logo

ఇంటర్‌ పరీక్షల్లో చూచిరాతలు

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రోజూ ఎక్కడో ఒకచోట స్లిప్‌లతో పట్టుబడుతున్నారు. స్క్వాడ్‌లే కాకుండా కేంద్రాల్లోని ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులే కేసులు నమోదు చేస్తున్నారు

Published : 26 Mar 2023 05:52 IST

ఇప్పటి వరకు 51 మందిపై మాల్‌ప్రాక్టీసు కేసులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రోజూ ఎక్కడో ఒకచోట స్లిప్‌లతో పట్టుబడుతున్నారు. స్క్వాడ్‌లే కాకుండా కేంద్రాల్లోని ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులే కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 51 మందిని డిబార్‌ చేశారు.

నిఘా ఉన్నా..

గతేడాది నుంచి సీసీ కెమెరాలను వినియోగంలోకి తెచ్చారు. కేంద్రాల్లో నిర్వహణను జిల్లా, రాష్ట్ర అధికారులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయడంతో జిల్లా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గడిచిన ఏడాదిలో 250 మందిపై మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదు చేసిన 51 కేసుల్లో ప్రైవేటు 34, ప్రభుత్వ యాజమాన్యంలో 17 మంది విద్యార్థులున్నారు. శనివారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం పేపర్‌-1 నిర్వహించగా.. చీపురుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గజపతినగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు ఎస్‌.కోటలోని ఓ ప్రైవేటు కళాశాల కేంద్రంలో నలుగురు దొరికారు. వారిని డిబార్‌ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.

చర్యలు ఎలా..?

డిబారు చేస్తున్న విద్యార్థులపై ఏ మేరకు చర్యలుంటాయోనన్న దానిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది నుంచి మూడేళ్ల పాటు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. గతేడాది ఎక్కువ మందికి ఏడాది పాటు పరీక్షలకు నిషేధించారు. కొందరిని మూడేళ్ల పాటు అనర్హులు చేశారు. కేసు నమోదు చేసిన తీరు బట్టి చర్యలు ఉంటాయని ఆర్‌ఐవో ఎం.సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. పరీక్షల అనంతరం బోర్డు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని