logo

శుద్ధజలం.. ఇంకెంత దూరం!

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులు, సిబ్బంది దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్ర పరికరాల (ఆర్‌వో) ప్లాంట్లు మూలకుచేరాయి.

Updated : 06 Jun 2023 05:24 IST

ప్రభుత్వ కళాశాలల్లో ఆర్‌వో ప్లాంట్ల వ్యవస్థ అస్తవ్యస్తం

(న్యూస్‌టుడే-గరివిడి/చీపురుపల్లి/గజపతినగరం/శృంగవరపుకోట/నెల్లిమర్ల/పార్వతీపురం పట్టణం): గజపతినగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జలశుద్ధి యంత్రపరికరం ఏర్పాటుకు నిర్మించిన షెడ్డు ఇది. విద్యుత్తు, పైప్‌లైన్‌ సదుపాయం కల్పించి   వాటర్‌ ప్లాంటును అమర్చాల్సి ఉన్నా ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. వచ్చిన ప్లాంటు కళాశాలలోనే అలంకార ప్రాయంగా ఉంది.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులు, సిబ్బంది దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్ర పరికరాల (ఆర్‌వో) ప్లాంట్లు మూలకుచేరాయి. ఫలితంగా విద్యార్థులు గుక్కెడు నీటికోసం ఇక్కట్లు పడుతున్నారు. దీంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది.
విజయనగరం, పార్వతీపురం మన్యం ఉమ్మడి జిల్లాలోని కళాశాలలను ‘నాడు-నేడు’ పథకం కింద అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కొన్నాళ్ల కిందట ఆర్భాటంగా పనులు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి ఆర్‌వో ప్లాంట్లు అందించింది. ఈ ప్లాంట్లు కళాశాలలకు చేరుకుని దాదాపు ఒకటి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వీటిని చాలాచోట్ల అమర్చలేదు. ఇవి కళాశాలల గదుల్లోనే నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అమర్చిన ప్లాంట్లు బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. మరమ్మతులకు గురై పనిచేయడం లేదు.

కళాశాలలు ప్రారంభమైనా...

ఈ నెల 1వ తేదీ నుంచే కళాశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి ఇంటర్‌లో ప్రవేశాలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు జరుగుతుండడంతో రోజూ వందల సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారు. ఇంకా  ప్లాంట్లు ఏర్పాటుకాక తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.

ఒక్కో ప్లాంటుకు రూ.5.11 లక్షలు..  

ఉమ్మడి జిల్లాలో మొత్తం 32 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు 52 ఆర్‌వో ప్లాంట్లు మంజూరు చేశారు. విజయనగరం జిల్లాలో కళాశాలలకు 28, పార్వతీపురం మన్యం జిల్లాలో కళాశాలలకు 24 చొప్పున వచ్చాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని కేటాయించారు. 300 మంది విద్యార్థులున్న కళాశాలకు ఒకటి, ఆ సంఖ్య దాటితే రెండు, 500 మందికి పైగా విద్యార్థులున్న చోట మూడు చొప్పున ఇచ్చారు. ఒక్కో దానికి ప్రభుత్వం రూ.5.11 లక్షల చొప్పున వెచ్చించింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రెండు కంపెనీలు వీటిని సరఫరా చేశాయి.

అమరికలో జాప్యం..

నిర్ధేశిత కంపెనీ వాటర్‌ ప్లాంటును మాత్రమే ఇస్తుంది. నీటి సరఫరాకు సంబంధించిన పైప్‌లైన్‌, విద్యుత్తు సదుపాయం వంటి ఇతరత్రా పనులన్నీ ఆయా కళాశాలకు కేటాయించిన నాడు-నేడు నిధులతో ఏర్పాటుచేయాలి. వీటన్నింటినీ కల్పించిన తర్వాత సదరు కంపెనీ సాంకేతిక సిబ్బంది వచ్చి ప్లాంటును అమర్చాలి. పరికరాలు కళాశాలలకు ఇచ్చి వెళ్లిపోతున్నారు తప్ప అమర్చడానికి రమ్మంటే స్పందించడం లేదని, కొన్నిచోట్ల మరమ్మతులకు సాంకేతిక సిబ్బంది రావడం లేదని పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు.


అన్ని చోట్లా అందుబాటులోకి తెస్తాం

నాడు-నేడు పనులు జరుగుతున్న అన్ని కళాశాలలకు వాటర్‌ ప్లాంట్ల ద్వారా తాగునీరు సరఫరాకు చర్యలు చేపడతాం. ఇందుకు అవసరమైన పనులన్నీ ముందుగానే కళాశాలలకు ఇచ్చిన ఈ నిధులతో పూర్తి చేయాలి. ప్రాథమికంగా ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించి శుద్ధజలం సరఫరాకు చర్యలు తీసుకుంటాం.
ఆర్‌.సురేష్‌కుమార్‌, జిల్లా వృత్తివిద్యాశాఖ అధికారి, విజయనగరం


అమరిక జరుగుతోంది..

పార్వతీపురం మన్యం జిల్లాలో 14 జూనియర్‌ కళాశాలలకు 24 ఆర్‌వో ప్లాంట్లు రాగా ఇప్పటికే 16 ప్లాంట్లను అమర్చాం. ఎక్కడా ఇబ్బందులున్నట్టు మా దృష్టికి రాలేదు. మిగతా 8 ప్లాంట్లను త్వరితగతిన అమర్చేందుకు చర్యలు చేపట్టి స్వచ్ఛమైన తాగునీటిని విద్యార్థులకు అందిస్తాం.
మంజుల వీణ, డీఐఈవో, పార్వతీపురం మన్యం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని