logo

మళ్లీమళ్లీ ఖరీఫ్‌ పాట

అతి పెద్ద జలాశయం.. కావాల్సినంత నీరు.. అందుబాటులో నిధులు.. అయినా సాగునీటికి కటకటే.. తోటపల్లి పరిధిలో ఏళ్లుగా ఇదే పరిస్థితి.

Updated : 30 Mar 2023 02:49 IST

ఈ ఏడాదీ పూర్తిస్థాయిలో కాని తోటపల్లి జలాశయం పనులు?

జలాశయం వద్ద మధ్యలోనే ఆగిపోయిన రాతికట్టు పనులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: అతి పెద్ద జలాశయం.. కావాల్సినంత నీరు.. అందుబాటులో నిధులు.. అయినా సాగునీటికి కటకటే.. తోటపల్లి పరిధిలో ఏళ్లుగా ఇదే పరిస్థితి. గరుగుబిల్లి మండలంలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద సీతానగరం, బలిజిపేట, బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లోని భూములున్నాయి. ఈ ప్రాంతాలకు నీరందించేందుకు తొమ్మిది డిస్ట్రిబ్యూటరీలతో నేరుగా సరఫరా చేసే మరో మూడు వ్యవస్థలున్నాయి. వీటి కింద 20,521 ఎకరాలు  సాగవ్వాలి.  2015 నుంచి నీరు విడుదల చేస్తున్నా వేల ఎకరాలు ఇంకా ఎండుతూనే ఉన్నాయి.

చెల్లింపుల్లో జాప్యం..

ఈ సంవత్సరం ప్రధాన కాలువ కింద తొమ్మిది డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. 430 నిర్మాణాలతో పాటు జలాశయం వద్ద రాతికట్టు, ఇతర పనులు చేసేందుకు రూ.59 కోట్ల వ్యయం అవుతుందని భావించారు. గట్ల పటిష్ఠం, రాతిగట్లు వేయడం, మట్టికట్ట, విద్యుద్దీపాల అమరిక, అత్యవసర పనులు, కాలువలకు లైనింగ్‌.. తదితరాలన్నీ పూర్తయితే ప్రతిపాదిత ఆయకట్టుకు నీరందుతుంది. ఆరంభంలో పనులు చురుగ్గా మొదలయ్యాయి. అనంతరం ఎక్కడికక్కడే పడకేశాయి. గుత్తేదారులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరగడంతో ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు.

అసంపూర్తిగా..

గతేడాది సుమారు ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే కాలువ నీరు పారినట్లు జల వనరుల శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది కొన్నిచోట్ల పనులు చేపట్టినప్పటికీ  అవి అసంపూర్తిగా ఉండడం వల్ల ఆయకట్టు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన కూడా ఉంది. వాతావరణం అనుకూలిస్తే మరో రెండు నెలలు మాత్రమే పనులు చేయగలరు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అది కూడా కష్టంగా కనిపిస్తోంది.

పిల్లకాలువలే లక్ష్యంగా చేయిస్తున్నాం

గతేడాది ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ ఏడాది మిగిలిన 12 వేల ఎకరాలకు ఇచ్చేలా పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతానికి ఇవే ప్రాధాన్య పనులుగా ముందుకెళుతున్నాం. కాలువ లైనింగ్‌ పూర్తికాకపోయినా ఈ ఖరీఫ్‌నకు నీటిని సరఫరా చేస్తాం. జూన్‌ వరకు నిర్వహణకు గడువు ఉంది. చెల్లింపుల్లో కొంతమేర జాప్యం ఉన్నప్పటికీ గుత్తేదారులు సహకరించి పనులు చేస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో నీరందిస్తాం.

రామచంద్రరావు, కార్యనిర్వాహక ఇంజినీరు, తోటపల్లి జలాశయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని