logo

ఈ నవ్వు ఇక కనిపించదు

బీటెక్‌ చదువుతున్నాడు. ఇంజినీరై తమను ఆదుకుంటాడని కలలుగన్నారు. కానీ ఇంతలోనే మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించిన ఘటన విజయనగరంలో జరిగింది.

Published : 06 Jun 2023 03:04 IST

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

ప్రేమ్‌కుమార్‌ (పాతచిత్రం)

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: బీటెక్‌ చదువుతున్నాడు. ఇంజినీరై తమను ఆదుకుంటాడని కలలుగన్నారు. కానీ ఇంతలోనే మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించిన ఘటన విజయనగరంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. డెంకాడ మండలం గెద్దవానిపాలెం గ్రామానికి చెందిన కె.ప్రేమ్‌కుమార్‌(20) గీతమ్‌లో బీ-టెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ కోసం చెల్లి హర్షితతో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం ఇంటినుంచి విజయనగరం బయలుదేరాడు. జిల్లా కోర్టు సమీపంలో విశాఖ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ కింద పడ్డారు. ఈక్రమంలో బస్సు చక్రాలు ప్రేమ్‌కుమార్‌ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. హర్షితకు గాయాలయ్యాయి. వీరి తల్లిదండ్రులు వ్యవసాయదారులు. కుమారుడి మృతితో శోక సంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై గణేష్‌ తెలిపారు.


ఉపాధి పొందిన చోటే ఊపిరి వదిలింది

సీతానగరం, బొబ్బిలి గ్రామీణం: పండ్లు అమ్ముతూ ఉపాధి పొందే మహిళను బొలేరో ఢీకొనడంతో దుర్మరణం చెందిన ఘటనిది. బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన కె.నమలమ్మ(65) లచ్చయ్యపేటలోని రాష్ట్ర రహదారి పక్కన పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న బొలేరో అదుపు తప్పి ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందగా, అక్కడే ఉన్న పెంటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఉద్యోగం పేరిట రూ.5 లక్షల కాజేత

నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తెర్లాం మండలానికి చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు తీసుకొని మోసం చేశాడని బాడంగి ప్రాంతానికి చెందిన బాధితుడు ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 31 మంది నుంచి ఆమె ఫిర్యాదులను స్వీకరించారు. పెళ్లి నిమిత్తం నగరంలోని ఓ బంగారం దుకాణంలో రూ.2.42 లక్షలు ఇచ్చి ఆభరణాలు తయారు చేయాలని కోరగా, డబ్బులు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని దత్తిరాజేరు మండలం లింగాలవలసకు చెందిన బాధితులు అర్జీ అందించారు. 2016లో వ్యవసాయం నిమిత్తం సొంతూరులో భూమి కొనుగోలు చేశానని, దాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆర్మీ జవాన్‌ ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని