logo

అంబరాన్నంటిన.. అక్కాచెల్లెల్ల సంబరం

పార్వతీపురం ప్రజల ఆరాధ్యదైవాలు ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Updated : 31 May 2023 04:49 IST

పార్వతీపురం పురపాలక, గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే: పార్వతీపురం ప్రజల ఆరాధ్యదైవాలు ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో రెండో రోజైన మంగళవారం ఉదయం నుంచి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుదీరారు. జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుంచి తరలిరావడంతో  సందడి నెలకొంది. అమ్మవార్ల ఘటాలను పట్టణంలో ఊరేగించి పూజలు చేశారు. రాత్రి సిరిమానోత్సవాలు కనులపండువగా జరిగాయి. శక్తి, బళ్ల, పులి వేషాలు, కాంతార, తీన్‌మార్‌, బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాయుడువీధిలో కొలువుదీరిన ఇప్పలపోలమ్మకు ఉత్సవ కమిటీ సభ్యులు పూజలు చేసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభించారు. మానుపై అమ్మవారి వేషధారణలో పూజారి కొండెంశెట్టి రమణ ఆశీనులయ్యారు. సంప్రదాయం మేరకు ఆరిక కుటుంబానికి చెందిన రాజారావు అమ్మవారిని దర్శించుకుని రథాన్ని అధిరోహించారు. రెడ్డి వీధి నుంచి ప్రారంభమైన ఉత్సవం పోలీసుస్టేషన్‌, ప్రధాన రహదారికి చేరుకున్న తర్వాత ఘటాలను రాజుగారి కోటలోకి తీసుకెళ్లి పూజలు చేశారు. అక్కడి నుంచి దంగడి, పండా, తెలుకల వీధుల మీదుగా ఉత్సవం ముందుకు సాగింది. ఇప్పలపోలమ్మ చెల్లి, జగన్నాథపురం గ్రామదేవత ఎర్రకంచెమ్మ సిరిమానోత్సవం రాత్రి 8.10 గంటలకు పూజారి నక్క శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు కొత్తవీధి, రాయగడ రోడ్డు, పాతబస్టాండు, ప్రధాన రహదారి వరకు చేరుకుంది. అనంతరం రాజుగారి కోటలో ఘటాలకు పూజలు చేసిన తర్వాత పోలీసుస్టేషన్‌ వీధి మీదుగా జగన్నాథపురం ఆలయానికి చేరుకుంది.

ఇప్పల పోలమ్మ

బంగారమ్మ ఘటాల ఊరేగింపు

ఎర్రకంచెమ్మ సిరిమానోత్సవం 

పట్టణ సమీపంలోని వైకేఎంనగర్‌లో మంగళవారం బంగారమ్మ ఘటాల ఊరేగింపు జరిగింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సాగింది. వీధుల్లో చీరలు పరచి ఘటధారులను భక్తులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటాలు, తప్పెటగుళ్ల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కమిటీ ప్రతినిధులు చంద్రమౌళి, సూర్యప్రకాశ్‌, సూర్యనారాయణ, జానకమ్మ  పర్యవేక్షించారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని