logo

రెప్పపాటులో.. గాలిలో ప్రాణం

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నాలుగు రోజులుగా పనుల్లో నిమగ్నమయ్యాడు.. వేర్వేరు ప్రాంతాల్లో వివాహ వేడుకలకు డీజే సౌండ్‌ సిస్టమ్‌ను తీసుకెళ్తూ కంటి నిండా నిద్రకు దూరమయ్యాడు.

Published : 28 May 2023 02:29 IST

వంశీ (పాత చిత్రం)

గరుగుబిల్లి గ్రామీణం, గజపతినగరం, న్యూస్‌టుడే: పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నాలుగు రోజులుగా పనుల్లో నిమగ్నమయ్యాడు.. వేర్వేరు ప్రాంతాల్లో వివాహ వేడుకలకు డీజే సౌండ్‌ సిస్టమ్‌ను తీసుకెళ్తూ కంటి నిండా నిద్రకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కొంత సేపు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొని మళ్లీ పనిమీద బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గజపతినగరం సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. గరుగుబిల్లి మండలం చినగుడబకు చెందిన మూడడ్ల వంశీ(29), అతని తమ్ముడు చిన్నారావు కలిసి డీజే సౌండు సిస్టమ్‌ను శుభకార్యాలకు అద్దెకు ఇస్తుంటారు. దీనితోపాటు విజయనగరంలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్య కోమలితో కలిసి చినగుడబ వచ్చాడు. అనంతరం ఒడిశాలో జరిగిన వివాహానికి డీజేతో వెళ్లిన వంశీ శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం వెళ్లాలని కారు యజమాని పిలవడంతో వేకువజామున ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మధుపాడ వద్దకు వచ్చే సరికి రహదారి పక్కనున్న డ్రైనేజీ గట్టును ఢీకొని మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంకటనాయుడు, భారతమ్మ, భార్య కోమలి, తమ్ముడు చిన్నారావు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. కోమలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని