logo

పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు

యువతిని వేధిస్తున్న ఓ యువకుడ్ని అరెస్టు చేసినట్లు కొత్తవలస సీఐ బాలసూర్యారావు తెలిపారు.

Published : 31 May 2023 03:21 IST

కొత్తవలస, న్యూస్‌టుడే: యువతిని వేధిస్తున్న ఓ యువకుడ్ని అరెస్టు చేసినట్లు కొత్తవలస సీఐ బాలసూర్యారావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకరపాలెం గ్రామానికి చెందిన ఓ యువతికి స్థానికంగా ఉంటున్న యువకుడితో నాలుగేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది. వ్యక్తిగత కారణాలతో ఆ సంబంధం తెగిపోయింది. అప్పటినుంచి సదరు యువకుడు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఫొటోలను సామాజిక మాధ్యమాలు, బంధువులకు పెట్టేవాడు. ఈక్రమంలోనే ఈనెల 28న అర్ధరాత్రి వేళ బాధితురాలి ఇంటికి వెళ్లి, పెళ్లి చేసుకోవాలని.. లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆమె తల్లిదండ్రులను దుర్భాషలాడాడు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను ఎస్సై బి.దేవికి అప్పగించినట్లు సీఐ చెప్పారు.


ఎండ తీవ్రతకు కూలీ మృతి

సీతయ్య (పాతచిత్రం)

కొమరాడ, న్యూస్‌టుడే: ఎండ తీవ్రతకు కొమరాడ మండలంలోని గుంపగదబవలస గ్రామానికి చెందిన ఈదల సీతయ్య(55) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి వివరాల మేరకు.. ఉపాధిహామీ పనికి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు.  108 వాహనంలో ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి సిటు జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబమూర్తి వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకంలో రెండు పూటలా పనులు చేస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారన్నారు.


రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: రాజాం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు అవుట్‌గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చీడి లక్ష్మణరావు(65) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలోని గడ్డవీధికి చెందిన లక్ష్మణరావు మంగళవారం ఉదయం ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న పూలకొట్టులో పని చేసేందుకు బయలుదేరారు. కాలినడకన వస్తున్న ఆయన్ను ఓ బొలేరో వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అతని సోదరుడు గురుమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని