logo

సాఫ్ట్‌వేర్‌ టూ ఐఏఎస్‌

రూ.లక్షల్లో ప్యాకేజీ.. ఏసీలో ఉద్యోగం.. వారాంతంలో రెండ్రోజులు సెలవు.. నిర్దేశించిన పని వేళలు.. ఇంకేం కావాలి చెప్పండి.. దీనికంటే విలాసవంతమైన జీవితం ఉంటుందా..? ఇవేవీ వద్దనుకుని.. సమాజసేవే ముద్దనుకుని.. ముందడుగు వేస్తోంది యువత..

Updated : 27 May 2023 12:52 IST

‘ఓటమి అవమానం కాదు.. పాఠం’

రూ.లక్షల్లో ప్యాకేజీ.. ఏసీలో ఉద్యోగం.. వారాంతంలో రెండ్రోజులు సెలవు.. నిర్దేశించిన పని వేళలు.. ఇంకేం కావాలి చెప్పండి.. దీనికంటే విలాసవంతమైన జీవితం ఉంటుందా..? ఇవేవీ వద్దనుకుని.. సమాజసేవే ముద్దనుకుని.. ముందడుగు వేస్తోంది యువత.. ఇంజినీరింగ్‌ విద్యార్హతతో సాఫ్ట్‌వేర్‌ కొలువులు వరించినా.. వదిలి.. పట్టుబట్టి మరీ సివిల్స్‌లో అడుగెడుతున్నారు.. స్థిరమైన గమ్యం.. కచ్చితమైన మార్గం.. రాజీలేని ధోరణితో విజయ కేతనం ఎగరవేస్తున్నారు.. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్నారు.

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2010 నుంచి ఇప్పటి వరకు 22 మంది సివిల్స్‌లో విజేతలుగా నిలిచారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, పోస్టల్‌ సర్వీసు వంటి ఉద్యోగాలను కైవసం చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్నవారు కావడం విశేషం. సాఫ్ట్‌వేర్‌ కొలువుకు రాజీనామా చేసి వచ్చిన వారు.. ఇంజినీరింగ్‌ నుంచి నేరుగా సివిల్స్‌లో పోటీపడ్డవారు ఉన్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన పొటిపిరెడ్డి భార్గవ్‌ 772 ర్యాంకు, రేగిడి ఆమదాలవలస మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌ 607 ర్యాంకు సాధించారు. ముంబయి ఐఐటీలో బీటెక్‌ చేసిన భార్గవ్‌ 15 నెలల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. మంచి ప్యాకేజీ అయినప్పటికీ రాజీనామా చేసి.. సివిల్స్‌ సాధించారు.

టీసీఎస్‌ నుంచి తమిళనాడుకు

బొండపల్లి మండలం జె.గుమడాంకు చెందిన మంత్రి గోవిందరావు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా రెండేళ్లు పనిచేశారు. ఆపై రాజీనామా చేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2010లో 31వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తమిళనాడులోని కుంభకోణం రెవెన్యూ డివిజనల్‌ సబ్‌ కలెక్టర్‌గా కొంతకాలం సేవలందించారు. చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేశారు. ఇటీవల తమిళనాడు ఆరోగ్య విభాగానికి  డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

న్యూస్‌టుడే, గంట్యాడ: సివిల్స్‌.. సామర్థ్యంతో పాటు సహనానికి పరీక్ష. అఖిల భారత స్థాయిలో లక్షల మంది పోటీ పడగా.. విజేతల సంఖ్య వందల్లోనే ఉంటుంది. అలాంటి పరీక్షను ఐదో ప్రయత్నంలో నెగ్గి.. యువతకు స్ఫూర్తిగా నిలిచారు 772వ ర్యాంకు సాధించిన పొటిపిరెడ్డి భార్గవ్‌. అవమానాలెన్ని ఎదురైనా.. పాఠాలుగా భావించాలని తన అనుభవాన్ని ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారాయన.

ముంబయిలో ఇంజినీరింగ్‌

మాది పెదవేమలి గ్రామం. నాన్న సత్యం ఆర్టీసీలో ఉద్యోగి. అమ్మ పద్మ గృహిణి. చెల్లి హారిక ఎంబీబీఎస్‌ చేసింది. మా చదువుల కోసం విజయనగరానికి మకాం మార్చారు. ఇక్కడే పాఠశాల చదువులు పూర్తయ్యాయి. పదిలో 567 మార్కులు వచ్చాయి. విశాఖలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదివా. 928 మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో 8,345 ర్యాంకు రావడంతో ముంబయి ఐఐటీలో మెటలార్జికల్‌ ఇంజినీరింగ్‌ చేశా.

ఎక్కువ మందికి మేలు చేయాలని..

ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో 15 నెలల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశా. ప్రజాసేవ చేయాలని చిన్నతనం నుంచి ఉండేది. మనల్ని మనం నిరూపించుకోవాలని అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. ఎక్కువ మందికి మంచి చేయగలమని సివిల్స్‌ వైపు అడుగులేశా. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమస్యకు మెరుగైన పరిష్కారం సూచించాలి. అప్పుడే ప్రజలకు చక్కటి సేవలు అందుతాయి. అందుకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. సివిల్స్‌కు సిద్ధమయ్యా.

మళ్లీ ప్రయత్నిస్తా..

నేను ప్రణాళికతో చదివి, సీనియర్ల సలహాలు తీసుకుని, పాఠ్యాంశాలకు లోబడి ముందుకెళ్లా. పాత సిలబస్‌ తిరగేశా. పత్రికల్లో ఎడిటోరియల్స్‌ ఉపయోగపడ్డాయి. ఐదో ప్రయత్నంలో 772 ర్యాంకు వచ్చింది. మంచి ఫలితం కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నా. ఒక్కోసారి అవరోధాలు, ఓటమి ఎదురైనా ఓ పాఠంగా తీసుకోవాలి. అప్పుడే విజయానికి చేరువ అవుతాం. నన్ను ఐఏఎస్‌గా చూడాలన్నది అమ్మ కోరిక. ఆ దిశగా పట్టుదలతో ముందుకెళ్తా.

కిందపడ్డా లేవాలి..

సివిల్స్‌కు అఖిల భారత స్థాయిలో వైద్యులు, ఇంజినీర్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులతోపాటు ఎందరో పోటీ పడుతుంటారు. ఏ దశలోనూ మనల్ని మనం తక్కువగా భావించకూడదు. గొప్పదైన సంకల్పం కోసం చిన్నచిన్న సరదాలు త్యాగం చేయాలి. సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. సీనియర్స్‌ సలహాలు తీసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా చదవాలి. కిందపడిన ప్రతిసారీ మరింత పట్టుదలతో లేవడానికి ప్రయత్నించాలి.

బీఈ చేసి నేరుగా..

శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామీణ కుటుంబానికి చెందిన ఎల్‌.శివశంకర్‌ బీఈ మెకానికల్‌ చదివారు. చిన్నతనం నుంచే సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో తొలుత గ్రూప్స్‌ ద్వారా ఏసీటీవోగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2011 సివిల్స్‌ ప్రకటన ద్వారా ఐఏఎస్‌ సాధించారు. శిక్షణ అనంతరం గుంటూరు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కార్మిక ఉపాధి కల్పన శాఖలో సహాయ కార్యదర్శి, పాడేరు సబ్‌కలెక్టర్‌, సీతంపేట ఐటీడీఏ పీవోగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు    కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కెమికల్‌ ఇంజినీర్‌.. అదనపు కలెక్టర్‌

విజయనగరం అయ్యన్నపేటకు చెందిన బుడుమజ్జి సత్యప్రసాద్‌ ఐఐటీ రూర్కెలాలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఆపై సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2016 సివిల్స్‌ ప్రకటనలో 771 ర్యాంకు సాధించారు. ఐఆర్‌ఎస్‌(ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌)కు ఎంపికై, ఫరీదాబాద్‌లో కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌లో శిక్షణ పొందారు. జమ్మూ కశ్మీర్‌లో బెటాలియన్‌ (అటాచ్‌మెంట్‌) శిక్షణ పొందుతున్న సమయంలో.. రెండో ప్రయత్నంలో 2017 సివిల్స్‌ ఫలితాల్లో 331 ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

విశ్లేషణ శక్తి ఎక్కువ

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో బీటెక్‌, ఎంటెక్‌ చదవడం వల్ల మంచి విజ్ఞానం, ఐక్యూ ఉంటుంది. అవగాహన, విశ్లేషణ శక్తి ఎక్కువ. ఇంజినీరింగ్‌ వారికి ఆంగ్ల భాషపై పట్టు ఏర్పడుతుంది. సైన్స్‌ పాఠ్యాంశాల్ని విశ్లేషణాత్మకంగా చదువుతారు. హ్యుమానిటీ సబ్జెక్టును సులువుగా చదవగలగడంతో ఐఏఎస్‌కు ఎంపికవుతున్నారు.

ఆర్‌.రాజేశ్వరరావు, డైరెక్టర్‌ అకడమిక్‌ ఆడిట్‌, జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని