logo

పట్టణం పేరులో.. స్థలాలు పల్లెల్లో!

పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ప్రణాళికాబద్ధంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లు ఏర్పాటు చేస్తాం

Published : 24 Sep 2023 05:29 IST

విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో దరఖాస్తు చేసినవారికి డెంకాడ మండలం రఘుమండలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సేకరించిన భూమిది. 22.46 ఎకరాల్లో 287 ప్లాట్లు వేశారు. 150 దరఖాస్తులు రాగా, వారికి రెండు విడతల్లో ప్లాట్లు కేటాయించారు. రూ.11.32కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు ప్రారంభించారు.

న్యూస్‌టుడే, సాలూరు, విజయనగరం పట్టణం: పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ప్రణాళికాబద్ధంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లు ఏర్పాటు చేస్తాం.. భూవివాదాలకు తావులేని ప్లాట్లు మధ్యాదాయ వర్గాలు, ఉద్యోగులు, పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం.. టౌన్‌ షిప్‌లో ఫుట్‌పాత్‌లు, ఇంకుడు గుంతలు, నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, పార్కులు, విద్యుత్తు లైన్లు, ఫైబర్‌ నెట్‌, మిరుమిట్లు గొలిపే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం.. ప్లాట్ల కోసం దరఖాస్తులు ఎక్కువ వస్తే లాటరీ పద్ధతిలో కేటాయించి, రిజిస్ట్రేషన్‌ చేస్తాం..

... ఇదీ రెండేళ్ల కిందట

ప్రభుత్వ ప్రకటనఇళ్ల స్థలాలపై ప్రకటనతో సొంతింటి కల నెరవేరబోతోందని ఆనందపడ్డ ఉద్యోగులు, మధ్యాదాయ వర్గాల ఆశలు అడియాసలయ్యాయి. ఎంఐజీ లేఅవుట్లలో స్థలాలు పొందేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల నుంచి వందల్లో దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు లేఅవుట్ల కోసం స్థలాల సేకరణకే ఏడాది పట్టింది. వాటిని పూర్తిస్థాయిలో చదును కూడా చేయలేదు. ప్లాట్లు ఎప్పటికి వేస్తారో తెలియని పరిస్థితి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు మే నెలలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర వెబ్‌సైట్‌ను సాలూరులో ప్రారంభించారు. ఇక్కడ 187 ప్లాట్లకు గానూ ఇప్పటికి కేవలం 24 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

చదును చేసి వదిలేశారు..

ఎంఐజీ లేఅవుట్ల కోసం సేకరించిన స్థలాల్లో ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు లేవు. సాలూరు బైపాస్‌ పక్కన టౌన్‌ షిప్‌ స్థలం చదును చేసిన గుత్తేదారుకు ఇప్పటి వరకు నిధులు చెల్లించలేదు. రూ.2కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. బుడా, ప్రజారోగ్య శాఖ అధికారులు ఆరు నెలల కిందట పరిశీలించారు. ఇప్పటి వరకు నిధులు రాలేదు, పనులు జరగలేదు. విజయనగరానికి రఘుమండ, జీఎన్‌వలసలో స్థలాలు కేటాయించి ఇప్పుడిప్పుడే చదును చేసి గ్రావెల్‌ వేస్తున్నారు. ప్రతిపాదనలు మాత్రం రూ.కోట్లు దాటినా పనుల్లో ప్రగతి గడప దాటని పరిస్థితి. పేరుకే లేఅవుట్లు.. ఇప్పటి వరకు ప్లాట్ల కేటాయింపే జరగలేదు.

దూరంగా సేకరణ..

ఎంఐజీ లేఅవుట్లు వేసేందుకు ఉమ్మడి జిల్లాల్లో సేకరించిన స్థలాలన్నీ పట్టణాలకు సుదూర ప్రాంతాల్లోనే ఉన్నాయి. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో దరఖాస్తుదారులకు గజపతినగరం నియోజకవర్గంలోని జిఎన్‌వలస, నెల్లిమర్ల సమీపంలో రఘుమండ వద్ద, బొబ్బిలిలో రామందొరవలస, రంగరాయపురం, పార్వతీపురంలో అడ్డాపుశీల ప్రాంతాల్లో భూసేకరణ చేశారు. సాలూరులో దుగ్ధసాగరం రెవెన్యూ పరిధిలో డంపింగ్‌యార్డు పక్కన 200 మీటర్ల దూరంలో స్థలం కేటాయించారు. లేఅవుట్‌ పరిశీలించిన వారు దరఖాస్తుకు ఆసక్తి చూపడం లేదు. కారణం దుర్వాసన. విజయనగరం వాసులకూ గ్రామాల్లోనే కేటాయించారు. బొబ్బిలి, పార్వతీపురంలో స్థల సేకరణ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. అందుకే అక్కడ దరఖాస్తులు ఇప్పటికీ స్వీకరించలేదు.

అధికారి మాట ఇదీ..:  బీ విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో రెండు జగనన్న టౌన్‌ షిప్‌లు వేశాం. ప్లాట్ల కోసం 221 దరఖాస్తులు రాగా, పరిశీలించి రెండుసార్లు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సిటీ చీఫ్‌ ప్లానర్‌ సంజీవ్‌ రత్నకుమార్‌ తెలిపారు. బీ సాలూరులో 11.00 ఎకరాలు సేకరించి 187 ప్లాట్లు వేస్తున్నాం. 24 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలించి ప్లాట్లు కేటాయిస్తాం. బొబ్బిలి, పార్వతీపురంలో స్థలం పరిశీలిస్తున్నట్లు బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ ప్లానింగ్‌ అధికారి దేవకుమార్‌ తెలిపారు.


వాస్తవం..:

స్థల సేకరణలో జాప్యం.. వసతులు లేకపోవడం.. పట్టణాలకు దూరంగా ఉండడంతో ప్రజల నుంచి నిరాసక్తత ఎదురవుతోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని