logo

అభివృద్ధి జరిగితే అద్భుతమే..

సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు మహర్దశ వచ్చింది. గత ప్రభుత్వం రూసా నిధుల కింద రూ.4 కోట్లు మంజూరు చేయగా, రూ.1.60 కోట్లతో నూతన భవనం నిర్మించారు.

Published : 27 Mar 2023 04:08 IST

డిగ్రీ, పీజీ కళాశాలకు రూ.కోట్ల నిధులు

రూసా నిధులతో నిర్మించిన కళాశాల నూతన భవనం

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు మహర్దశ వచ్చింది. గత ప్రభుత్వం రూసా నిధుల కింద రూ.4 కోట్లు మంజూరు చేయగా, రూ.1.60 కోట్లతో నూతన భవనం నిర్మించారు. పాత భవనాలకు రూ.1.20 కోట్లతో మరమ్మతులు చేశారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, తరగతి గదుల్లో సామగ్రి కోసం రూ.1.20 కోట్లను వెచ్చించారు. ఈక్రమంలోనే గతేడాది ఉమ్మడి జిల్లాలో ఎక్సలెన్స్‌ సెంటర్‌గా ఎంపికైంది. అనంతరం విద్యార్థినుల కోసం వసతి గృహం నిర్మించేందుకు రూ.3.60 కోట్ల నిధులొచ్చాయి. అలాగే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ కింద ఇప్పటికే రూ.70 లక్షలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయా పనులు సాగుతున్నాయి. డిజిటల్‌ లైబ్రరీకి రూ.55 లక్షలు, ఇతర సామగ్రి కొనుగోలుకు మరో రూ.25 లక్షలు కూడా వచ్చాయి.

ఇండోర్‌ స్టేడియంకు ప్రతిపాదనలు..

ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల ఆవరణలో బహుళ ప్రయోజనాల ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని రూ.8 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 12.5 మీటర్ల ఎత్తయిన స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసి పంపించినట్లు ప్రిన్సిపల్‌ టి.రాధాకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 780 మంది వరకు చదువుతున్నారు. వీరితో పాటు స్కిల్‌ హబ్‌లో 60 మంది శిక్షణ పొందుతున్నారు. వీరందరికీ స్టేడియం ఎంతగానో ఉపయోగపడనుంది. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులు కూడా ఇక్కడున్నారు.

స్కిల్‌హబ్‌లో చేరిన విద్యార్థులకు సూచనలు చేస్తున్న ప్రిన్సిపల్‌

వడివడిగా వసతిగృహ పనులు..

కళాశాలకు మంజూరైన వసతిగృహ భవనం పనులను అధికారులు వేగవంతం చేశారు. సకాలంలో పూర్తిచేయాలని ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ఆదేశించడం, నిధులు కూడా విడుదల కావడంతో పనులు త్వరితగతిన చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దూర ప్రాంతాల నుంచి కళాశాలలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరినవారికి వసతి సౌకర్యం లభిస్తుంది. మరోవైపు డిజిటల్‌ లైబ్రరీ, అత్యాధునిక పరికరాలతో బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌లు కూడా అభివృద్ధి చేస్తున్నారు.


అదనపు సౌకర్యాలు..
- టి.రాధాకృష్ణ, జిల్లా డిగ్రీ, పీజీ కళాశాలల ఐడీ ప్రిన్సిపల్‌, సాలూరు

కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాం. రూసా నిధులతో భవనాలను అభివృద్ధి చేస్తున్నాం. ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ కావడంతో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ నిధులతో మరోవైపు వసతి గృహం నిర్మిస్తున్నాం. ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.8 కోట్లతో ప్రతిపాదనలు చేసి కలెక్టర్‌కు పంపించాం. ఇవి మంజూరైన కళాశాల రూపురేఖలు మారుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని