logo

రెండు మండలాలు.. 137 పంచాయతీలు

స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇంటింటికీ చెత్తసేకరణ, సంపద సృష్టి కేంద్రాల (ఎస్‌డబ్ల్యూపీసీ) నిర్వహణ తీరుతెన్నులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ఎండ్‌ టు ఎండ్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

Published : 27 Mar 2023 04:18 IST

ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అడుగులు

జమ్ముపేటలోచెత్త సంపద కేంద్రాలపై అవగాహన కల్పిస్తున్న జడ్పీ సీఈవో అశోక్‌కుమార్‌, డీపీవో నిర్మలాదేవి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇంటింటికీ చెత్తసేకరణ, సంపద సృష్టి కేంద్రాల (ఎస్‌డబ్ల్యూపీసీ) నిర్వహణ తీరుతెన్నులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ఎండ్‌ టు ఎండ్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలనేది దీని ఉద్దేశం. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం రెండు జిల్లాల్లో రెండు మండలాలు, 137 పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం జిల్లాలో  80, మన్యంలో 57 పంచాయతీలున్నాయి.

చెత్త సేకరణపై అవగాహన

చెత్త సేకరణపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఇంటి నుంచి సేకరించిన వ్యర్థాలను సంపదసృష్టి కేంద్రాలకు తరలించి, తద్వారా వర్మీకంపోస్ట్‌ తయారీ చేయడంతో పంచాయతీలు ఆదాయవనరులు సమకూర్చుకునేలా చేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన పంచాయతీలతో పాటు విజయనగరం జిల్లాలోని బొండపల్లి, మన్యంలోని పాచిపెంట మండలాల్లో అన్ని పంచాయతీలను ఆదర్శగ్రామాలుగా మారుస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ జరుగుతున్నా కొన్ని చోట్ల కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, క్లాప్‌మిత్రలకు జీతాలు నెలనెలా ఇవ్వకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నందున వీటిని అధిగమించే చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఆరుచోట్ల శిక్షణ

రెండు జిల్లాల్లో శిక్షణ నిమిత్తం ఆరు కేంద్రాలను ఎంపిక చేశారు. స్థానిక శిక్షణ కేంద్రాల్లో (ఎల్‌టీసీ) జిల్లా వనరుల కేంద్రం సిబ్బంది ద్వారా ఎంపీడీవో, కార్యదర్శులు, ఈవోపీఆర్డీ, పంచాయతీ సిబ్బంది, సర్పంచి, ఉపసర్పంచులు, పంచాయతీ సిబ్బంది, క్లాప్‌మిత్రలకు శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలో గుర్ల మండలం జమ్ముపేట, చీపురుపల్లి మండలం కర్లాం, భోగాపురం మండలం నందిగాం పంచాయతీల్లో ఈ నెల 24 నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఏప్రిల్‌ ఆరోతేదీ వరకు ఇవ్వనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో పెదభోగిలి, వీరఘట్టం, సాలూరులో ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు నిర్మలాదేవి, బి.సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని