శివారు వరకు లైనింగు చేపట్టాలి. కొన్ని చోట్ల తూములకు షట్టర్లు అమర్చాలి. సైఫాన్లు నిర్మించాలి. కాలువ లెవెల్‌ చేసి లోపాలు సవరించాలి. పిబ్రవరి నుంచి వేగవంతం చేస్తామని అధికారులు చెప్పినా మందకొడిగానే ఉన్నాయి.


రూ.4 కోట్ల మేర చెల్లించాలి

జైకా పథకంలో వెంగళరాయ సాగర్‌కు రూ.63.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రధాన గేట్ల మరమ్మతులు, ఆరు కిలోమీటర్ల మేర లైనింగు, మట్టికట్ట పటిష్ఠం చేసే పనులు చేపట్టారు. గుత్తేదారు ప్రారంభంలో వడి చూపించినా తర్వాత నెమ్మదించాయి. కుడి కాలువ పరిధిలోని పనులు ప్రస్తుతం చేపట్టారు. మక్కువ మండలంలోనే ఇంకా పనులు జరుగుతున్నాయి. అదే కాలువ పరిధిలో సీతానగరం, బొబ్బిలి మండలాల్లో ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది. ఎడమ కాలువ పరిధిలో ప్రారంభించలేదు.ఇంతవరకూ చేసిన వాటికి బిల్లులు రాకపోవడమే కారణం.


ఈ రెండు చోట్లా అంతే..

వట్టిగెడ్డ జలాశయం ఆధునికీకరణకు రూ.44.85 కోట్లు, పెదంకలాంకు రూ.17.30 కోట్లు మంజూరయ్యాయి. వట్టిగెడ్డలో స్పిల్‌వేల వద్ద గేట్ల మరమ్మతు చేపట్టారు.  కాలువల పరిధిలో లైనింగు, సైఫాన్లు చేపట్టాలి. కొలతలు తీశారే తప్ప పూర్తిస్థాయిలో నిర్మాణం ప్రారంభించలేదు. కొన్నిచోట్ల మట్టిగట్టు పటిష్ఠం, లైనింగు పనులు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ అనంతరం ఆశించిన స్థాయిలో సాగలేదు. సుమారు రూ.కోటిన్నర విలువ చేసే పనులు చేసినా, రూపాయి బిల్లు కూడా అందలేదని గుత్తేదారులు వాపోతున్నారు. గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నా పనులు ప్రారంభించేసరికి వర్షాలు రావడంతో పెదంకలాం పరిధిలో పనులు జరగలేదు. వెంగళరాయ, పెదంకలాంకు ఒకే గుత్తేదారు కావడంతో వేగం తగ్గింది. రానున్న ఖరీఫ్‌కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.


ఉన్నతాధికారులకు నివేదించాం

ఇప్పటి వరకూ చేసిన పనులకు ఎంబుక్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. వెంగళరాయ, పెద్దగెడ్డ, వట్టిగెడ్డలకు సంబంధించి ఎంతమేరకు పని జరిగిందో ఆ మేరకు బిల్లులకు సిఫార్సు చేశాం. తదుపరి పనులు కూడా ముందుకు తీసుకెళ్లాలని గుత్తేదార్లకు సూచించాం. త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేపడతాం.

ఎన్‌.రాంబాబు, ఎస్‌ఈ, జలవనరులశాఖ సర్కిల్‌, బొబ్బిలి

వెంగళరాయ ఎడమ కాలువ పరిధిలో జరగని లైనింగు పనులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు