డబ్బులు ఊరికే రావు.. ఇవీ అడగండి బాబూ..
పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్..
న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్తా విభాగం
పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్.. బంకుల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా గాలి కొట్టడం, తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యత పరిశీలన.. తదితర సదుపాయాలు కల్పించాలి. ఇవేవీ లేకపోతే సంబంధిత వ్యక్తులపై తూనికలు- కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. మరి మీరివి సద్వినియోగం చేసుకుంటున్నారా? ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా..
ఉమ్మడి జిల్లా పరిధిలో 134 పెట్రోల్ బంకులున్నాయి. వీటిల్లో చాలాచోట్ల సౌకర్యాలు కానరావడం లేదు. మరుగుదొడ్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. అవి కేవలం అక్కడ పనిచేసే సిబ్బందికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అలాగే తాగేందుకు నీరు ఉన్నట్లు ఖాళీ క్యాన్లు ఉంచుతున్నారు. గాలి ఉచితమని బోర్డులున్నా.. కొట్టేందుకు మనిషి కనిపించడు. తూకం పరికరం, పెట్రోల్ తెలుసుకునేందుకు నాణ్యత పేపర్ల ఊసే లేదు. ఈక్రమంలో వినియోగదారులు నష్టపోతున్నారు.
పాటించకపోతే చర్యలు..
వినియోగదారులకు సౌకర్యాలు కల్పించకపోతే తూనికలు- కొలతల శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు. ఇటీవల అన్ని బంకులనూ పరిశీలించి, దాదాపు 25 కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. 2020-21లో 260 సార్లు, 2021-22లో 247, 2022- 23లో 399 సార్లు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. ఏడాదికి ఒక్కో బంకునూ దాదాపు 5 నుంచి 10 సార్ల వరకు పరిశీలిస్తున్నామని తూనికలు- కొలతల శాఖ మూడు జిల్లాల సహాయ సంచాలకుడు జనార్దనరావు తెలిపారు.
బోర్డులు తప్పనిసరి..
ఏ సౌకర్యం ఎక్కడ ఉందో తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అత్యవసర సేవల కోసం పట్టికలు పెట్టాలి. వాటి మీద ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు రాయాలి. ప్రతిజిల్లాలో ఆయిల్ కార్పొరేషన్ తరఫున ఒక అధికారి ఉంటారు. సదుపాయాలు కానరాకపోతే ఆయనకు తెలియజేయొచ్చు. స్పందించకపోతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. తూకంలో తేడా ఉంటే తూనికలు- కొలతలశాఖ అధికారులకు, నాణ్యత లోపించినా, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోతే పౌర సరఫరాలశాఖ సిబ్బందికి విన్నవించొచ్చని డీఎస్‌వో మధుసూదనరావు తెలిపారు. తమశాఖ తరఫున అప్రమత్తంగా ఉన్నామన్నారు.
నిబంధనలివీ..
* ప్రతి బంకు వద్ద ఉచితంగా గాలి కొట్టే సౌకర్యం కల్పించడంతో పాటు ఒక మనిషిని అందుబాటులో ఉంచాలి. డబ్బులు డిమాండ్ చేయరాదు.
* వినియోగదారులకు కనిపించేలా తాగేందుకు నీళ్లు ఉంచాలి.
* కొలతల్లో తేడాలను చూసుకునేందుకు తప్పనిసరిగా కొలత క్యాన్లను పెట్టాలి.
* నాణ్యత తెలుసుకునేందుకు లిట్మస్ పేపర్ ఉంచాలి. దాని మీద ఒక చుక్క ఆయిల్ పోశాక అది రంగు మారితే సరైన ఇంధనం కానట్లే.
* అందుబాటులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వాటిని శుభ్రంగా ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు
-
Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు
-
Jaane Jaan Review: రివ్యూ: జానే జాన్.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా?