logo

రెండోసారి రాజును వరించిన విజయం

విజయనగరం జిల్లాకు చెందిన పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజుకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి వరించింది.

Updated : 24 Mar 2023 03:18 IST

సూర్యనారాయణరాజు

ఈనాడు, విజయనగరం, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాకు చెందిన పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజుకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి వరించింది. నెల్లిమర్ల మండలం మొయిద విజయరాంపురం గ్రామానికి చెందిన ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గురువారం ఎన్నికల్లో గెలుపొందారు. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కుమారుడిగా, ఆ కుటుంబంపై నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా సూర్యనారాయణరాజు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పతివాడ నారాయణస్వామినాయుడుపై ఓటమి చెందారు. 2019లో ఇదే స్థానం నుంచి బడ్డుకొండ అప్పలనాయుడుకు వైకాపా టికెట్‌ దక్కింది. ఆయన విజయం సాధించారు. అప్పట్లోనే సూర్యనారాయణరాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఆయన తండ్రి సాంబశివరాజు 2020లో మృతి చెందారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అదే ఏడాది ఆగస్టులో సూర్యనారాయణరాజుకు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. రెండున్నరేళ్లుగా ఆయన ఇదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా మరోసారి ఎన్నికవ్వడంతో స్వగ్రామంతో సహా నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ పదవిని పొడిగించారని సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. అమరావతి నుంచి గురువారం రాత్రి ‘ఈనాడు’తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పేద ప్రజలకు దగ్గరగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని