logo

రాలుతున్న పూత.. రైతుల్లో నిరాశ

గిరిజన రైతుల జీవనాధారం జీడి. ఈ ఏడాది తొలిదశలో పూత ఆశాజనకంగా ఉన్నా తోటలకు టీ దోమ ఆశిస్తుండడంతో పిందె కట్టే సమయంలో మాడిపోతోంది.

Updated : 02 Apr 2023 06:19 IST

టీ దోమతో దెబ్బతిన్న జీడిపంట

మాడిపోతున్న జీడి పూత

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గిరిజన రైతుల జీవనాధారం జీడి. ఈ ఏడాది తొలిదశలో పూత ఆశాజనకంగా ఉన్నా తోటలకు టీ దోమ ఆశిస్తుండడంతో పిందె కట్టే సమయంలో మాడిపోతోంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 50,472 ఎకరాల్లో జీడి ఉంది. ఏటా 10 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నా తెగుళ్లు, అకాల వర్షాలతో దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో పంట ముందుగానే వచ్చినా కొన్నిచోట్ల పూత మాడిపోయి రాలుతోంది.


వినియోగంలోకి రాని కేంద్రాలు

పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు, ఇరిడి, సాలూరు మండలం వెలగవలస, కురుకుట్టి, మక్కువ మండలం అనసభద్ర, ఆలగరువు, కురుపాం మండలం దురిబిలి ప్రాంతాల్లో రూ.6 లక్షలతో జీడి ప్రాసెసింగ్‌ కేంద్రాలకు భవనాలు నిర్మించారు. రూ.2 లక్షల చొప్పున వ్యయంతో అన్ని కేంద్రాలకు పరికరాలు సమకూర్చారు. ఈ ఏడాది ముందుగా పంట చేతికందిన ప్రాంతాల్లో కొనుగోలు చేపట్టాల్సి ఉన్నా కేంద్రాలు వినియోగంలోకి రాకపోవడంతో రైతులు ప్రైవేటు వర్తకులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


నాలుగేళ్లుగా నష్టం..

2019-20లో జీడికి టీ దోమ సోకింది. అప్పట్లో ఐదు మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో పూర్తిగా దిగుబడే రాలేదు. 2020-21లోనూ తీవ్ర నష్టం వాటిల్లినా పరిహారం రాలేదు. 2021-22లో సుమారు 14 వేల ఎకరాల్లో పంట దోమ దెబ్బకు పూర్తిగా పోయింది. ఈ ఏడాది సుమారు 40 శాతం వరకు తోటల్లో తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  


నివారణ చర్యలేవీ..?

చెట్లకు పూత వచ్చే డిసెంబరులోనే ఎక్కువగా టీ దోమ ఆశిస్తుంది. అప్పుడే రైతులకు అవగాహన కల్పించి రక్షణ చర్యలు చేపట్టాలి. కానీ పురుగును మార్చిలో గుర్తించడంతో తీవ్ర ప్రభావం చూపి పంటను నాశనం చేస్తోంది. పూత, పిందె నిలబడటం లేదు. 1990 నుంచి 2015 వరకు ఉచితంగా, 90 శాతం రాయితీపై మందులు అందించేవారు. ప్రస్తుతం ఎలాంటి రాయితీలు కల్పించకపోవడంతో భారం పడుతోందని రైతులు వాపోతున్నారు.


పరిహారం చెల్లించాలి
- కె.గిరి, బొద్దిడి గ్రామం, రైతు

ఐదెకరాల్లో తోటలు ఉన్నాయి. తొలిదశలో పూత ఆశాజనకంగా ఉండడంతో సంబరపడ్డాం. ఇటీవల పూత మాడిపోయి రాలిపోతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. గతేడాది కూడా పంట చేతికి రాలేదు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే బాగుంటుంది.


తెగుళ్లను తగ్గించొచ్చు
-శ్రీనివాసరాజు, ఉద్యాన విభాగ శాస్త్రవేత్త, కేవీకే

ఇటీవల కురిసిన వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరగడంతో టీ దోమ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి ప్రోఫినోపాస్‌ 2 ఎంఎల్‌ లేదా లేండా థైలాత్రాన్‌ 0.6 ఎంఎల్‌ కలిపి పిచికారీ చేయాలి. సేంద్రియ పద్ధతిలో భాగంగా నాణ్యమైన వేపనూనెతో గాని పుల్లటి మజ్జిగ, ఇంగువ కలిపి పిచికారీ చేసినా తెగుళ్ల ఉద్ధృతిని తగ్గించవచ్చు.


బీమా వచ్చే అవకాశం
- సత్యనారాయణరెడ్డి, డీహెచ్‌వో

పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా తెగుళ్లు సోకి ఎకరానికి 150 కిలోల కంటే తక్కువ దిగుబడి వస్తే బీమా వచ్చే అవకాశముంది. ఒక ప్రాంతం కాకుండా జిల్లా మొత్తం తక్కువ దిగుబడి వస్తే బీమా వర్తిస్తుంది. తెగుళ్ల నివారణకు రైతులు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు