logo

మీ పిల్లలతో మాట్లాడుతున్నారా?

ఉరుకుల పరుగుల జీవితాలివీ.. తెల్లారి లేచింది మొదలు పొద్దుపోయే వరకు తీరిక దొరకడమే కష్టం.. ఉడికీ ఉడకని అన్నాన్నే తీసుకెళ్తుంటారు కొందరు ఉద్యోగులు.. రోజు కూలీల పరిస్థితి ఇక మరింత దయనీయమే..

Updated : 27 Mar 2023 05:55 IST

న్యూస్‌టుడే, విజయనగరం వైద్యవిభాగం

ఉరుకుల పరుగుల జీవితాలివీ.. తెల్లారి లేచింది మొదలు పొద్దుపోయే వరకు తీరిక దొరకడమే కష్టం.. ఉడికీ ఉడకని అన్నాన్నే తీసుకెళ్తుంటారు కొందరు ఉద్యోగులు.. రోజు కూలీల పరిస్థితి ఇక మరింత దయనీయమే.. ఈక్రమంలో పిల్లలేం చేస్తున్నారు..? చదువుతున్నారా లేదా..? చరవాణి ఎంతసేపు ఉపయోగిస్తున్నారు..? పోనీ పాఠశాలకైనా వెళ్తున్నారా..? అన్న ధ్యాసే ఉండడం లేదు చాలామంది తల్లిదండ్రులకు. దీంతో పలువురు పక్కదారి పడుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. కొందరు ఆడపిల్లలైతే తమ సమస్యలను సైతం కుటుంబ పెద్దలకు చెప్పుకోలేని పరిస్థితి. వారితో మాట్లాడకపోవడం.. కాస్త సమయం వెచ్చించేందుకు వెనకడుగు వేయడమే దీనికి కారణమంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.

‘నేడు బడిలో జరిగే విషయాలు, నా చదువు గురించి నాన్నకి చెబుదామనుకుంటా. కానీ ఆయనెప్పుడూ పో అంటాడు. అమ్మ దగ్గరికి వెళ్తే ఖాళీగా లేను వెళ్లి చదువుకో అంటుంది’ అంటూ విజయనగరానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ఓ సైకాలజిస్టు వద్ద చెప్పిన మాటలివి. తమ తల్లిదండ్రులెప్పుడూ ఫోన్లు మాట్లాడుతుంటారని, తనను బయటకు తీసుకెళ్లడం లేదని తొమ్మిదో తరగతి విద్యార్థిని ఓ వైద్యుడికి తెలిపింది. ఇదే పరిస్థితి చాలా ఇళ్లల్లో కనిపిస్తోందని, దీంతో పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని విజయనగరానికి చెందిన సైకాలజిస్టు ఎస్‌వీ.రమణ తెలిపారు.

బాలికల పరిస్థితి ఇదీ..

తన వెంట రోజూ ఓ అబ్బాయి వస్తూ.. ఇబ్బంది పెడుతున్నాడని నగరానికి చెందిన బాలిక తల్లిదండ్రులకు చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఇంట్లో వినే పరిస్థితి లేదు. చివరికి ఆ కేటుగాడు బాధితురాలి ఇంటి వరకు వచ్చేశాడు. విషయంలో ఇంట్లో తెలియగా.. పోలీసుల రంగ ప్రవేశంతో అంతా సర్దుకుంది. ఆడపిల్లల అదృశ్యాలు, మగపిల్లలు వెంట పడడం, అనారోగ్యం పాలవడం, చదువులో వెనుకబడడం.. తదితర సమస్యలన్నీ పట్టించుకోకపోవడంతోనే ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో ఇచ్చే పోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, చిక్కీలు, ఇతర పదార్థాలను చాలామంది విద్యార్థినులు తినడం లేదు. అవగాహన కల్పించి, ఇళ్లల్లో వారికిచ్చే నాథుడే కరవవుతున్నారు.


బాలల్లో మార్పు..: ఈ మధ్య కాలంలో 14 నుంచి 19 ఏళ్ల వయసుగల బాలల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. మద్యంతో పాటు గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇటీవల జిల్లా ఆసుపత్రికొచ్చిన పలువురు విద్యార్థులను వైద్యులు పరిశీలించగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిదో తరగతి విద్యార్థి.. 19 ఏళ్ల యువకుడితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. అలాగే మరో ఐదుగురు విద్యార్థులు ఒకరితో ఒకరు అసాంఘిక చర్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. విజయనగరంతో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి, కొత్తవలస, ఎస్‌.కోట, భోగాపురం.. తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు బయట పడుతుండడం గమనార్హం.


కేసుల తీరు..

* అన్నం తినడం లేదని, ఇంట్లో  సక్రమంగా ఉండడం లేదని ఏడాదికి సుమారుగా 600 మంది బాలలను వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు.

* చర్మం, కళ్లు, ఇతరత్రా సమస్యలపై ఏటా 2,400 మంది విద్యార్థులు ఆసుపత్రులకు వెళ్తున్నారు.

* వివిధ నేరాల్లో పట్టుబడుతున్నవారిలో 100 మందికి 35 మంది వరకు 18 ఏళ్ల లోపువారే.


ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌..
- శ్రీనివాసరావు, విజయనగరం ఇన్‌ఛార్జి డీఎస్పీ, వెంకటేశ్వర్లు, దిశ డీఎస్పీ

విద్యా సంస్థల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దారి తప్పుతున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఇటీవల కొందరు దొంగతనాలు, ఇతర కేసుల్లో నిందితులుగా కనిపిస్తున్నారు. వీరిలో చాలావరకు కుటుంబాలకు దూరంగా ఉంటున్నవారే. మా బృందాలతో పాటు తల్లిదండ్రులూ బాధ్యత తీసుకోవాలి.


అప్రమత్తత తప్పనిసరి..
- ఎస్‌వీ.రమణ, సైకాలజిస్టు, ప్రభుత్వ విభాగం

తల్లిదండ్రులంతా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తీరిక లేకపోయినా ఏదో ఒక సమయంలో వారితో మాట్లాడాలి. అవసరం మేరకు వారిని బయటకు తీసుకెళ్లడం, సరదాగా గడపడం, అప్పుడప్పుడూ పాఠశాలలకు వెళ్లి చదువు గురించి ఆరా తీయడం వంటివి చేయాలి. అలా అని ఒత్తిడి పెట్టకూడదు. చెడు అలవాట్లకు బానిసలైనా.. చరవాణి అధికంగా ఉపయోగిస్తున్నా.. మానసిక నిపుణులను సంప్రదిస్తే మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని