logo

సౌర విద్యుత్తు వినియోగమెప్పుడో

సంప్రదాయ వనరులను వినియోగించుకొని ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యంతో మారుమూల గిరిజన గ్రామాల్లో సౌరవిద్యుత్తు ఆధారంగా ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు జిల్లాలో మూలకు చేరాయి. తొలినాళ్లలో పనిచేసినా, తర్వాత ఒక్కొక్కటిగా మూలకు చేరాయి

Updated : 24 Sep 2023 06:14 IST

మరమ్మతులతో మూలకుచేరిన తాగునీటి పథకాలు

సీతంపేట మండలంలో విద్యుత్తు మోటార్లు అమర్చుకొని వినియోగిస్తున్న సౌరశక్తి ఆధారిత తాగునీటి పథకం

పార్వతీపురం, న్యూస్‌టుడే: సంప్రదాయ వనరులను వినియోగించుకొని ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యంతో మారుమూల గిరిజన గ్రామాల్లో సౌరవిద్యుత్తు ఆధారంగా ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు జిల్లాలో మూలకు చేరాయి. తొలినాళ్లలో పనిచేసినా, తర్వాత ఒక్కొక్కటిగా మూలకు చేరాయి. మరమ్మతులకు నిబంధనలు అడ్డుగా ఉండడంతో వందలాది సౌరపరికరాలు పనిచేయక గిరిజనులు తాగునీటికి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

సీతంపేటలోనే అత్యధికం

జిల్లాలో 477 సౌరశక్తి ఆధారిత తాగునీటి పథకాలు ఉన్నాయి. సౌరవిద్యుత్తుతో మోటార్లు నడిచి, ట్యాంకులకు నీటిని ఎక్కించి కుళాయిల ద్వారా నీటిని అందించేందుకు ఈ వ్యవస్థలను గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పాటుచేశారు. సీతంపేట మండలంలో 160 ఉన్నాయి. తర్వాత స్థానాల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, పార్వతీపురం మండలాలు నిలుస్తాయి. గ్రామీణ నీటిసరఫరా విభాగం లెక్కల ప్రకారం వందకు పైగా పనిచేయడం లేదు. గ్రామాల్లో పరిశీలిస్తే ఆ సంఖ్య రెంటింపు ఉంటుందని చెబుతున్నారు. ఒక్క సీతంపేట మండలంలోనే ముప్పైకి పైగా మరమ్మతులు గురయ్యాయి.

మరమ్మతులు చేస్తామన్నా..

ఈ సౌర పరికరాల మరమ్మతులు, విడిభాగాల ఏర్పాటుకు నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. అవసరమైన విడిభాగానికి ఎంత ధర చెల్లించొచ్చనే అంశాన్ని సాంకేతిక విభాగం ఇంజినీరింగు అధికారులు చెబుతారు. వాటి ధరలు నిర్ణయించక పోవడంతో  బాగుచేయడం లేదు. అమర్చిన గుత్తసంస్థలే ఐదేళ్ల పాటు నిర్వహణ భారం భరించాలి. అది జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.


ఉన్నతాధికారులకు లేఖలు..

జిల్లాలో సౌరశక్తి ఆధారిత పథకాలు వందకు పైగా మరమ్మతులకు గురయ్యాయి. అవసరమైన విడిభాగాల కొనుగోలుకు, బిల్లులు సమర్పించడానికి ధర ఎంతనేది అధికారికంగా తెలియక జాప్యం జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నాం.  
 ఒ.ప్రభాకరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి


విద్యుత్తు మోటార్లతో..

పరికరాలు మరమ్మతులకు గురైన కొన్ని పంచాయతీల్లో ఈ యూనిట్లకు విద్యుత్తు మోటార్లు అమర్చడంతో బిల్లుల భారం పడుతోంది.సర్పంచులు అంగీకరించని చోట అవస్థలే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని