logo

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ కళాశాల పున:ప్రారంభం

ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి ఇంటర్మీడియట్‌ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలతో పాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.

Published : 01 Jun 2023 04:46 IST

విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అసంపూర్తిగా నాడు-నేడు పనులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి ఇంటర్మీడియట్‌ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలతో పాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో చాలామంది పరీక్ష తప్పారు. ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.


అనుకూలం

* మే 15 నుంచే ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. అధ్యాపకులు మార్చి, ఏప్రిల్‌లో పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పించడంతో చాలామంది ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు.

* విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఒప్పంద, అతిథి బోధకులను కొనసాగించేందుకు ఆదేశాలొచ్చాయి. అయితే బదిలీలతో అవరోధం కలగనుంది. అధ్యాపకులకు సంబంధించి జూన్‌ 2 నుంచి స్థానచలనం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇతర జిల్లాల్లో పనిచేసేవారు ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఖాళీల మేరకే అతిథి బోధకులను కొనసాగించనున్నారు.

* విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 32 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిలో 446 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిలో 125 మందే రెగ్యులర్‌. మిగిలిన వారంతా ఒప్పంద, అతిథి బోధకులే.


ప్రతికూలం

* గత రెండేళ్లుగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేయలేదు. 2023-24 విద్యాసంవత్సరానికి 43,007 పుస్తకాలు కావాలని ప్రతిపాదించినా నేటికీ రాలేదు. మొదటి సంవత్సరం 22,428, ద్వితీయ ఏడాది వారికి 20,579 పంపిణీ చేయాల్సి ఉంది. గతేడాది అంతకుముందు సంవత్సరాల్లో మిగిలిన వాటిని సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఏం చేయాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

* అమ్మఒడి పథకంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. గ్రామీణ విద్యార్థులు కావడంతో పథకం నిర్వహించాలన్న డిమాండు ఉన్నా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

* కొన్ని కళాశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. అన్నిచోట్లా తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలున్నాయి.

* నాడు-నేడు పనుల్లో జాప్యం జరుగుతోంది. మన్యం జిల్లాలో కొంత ప్రగతి కనిపిస్తున్నా, విజయనగరం జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. 17 కళాశాలలకు రూ.11.81 కోట్లు మంజూరు కాగా.. రెండు విడతలుగా రూ.2.98 కోట్లు విడుదలయ్యాయి. రూ.1.80 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 40 శాతం పనులు పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సిమెంటు కొరత, ఇతర సామగ్రి రాకపోవడంతో ప్రగతి కొరవడుతోంది.


అడకమిక్‌పై ప్రత్యేక దృష్టి..: విద్యా సంవత్సరం ఆరంభం నుంచే అకడమిక్‌పై ప్రత్యేక దృష్టి పెడతాం. కరోనా బ్యాచ్‌లు లేకపోవడంతో ఫలితాలు మెరుగుపడతాయని భావిస్తున్నాం. విద్యార్థులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో దేనిలోనైనా ప్రవేశాలు పొందవచ్చు. పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. సిమెంటు వస్తే నాడు-నేడు పనులు పూర్తవుతాయి.

ఆర్‌.సురేష్‌కుమార్‌, డి.మంజులవీణ, వృత్తి విద్యాశాఖాధికారులు, ఉమ్మడి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని