logo

అధికారంలోకి వస్తా.. అన్నీ పూర్తి చేస్తా

‘వెనుకబడిన విజయనగరం అభివృద్ధికి ఎంతో కృషి చేశా. ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేసి నిధులిచ్చా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై శీతకన్ను వేసింది.

Updated : 20 May 2023 05:39 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

ఈనాడు, విజయనగరం, ఎస్‌.కోట, న్యూస్‌టుడే:  ‘వెనుకబడిన విజయనగరం అభివృద్ధికి ఎంతో కృషి చేశా. ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేసి నిధులిచ్చా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై శీతకన్ను వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 134 బీసీ కులాల వారికి ఎన్టీఆర్‌ పెద్దపీట వేశారు.  నేను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కోటా 35 శాతానికి పెంచా. వైకాపా దాన్ని 24 శాతానికి తగ్గించింది. పెందుర్తి-అరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి అప్పట్లో ప్రతిపాదించా. ఇది పూర్తయితే ఈ ప్రాంతం సహా ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని’ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎస్‌.కోటలో శుక్రవారం దాసరి వర్గీయులతో సమావేశమయ్యారు. ‘పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఎస్‌.కోట వరకు నీరందుతుంది. అప్పట్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు 550 ఎకరాలిచ్చాం. దీన్ని పూర్తి చేయలేకపోయారు. కొత్తవలసలో పతంజలి ఆయుర్వేద ఔషధ సంస్థ ఆహార అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తే ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తాం.. ఇవన్నీ పూర్తి చేస్తామని’ చెప్పారు. వెనుకబడిన కులాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తనదని చంద్రబాబు దాసరి కులస్తులకు భరోసా ఇచ్చారు. తమను ఎస్టీల్లో చేర్చాలని ఆ కుల నాయకులు తుపాకుల అప్పారావు, బి.రత్నాకర్‌, ఎం.కృష్ణంనాయుడు, టి.శేషగిరిరావు విజ్ఞప్తి చేయగా.. ఆ శక్తి మీరిస్తే కేంద్ర స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.


కార్యకర్త బిడ్డను ఎత్తుకుని ఫొటో దిగుతున్న చంద్రబాబు


పార్టీని బలోపేతం చేయండి
మండల అధ్యక్షులు, క్లస్టర్‌  కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం

అభిమానుల బహూకరణ

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ కోఆర్డినేటర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని మండలాల అధ్యక్షుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలసి చేయాలని చెప్పారు. మండల అధ్యక్షులు అందరినీ కలుపుకొని వెళ్లాలని ఇన్‌ఛార్జి లలితకుమారికి సూచించారు. కోళ్ల అప్పలనాయుడు అత్యధిక సార్లు ఇక్కడి నుంచి గెలిచారని, అయినా సాదాసీదాగా నడుచుకునేవారని, అందుకే ప్రజలు ఆయన్ను ఆదరించారని చెప్పినట్లు తెలిసింది. పార్టీ కోసం త్యాగం చేసే వారిని ఎప్పుడూ మర్చిపోమన్నారు. టిక్కెట్‌ విషయం తాను చూసుకుంటానన్నారు. క్లస్టర్‌ కోఆర్డినేటర్లు, యూనిట్ ఇన్‌ఛార్జులు, బూత్‌ కన్వీనర్ల పనితీరు, వారి పరిధిలో పార్టీకి పడిన ఓట్లు, వచ్చిన ఫలితాలు ఇవన్నీ చూసి ఇకపై పదవులు, నామినేటెడ్‌ పదవులు ఉంటాయని చెప్పినట్లు సమాచారం.


 తెదేపాలో జోష్‌

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: చంద్రబాబు పర్యటన పార్టీలో ఫుల్‌ జోష్‌ నింపిందనే చెప్పాలి. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వర్షం కురిసినా.. రోడ్‌షో, బహిరంగ సభకు ఊహించని విధంగా జనం హాజరు కావడంతో నేతలు ఆనందంలో ఉన్నారు. చంద్రబాబే తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎస్‌.కోటలో ఎప్పుడూ ఇంత స్పందన చూడలేదని అన్నారంటే ఏమేరకు విజయవంతం అయిందో చెప్పవచ్చు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరైన యువత చంద్రబాబు వేసిన ప్రతి ప్రశ్నకు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడం వారి ఆదరణ తెలియజేస్తుందని ఓ సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్యటన మొత్తం మీద తెదేపాలో నూతనోత్తేజం తెచ్చిందని చెప్పాలి. తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అప్పులు పాలైన నాయకులు,కార్యకర్తలు కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో వీరిలోనూ ధైర్యం వచ్చింది.


‘నా బిల్లులు డ్రా చేసి ఇవ్వడం లేదు’

సమస్య వివరిస్తున్న గడసాం మాజీ సర్పంచి జ్యోతిలక్ష్మి

దత్తిరాజేరు, న్యూస్‌టుడే:  ‘నేను సర్పంచిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకంలో గ్రామంలోని ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రహరీలు నిర్మించా. దానికి సంబంధించి రూ.3.60 లక్షల బిల్లులు ఇటీవల ప్రభుత్వం ప్రస్తుత సర్పంచి నేతేటి దీపిక ఖాతాలో జమ చేస్తే.. వాటిని డ్రా చేశారే కానీ ఇంతవరకు ఇవ్వలేదు. నా భర్త తెదేపా నాయకుడు మురపాక భాస్కరరావు కరోనాతో రెండేళ్ల క్రితం చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. కలెక్టరు, ఎస్సీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పంచాయతీ కార్యదర్శిని అడిగినా పట్టించుకోవడం లేదు.

గడసాం మాజీ సర్పంచి మురపాక జ్యోతిలక్ష్మి.. చంద్రబాబుకు తెలిపారు.


అరకు పార్లమెంట్‌లో సత్తా చూపండి

చంద్రబాబుతో అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు

సాలూరు, పార్వతీపురం, న్యూస్‌టుడే: అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని అధినేత చంద్రబాబు సూచించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు సంధ్యారాణి, పార్వతీపురం, పాడేరు, పాలకొండ, అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు బొబ్బిలి చిరంజీవి, ఈశ్వరి, నిమ్మక జయకృష్ణ, శ్రావణ్‌కుమార్‌లు తమ పరిధిలో పార్టీ పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు సాగించి, ప్రజలతో మమేకం కావాలని ఆయన సూచించారు.


ఉత్సాహంగా సెల్ఫీ విత్‌ బాబు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: తెదేపా అధినేత రెండో రోజు పర్యటన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే కేటాయించారు. ఉదయం 11.30 గంటలకు ‘సెల్ఫీ విత్‌ చంద్రబాబు’  నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులతో హాజరు కావడంతో హాలు నిండిపోయింది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు కుటుంబాలతో, గ్రూపులుగా, గ్రామాల వారీగా, సామాజికవర్గాల వారీగా ఫొటోలు తీయించుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో భోజన విరామం ఇచ్చారు. తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నాయకులతో సమీక్షలు జరిపారు. విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గ కన్వీనర్లతో సమావేశమయ్యారు. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో అనకాపల్లి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, కోండ్రు మురళీమోహన్‌, కొల్లు రవీంద్ర, విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, గండి బాబ్జీ, పల్లా శ్రీనివాసరావు, గిడ్డి ఈశ్వరి, కేఏ నాయుడు, భంజ్‌దేవ్‌, బి.చిరంజీవులు, విజయనగరం, విశాఖ  పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఎం.శ్రీభరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని