logo

చీపురుపల్లిలో మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌?

చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో చిరుధాన్యాల శుద్ధీకరణ (మిల్లెట్‌ ప్రాసెసింగు) యూనిట్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published : 02 Apr 2023 05:33 IST

స్థలం పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ, రెవెన్యూ అధికారులు

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో చిరుధాన్యాల శుద్ధీకరణ (మిల్లెట్‌ ప్రాసెసింగు) యూనిట్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకుడు కల్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలసి పెదనడిపల్లిలో స్థలం పరిశీలించారు. గ్రామానికి సంబంధించి చీపురుపల్లి తహసీల్దారు ఎం.సురేష్‌ సర్వే నెంబరు 78లోని ప్రభుత్వ భూమిని పీడీకి చూపించారు. ఎంత స్థలం అవసరమో వివరించారు. యూనిట్‌ ఏర్పాటైతే అవసరమైన రవాణా సదుపాయాలపై వెలుగు ఏపీఎం ఎంవీ రాజశేఖర్‌ వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ పెదనడిపల్లిలో యూనిట్‌ ఏర్పాటు కోసం భూమి పరిశీలించేందుకు వచ్చామన్నారు. జిల్లాకు సంబంధించి మంజూరైన ఒక యూనిట్‌ను ఇక్కడ పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. పైగా పరిశ్రమకు కావాల్సిన ముడి సరకు ఇతర మండలాలతో పోలిస్తే చీపురుపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా లభించే అవకాశాలు ఉండడంతో సాధ్యమైనంత వరకు ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి పరిశీలన తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఈయన వెంట డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, ప్రాంతీయ వెలుగు సమన్వయకర్త సీతారామయ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్‌ఐ రామ్‌కుమార్‌ ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని