logo

ఏ ఎరువు వేస్తారని.. భూమి అడుగుతోంది

పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. ఇందుకు ఏటా మే మొదటి వారం నుంచే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ ఆ ఊసే లేదు.

Published : 31 May 2023 03:21 IST

భూసార పరీక్షలు ఇంకెప్పుడు?

భూసార పరీక్షా కేంద్రం

న్యూస్‌టుడే, విజయనగరం వ్యవసాయ విభాగం, భోగాపురం: పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. ఇందుకు ఏటా మే మొదటి వారం నుంచే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ ఆ ఊసే లేదు. ఫలితంగా ఏ ఎరువు.. ఎంత మోతాదులో వాడాలో తెలియక అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏటా రైతుల భూముల నుంచి వ్యవసాయాధికారులు మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు జరిపి నేల పరిస్థితి, ఎరువుల వినియోగం వివరిస్తారు. మూడేళ్లుగా ఈ ప్రక్రియ జరగలేదు. ఈ ఏడాదికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ, ఉద్యానాధికారులకు ఏప్రిల్‌లో పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. అప్పట్లో మండలానికి 20 చొప్పున 800 మట్టి నమూనాలను భూసార పరీక్షల కోసం సేకరించారు. కనీసం వాటి ఫలితానికి అనుగుణంగా ఎరువులు వాడుకునేందుకు కర్షకులు ఎదురుచూస్తున్నా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు.

ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా...

జూన్‌ వచ్చిందంటే ఖరీఫ్‌ సీజన్‌ పనులు ప్రారంభమవుతాయి. మేలో మట్టి నమూనాల సేకరణ ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్‌ దగ్గరపడడంతో భూసారం పెంచేందుకు రైతులు పొలాల్లో పచ్చిరొట్ట, నవధాన్యాల పంటలు, నువ్వుల విత్తనాలు ఇప్పటికే చల్లారు. ఆ పొలాల్లో నమూనాల సేకరణ ఇక కష్టమేనని రైతులు చెబుతున్నారు.

సిబ్బంది కొరత

మరోవైపు విజయనగరం భూసార పరీక్షా కేంద్రంలో సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం సహాయ సంచాలకులతో పాటు ఇద్దరు వ్యవసాయాధికారులే ఉన్నారు. లక్ష్యాల నిర్ధారణ బట్టి సిబ్బందిని నియమించాల్సి ఉంది.

మూడేళ్లుగా లేవు

ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్లుగా భూసార పరీక్షలు లేవు. దీంతో రైతులు ఇష్టానుసారంగా ఎరువులు వినియోగించడంతో భూమిలో పోషకాల సమతుల్యం దెబ్బతిని, పంట దిగుబడులపై ప్రభావం చూపుతోంది. 2019-20లో చివరిసారిగా భూసార పరీక్షలు నిర్వహించి, వివరాలతో కార్డులను అందజేశారు. జింకు, జిప్సంను రాయితీపై అందజేశారు. తర్వాత పరీక్షలు లేక అవసరానికి మించి ఎరువుల వాడటం వల్ల చెడు ప్రభావం చూపుతోంది.

జిల్లాలో నేలల పరిస్థితి

* జిల్లాలోని భూముల్లో నత్రజని తక్కువగా ఉంది. బీ భాస్వరం మధ్యస్థ స్థాయి నుంచి ఎక్కువగా ఉంది.

* పొటాష్‌ ఎక్కువ నుంచి మధ్యస్థంగా ఉంది. బీ  సూక్ష్మపోషకాలైన జింకు, కాఫర్‌, ఐరన్‌, మాంగనీసు సమతుల్యంగా ఉన్నాయి.

లక్ష్యం ప్రకటించగానే ప్రారంభిస్తాం

భూసార పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. సహాయ సంచాలకులు, వ్యవసాయాధికారులు, ఇంటిగ్రేటేడ్‌ అగ్రిల్యాబ్‌ అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఆపై మండల స్థాయిలో శిక్షణలు పూర్తయ్యాయి. ప్రభుత్వం లక్ష్యాలు ప్రకటించగానే మట్టి నమూనాల సేకరణ ప్రారంభిస్తాం.

బి.భానులత, భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకురాలు, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని