logo

పదహారోసారి.. పిలుపు

సాలూరు పట్టణంలోని 14వ వార్డు బంగారమ్మకాలనీలో గత మూడేళ్లుగా ఈ నీటి పథకం వినియోగంలో లేదు. కొత్త బోరు వేసి పథకం అభివృద్ధి పనులు చేసేందుకు పురపాలక సాధారణ నిధులు రూ.1.31 లక్షలు మంజూరు చేశారు.

Published : 01 Jun 2023 04:20 IST

టెండరు వేయించే బాధ్యత కౌన్సిలర్లదే
సమావేశంలో ప్రకటించిన అధికారులు

సాలూరు పట్టణంలోని 14వ వార్డు బంగారమ్మకాలనీలో గత మూడేళ్లుగా ఈ నీటి పథకం వినియోగంలో లేదు. కొత్త బోరు వేసి పథకం అభివృద్ధి పనులు చేసేందుకు పురపాలక సాధారణ నిధులు రూ.1.31 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 15 సార్లు టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాలేదు. ఈసారైనా గుత్తేదారులు స్పందించి, పనులు జరిగితే ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయి.


సాలూరు, న్యూస్‌టుడే: ‘అభివృద్ధి పనులు చేయండి. బిల్లులు ఇప్పించే బాధ్యత మాది’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పదిరోజుల కిందట సాలూరు పట్టణంలో 97 అభివృద్ధి పనులకు టెండర్లు పిలవగా ఒక్కదానికే దాఖలైంది. ఈక్రమంలో ‘ఎన్నికల సమీపిస్తుండటంతో ఎంతోకొంత అభివృద్ధి చేయాలి. లేదంటే పట్టణ ప్రజలకు ముఖం చూపలేం, పనులు జరిపించండి’ అని కౌన్సిల్‌ సభ్యులు ఉపముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో చివరకు వార్డులలో పనులు చేయించుకునే బాధ్యతలను పాలకవర్గ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కమిషనర్‌ శంకరరావు ప్రకటించారు. వార్డుల వారీగా ప్రతిపాదించిన పనులు, టెండర్ల వివరాలతో కూడిన ప్రతులను సభ్యులకు అందజేశారు. వార్డుల్లో చేపట్టే పనులకు కాంట్రాక్టర్లతో టెండర్లు వేయించుకునే బాధ్యత సభ్యులదేనని చెప్పారు. ఆర్థిక సంఘ నిధులతో ప్రతిపాదించినవి కాకుండా.. గడప గడపకు కార్యక్రమం కింద మంజూరై నిధులతో జరిగేలా గుత్తేదారులను కోరాలన్నారు.


మోక్షమేదీ..?

పురపాలికలో ప్రతిపాదించిన పనులకు ఇప్పటికే 15 సార్లు టెండర్లు పిలిచారు. అయినప్పటికీ మోక్షం కలగలేదు. ఈక్రమంలో రూ.2.59 కోట్లతో ప్రతిపాదించిన 96 పనులు చేపట్టాలని అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. 25 పనులకు సంబంధించి 16వ సారి, 22- 9వసారి, తొమ్మిదింటికి- 8వసారి, 19- ఆరోసారి, 15- మూడోసారి, 5 పనులకు రెండోసారి, ఒకటోసారి ఒకపనికి టెండర్లు పిలిచారు. వీటిలో గడప గడపకీ పనులు పూర్తిస్థాయిలో జరిపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితి. కాంట్రాక్టర్లతో టెండర్లు వేయిస్తారా.. లేదంటే మరో సారీ.. చెప్తారా వేచి చూడాల్సి ఉంది.


బాబ్బాబు.. ముందుకు రండి..

ఒకప్పుడు పనుల కోసం గుత్తేదారులు ఛైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సభ్యుల వెంట పడేవారు. కానీ, పరిస్థితి మారింది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. సకాలంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి కానరావడం లేదు. వార్డుల్లో తలెత్తుకు తిరగలేక పోతున్నామని సభ్యులు పలుమార్లు పురపాలక సమావేశాల్లో తమ గోడు వినిపించారు. అయినప్పటికీ మోక్షం కలగలేదు. మంత్రులకు ఆలపించారు. అయినా అమాత్యుల మాటలను గుత్తేదారులు బేఖాతరు చేశారు. చేసేదేమీ లేక చివరకు కౌన్సిలర్లకే పనులు జరిపించుకునే బాధ్యత అప్పగించారు. నాడు పనులు బాగా చేయలేదు, ఈగుత్తేదారుకు టెండరు ఖరారు చేయొద్దు అని చెప్పిన కౌన్సిలర్లే.. నేడు ‘అయ్యా బాబూ రండి మా వార్డులో పనులకు టెండరు వేయండంటూ’ బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. బడానేతలు, అధికారులకు చెప్పినా పనిజరగలేదు. కనీసం మీరు మామీద నమ్మకం ఉంచి పనులు చేసేందుకు ముందుకు రండని పిలుస్తున్నారు.


మళ్లీ పిలిచాం..
- శంకరరావు, కమిషనర్‌,  సాలూరు పురపాలక సంస్థ

97 అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచాం. ఒకదానికి సంబంధించి దాఖలయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిగిలిన 96 పనులకు మరోసారి పిలిచాం. ఈనెల మూడోతేదీ మధ్యాహ్నం మూడు గంటలలోగా పత్రాలు దాఖలు చేయడానికి గడువిచ్చాం. ఈసారి అన్ని పనుల్లో కదలిక వస్తుందని భావిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు