logo

ఆర్టీసీ విలీనంతో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని, ఇంతవరకు పీఎఫ్‌, నగదు సెలవులకు సంబంధించి రూ.900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్షుడు పివి. రమణారెడ్డి అన్నారు

Published : 24 Sep 2023 05:24 IST

ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి

విజయోత్సవ సభలో మాట్లాడుతున్న ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి

సాలూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని, ఇంతవరకు పీఎఫ్‌, నగదు సెలవులకు సంబంధించి రూ.900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్షుడు పివి. రమణారెడ్డి అన్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయని దాచుకున్న డబ్బులు అందక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారన్నారు. ఏపీపీటీడీ చరిత్రలో ఎన్‌ఎంయూఏకు మొదటిసారిగా గుర్తింపు వచ్చినందుకు శనివారం సాలూరులోని లూథరన్‌ కమ్యూనిటీ హాలులో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే ఏదో జరుగుతుందని భావించిన కార్మికుల ఆశలన్నీ అడియాసలు అయ్యాయన్నారు. ఓపీఎస్‌, సీపీఎస్‌, జీపీఎస్‌ ఏదీ లేదన్నారు. సీనియార్టీ ప్రకారం పదోన్నతులు లేవన్నారు. నష్టాల పేరుతో గ్రామాలకు పల్లెవెలుగు సర్వీసులు నిలిపివేస్తున్నారన్నారు. ఆ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నర్శింగరావు, శిమ్మయ్య, మోహన్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీ నాయుడు, శేఖర్‌, జోనల్‌ నాయకులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని