logo

కరి..ప్రమాదకరమేమరి!

ఒడిశాలో లకేరి అటవీ ప్రాంతంలోని గజరాజులు పుష్కర కాలానికి పైగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి

Published : 06 Jun 2023 03:28 IST

గజరాజుల విధ్వంసంతో ఏటా నష్టం

కొమరాడ మండలం చెక్కవలస సమీపంలో సోమవారం సంచరిస్తున్న ఏనుగులు

ఈనాడు, విజయనగరం: ఒడిశాలో లకేరి అటవీ ప్రాంతంలోని గజరాజులు పుష్కర కాలానికి పైగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. చేతికందే పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రజలను కంటి మీద కునుకు లేకుండా భయపెడుతున్నాయి. వీటి దాడులతో ఆస్తులే కాదు ప్రజలు, పాడి పశువుల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. మరోవైపు ఏనుగులూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు వివిధ కారణాలతో 11 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. కరిరాజులను తరలించండి.. మా పంటలు కాపాడండంటూ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలకుల్లో స్పందన లేదు.

తొలిసారి చెరకు పంటకు విరామం

ఏటా నష్టాలు భరించలేక.. ప్రభుత్వం ఆదుకోక.. ఈ ఏడాది భామిని మండలం ఘనసర, తాలాడ గ్రామాల పరిధిలోని 300 ఎకరాల్లో తొలిసారి చెరకు పంటకు రైతులు విరామం ప్రకటించారు. కూలీలు సైతం పనులకు రావడం లేదు. బితుకు బితుకుమంటూ సాగు చేసినా చివరకు పంట చేతి కందడం లేదు. పాలకులకు మొర పెట్టుకున్నా..  నష్టపరిహారమూ చెల్లించడం లేదని.. ఈ రెండు గ్రామాల రైతులు వాపోతున్నారు.

ప్రభావిత ప్రాంతాలు..

భామిని మండలం పసుపూడి, తాలాడ, ఘనసర, కీసర, కోసలి, కురుపాం మండలం బాసంగివలస గ్రామాలు.. జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, బలిజిపేట, సీతంపేట మండలాల్లోని కొన్ని గ్రామాలు.

ఏటా రూ.5 కోట్లకు పైగా నష్టం

కరిరాజుల ప్రభావిత ప్రాంతాల్లో ఏటా చెరకు, జొన్న, అరటి సహా క్యారెట్‌, టమాటా, బీట్‌రూట్‌, బెండ, మిరప, వంగ తదితర రకాల పంటలపై ఏటా సుమారు రూ.5 కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారు.

కాగితాల్లోనే ప్రతిపాదనలు

ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాన్ని ‘ఎలిఫెంట్స్‌ కారిడార్‌’గా లేదా.. వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని అటవీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పంటల రక్షణ చర్యలకు సుమారు రూ.40 కోట్లు అవసరమని, అటవీ శాఖలో ఇప్పుడున్న మానవ వనరులతో వాటిని కట్టడి చేయడం కష్టమని వారు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు జిల్లా అధికారులు పంపిన నివేదిక మేరకు ఉన్నతాధికారులు రూ.28 లక్షలు పరిహారం మంజూరు చేసినా, ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.


ఏటా నష్టాలు.. ఇంకెన్నాళ్లు..

‘సుమారు పదెకరాల్లో చెరకు, జొన్న, ఇతర పంటలు సాగు చేస్తున్నా. నాలుగేళ్ల నుంచి పంటను, సోలార్‌ బోర్లను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. పొలానికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. కూలీలు పనులకు రావడం లేదు. కరిరాజుల కంటపడకుండా ఇద్దరు కాపలా ఉంటే.. మరో ఇద్దరు పొలంలో పనులు చేయాలి. మామిడి, జీడి తోటల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా రూ.4 లక్షల వరకూ నష్టపోతున్నా. అధికారులకు మొర పెట్టుకున్నా.. చర్యలు లేవు, పంట నష్ట పరిహారమూ లేదు. మేమెలా బతికేది..’
భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన రైతు భూపతి ఆనందరావు ఆవేదన


కట్టడికి అధ్యయనం చేస్తున్నాం..

అభయారణ్యంగా ప్రకటిస్తే ఏనుగులను కట్టడి చేయొచ్చు. దీనిపై అధ్యయనం చేస్తున్నాం. ప్రభుత్వం నిధులిచ్చి, కొంత భూభాగం చూపాలి. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు దొరక్క మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 12 ఏనుగులు సంచరిస్తున్నాయి. పంట నష్ట పరిహారానికి ఉన్నతాధికారులకు నివేదించాం. విద్యుత్తు నియంత్రికను తాకి నాలుగు ఏనుగులు మృత్యువాతపడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందితోపాటు ప్రత్యేకంగా ఒక రేంజర్‌ను నియమించాం. పంట పొలాల్లో విద్యుత్తు నియంత్రికల ఎత్తు పెంచాలి.

ప్రసూన, డీఎఫ్‌వో, పార్వతీపురం మన్యం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని