logo

మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి?

ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు, స్నేహితుల తర్వాత ఎక్కువ గడిపేది మీతోనే. మీలోనే క్రమశిక్షణ లేకపోతే.. మిమ్మల్ని చూసి వారేమి నేర్చుకుంటారు? రాబోయే తరాన్ని క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారు.  

Published : 24 Sep 2023 05:22 IST

ఉపాధ్యాయులతో ప్రవీణ్‌ పకాశ్‌


కస్పా పాఠశాలలో విద్యార్థుల వర్క్‌బుక్‌ పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ కార్యదర్శి

ఈనాడు, విజయనగరం, విద్యావిభాగం, పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు, స్నేహితుల తర్వాత ఎక్కువ గడిపేది మీతోనే. మీలోనే క్రమశిక్షణ లేకపోతే.. మిమ్మల్ని చూసి వారేమి నేర్చుకుంటారు? రాబోయే తరాన్ని క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారు.  

 విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌


విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శనివారం నగరంలో పర్యటించి, కస్పా, రామకృష్ణ పాఠశాలలను పరిశీలించారు. అక్టోబరు 3 నుంచి ఫార్మేటివ్‌ పరీక్షలు జరుగుతాయని తెలిసినా విద్యార్థులతో వర్క్‌బుక్స్‌ రాయించడం, మూల్యాంకనం చేయకపోవడంపై మండిపడ్డారు. అధ్యాపకుల నుంచి ఎంఈవో, డీడీఈవో, డీఈవో, ఆర్జేడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఉపాధ్యాయులపై చర్యలకు సిఫార్సు చేశారు. సస్పెండ్‌ చేసే అధికారమున్నా క్షేత్రస్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి, ఆర్జేడీ జ్యోతికుమారిని ప్రశ్నించారు. విద్యలో ఇండియా ఏమీ తక్కువ కాదని, హార్డ్‌వర్క్‌ చేయకపోవడమే లోపమని పేర్కొన్నారు. పరిసరాలు పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి ఒకరికి  స్వయంగా భోజనం తినిపించారు.

విద్యార్థులను బయటకు పంపించి..: కస్పా ఉన్నత పాఠశాలలో ఏడో తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో వర్క్‌బుక్స్‌ను కొందరు రాయకపోవడం, రాసినవి ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ, డీఈవోలను ఆదేశించారు. తరగతి గది నుంచి విద్యార్థులను బయటకు పంపి, ఉపాధ్యాయులు, అధికారులతో లోపాలపై చర్చించారు.

కమిషనర్‌ పేరు తెలియదా?...: నగరంలో 15 డివిజన్‌ సచివాలయం సందర్శనలో ఇద్దరు వాలంటీర్లకు నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీరాములనాయుడిని చూపించి.. ఎవరని అడిగారు. తెలియదని వారు చెప్పడంతో.. రోజుకో సచివాలయం సందర్శిస్తే తెలుస్తుందని కమిషనర్‌కు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని