logo

ఆటలు.. పాటలు.. సరదాగా చదువులు..

వేసవి సెలవులొస్తే.. సినిమాలు.. షికార్లు.. పార్కులు.. పార్టీలు.. పక్కింట్లో ముచ్చట్లు.. వీధుల్లో ఆటలు.. అమ్మమ్మ ఇంటికి పయనాలు.. అయితే గత కొన్నేళ్లుగా ఈ పంథా మారింది..

Published : 01 Jun 2023 04:20 IST

వేసవి శిక్షణ శిబిరాలకు స్పందన
న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి, అయ్యన్నపేట

పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు

వేసవి సెలవులొస్తే.. సినిమాలు.. షికార్లు.. పార్కులు.. పార్టీలు.. పక్కింట్లో ముచ్చట్లు.. వీధుల్లో ఆటలు.. అమ్మమ్మ ఇంటికి పయనాలు.. అయితే గత కొన్నేళ్లుగా ఈ పంథా మారింది.. పిల్లల్లో విజ్ఞానం, కళల్ని పెంచేందుకు సెలవులను ఉపయోగిస్తున్నారు పలువురు తల్లిదండ్రులు. చదువుతోపాటు వినోదాన్ని పంచే గ్రంథాలయాలకు పంపుతున్నారు. భవిష్యత్తుకు ఆరంభదశలోనే గట్టి పునాదులు వేస్తున్నారు. టీవీ, చరవాణి అలవాటును దూరం చేసేందుకూ ఇది సరైన మార్గం.

త ఆరేళ్లుగా వేసవిలో గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలకు చిన్నారులను పంపిస్తున్నారు. పుస్తక పఠనం, భాష, భావ వ్యక్తీకరణ విషయాలపై వక్తలు అవగాహన కల్పిస్తున్నారు. మే 8 నుంచి జూన్‌ 16వ తేదీ వరకు జరిగే పలు కార్యక్రమాల్లో కథలు, వినోదం, విజ్ఞానం, క్రీడా అంశాల్లో మెలకువలు తెలుసుకోవడం కోసం ప్రత్యేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. కథనాలు వినడం, చిత్రలేఖనం, పేపర్‌క్రాఫ్ట్‌, గణితం మెలకువలు, చదవడం నాకిష్టం, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ శిక్షణ, సంగీతం, నృత్యం, డ్రామా, పుస్తక సమీక్ష, కథలు చెప్పడంపై నిపుణులతో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తర్ఫీదునిస్తున్నారు.      

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ గ్రంథాలయాలు 41 ఉండగా వీటిలో ప్రథమ- 1, ద్వితీయ- 4, తృతీయ- 32, గ్రామీణ గ్రంథాలయాలు 4 ఉన్నాయి. ప్రతి కేంద్రానికీ రోజుకు 50 నుంచి 80 మంది (10-15 ఏళ్లు) వస్తున్నారు. ఈ లెక్క ప్రకారం నిత్యం దాదాపు 3 వేల మంది వరకు శిక్షణలను సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్నాక్స్‌, క్రీడా సామగ్రి, అవగాహన కార్యక్రమాలు, పోటీల్లో గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలకు అన్ని గ్రంథాలయాలకూ కలిపి ప్రభుత్వం రూ.4.30 లక్షలు విడుదల చేసింది. ఆయా నిధులను శాఖా హోదాను బట్టి గరిష్ఠంగా రూ.25 వేలు, కనిష్ఠం రూ.10 వేల చొప్పున కేటాయించారు.


రొబోటిక్స్‌పై అవగాహన
- బి.యశ్వంత్‌, 9వ తరగతి

శిక్షణలో పాల్గొనడం వల్ల రొబోటిక్స్‌, భారతీయ విలువలు తదితర అంశాలపై అవగాహన వచ్చింది. గతంలో ఇంటి వద్దే ఉండేవాడ్ని. ఈ శిబిరాలతో మంచి స్నేహితులను పొందడంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతోంది. సెలవులు వృథా కాకుండా విజ్ఞానం, వినోదం అందుతున్నాయి. రోజూ క్విజ్‌ పోటీలు నిర్వహించి.. మాలో పోటీతత్వాన్ని పెంచుతున్నారు.


ఇష్టంతో చదువుతున్నా..
- షర్మిల, 5వ తరగతి

మా అమ్మానాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. గ్రంథాలయాల ద్వారా మరింత విజ్ఞానం వస్తుందని నన్ను పంపుతున్నారు. ఇక్కడ ఉన్న పుస్తకాలతో మరింత విజ్ఞానం, మానసిక పరిపక్వత వస్తోంది. ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను శిక్షకులు నేర్పిస్తున్నారు. ఇష్టంతో చదువుతున్నా. కొత్త స్నేహితులు దొరికారు. యూట్యూబ్‌ వీడియోల ద్వారా క్రాఫ్ట్‌ ఏవిధంగా చేయాలో క్లుప్తంగా వివరిస్తున్నారు. డ్రాయింగ్‌ కూడా నేర్చుకుంటున్నా. కంప్యూటర్‌పై అవగాహన వస్తోంది.


విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పన..
- లలిత, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ అధికారిణి

శిబిరాలకు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. ముందుగానే ఇంటికి పంపిస్తున్నాం. ప్రతిరోజూ నీరు, మజ్జిగతోపాటు స్నాక్స్‌ అందిస్తున్నాం. కొన్నిచోట్ల మరుగుదొడ్ల సమస్య ఉంది. 14 గ్రంథాలయాల్లో 14 నూతన మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మూడు నూతన గ్రంథాలయాల నిర్మాణం చేపట్టాం. అన్ని శాఖల్లో 3 నుంచి 5 వేల విజ్ఞాన పుస్తకాలు ఉంచాం. వివిధ రకాల రిసోర్సు పర్సన్స్‌తో కొత్తకొత్త అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని