logo

నిర్లక్ష్యం మురుగై పోరుతోంది

ఉమ్మడి జిల్లాలో మురుగు సమస్య తాండవిస్తోంది. ప్రధాన రోడ్లు,  వీధులు, కాలనీలన్నీ వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి. ప్రస్తుత  పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు.

Published : 07 Jun 2023 04:01 IST

న్యూస్‌టుడే, మక్కువ, పార్వతీపురం పురపాలక, భోగాపురం, పాలకొండ/గ్రామీణం, పార్వతీపురం పట్టణం

మ్మడి జిల్లాలో మురుగు సమస్య తాండవిస్తోంది. ప్రధాన రోడ్లు,  వీధులు, కాలనీలన్నీ వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి. ప్రస్తుత  పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు.


పార్వతీపురంలోని అయ్యప్ప మందిరం సమీపంలో చెత్త కుప్ప ఇలా పేరుకుపోయింది.  దీంతో ఇటుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులను పంపించి చెత్త తరలిస్తామని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురళీ తెలిపారు.


మక్కువ మండల కేంద్రం నుంచి సాలూరు పట్టణానికి 19.60 కిలోమీటర్ల మేర రహదారి వేసేందుకు రెండేళ్ల కిందట రూ.55.56 కోట్ల నిధులు మంజూరైనా పనులు పూర్తికాలేదు. అంతంతమాత్రమే చేయడంతో ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోతున్నాయి. పరిష్కారానికి తాత్కాలిక కాలువలు నిర్మిస్తున్నామని ఆర్‌అండ్‌బీ జేఈ కమలాకర్‌ తెలిపారు.


పార్వతీపురం జిల్లా కేంద్రంలోని చినదేవరవీధిలో నెలకొన్న దుస్థితి ఇది. కొళాయిల నుంచి నీరొచ్చినా ప్రతిసారీ ఇలా మురుగుమయమవుతోంది. నాలుగేళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ స్పందించడం లేదు. కాలువల్లో పూడికలు తొలగించి, పరిస్థితిని చక్కదిద్దుతామని కమిషనర్‌ రామప్పలనాయుడు పేర్కొన్నారు.


పాలకొండలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణమిది. వర్షపునీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఇలా ఒకేచోట నిలిచిపోతోంది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సమీపంలో ఉన్న ఆంజనేయనగర్‌, టీచర్స్‌ కాలనీ వాసులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణను ఎత్తు చేస్తామని డిపో మేనేజరు వెంకటేశ్వరరావు తెలిపారు.


ఇళ్ల వెనుకభాగంలో పేరుకుపోయిన వ్యర్థాలు

భోగాపురం మండలంలో పెద్ద పంచాయతీగా గుర్తింపు పొందిన ముంజేరులో సిద్ధార్థనగర్‌కు వెళ్లే దారిది. ఇక్కడ కాలువలు, సీసీ రోడ్డు నిర్మించారు. మధ్యలోనే ఆగిపోవడంతో ఇలా కాలనీ చివర మురుగునీరు పేరుకుపోతోంది. జిల్లా అధికారులతో పాటు, ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కూడా దీనిపై స్పందించినా ఫలితం దక్కడం లేదు. అక్కడివారు సహకరిస్తే.. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎంపీడీవో బంగారయ్య చెప్పారు.

రహదారి మీదుగా వెళ్లలేని పరిస్థితి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని