logo
Updated : 25 Nov 2021 10:49 IST

Crime News: నేడు ట్రిపుల్‌ ఐటీలో చేరాల్సిన విద్యార్థిని అనుమానాస్పద మృతి


ప్రశాంతి (పాతచిత్రం)

లింగసముద్రం, ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆమె ప్రతిభావంతురాలైన విద్యార్థిని.. ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో చదివి పదోతరగతిలో 10/10 జీపీఏ సాధించింది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు దక్కించుకుంది. గురువారం అక్కడికి వెళ్లి చేరాల్సి ఉంది. ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రెండ్రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా స్వయంగా తల్లే  కుమార్తె మృతదేహానికి మరికొందరితో కలిసి పెట్రోలు పోసి నిప్పంటించింది. లింగసముద్రం మండల కేంద్రంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
భర్త నుంచి విడిపోయి... 
తిమ్మారెడ్డిపాలెంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న మాధవి కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయారు. ఆయన చీరాలలోని ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. కుమార్తె ప్రశాంతి(17)తో కలిసి లింగసముద్రంలో ఆమె ఒక్కరే నివాసం ఉంటున్నారు. ప్రశాంతి సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని 24 గంటలు ఇంటిలోనే మాధవి ఉంచారు. మంగళవారం అర్ధరాత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి ఇంటి కిందనున్న వ్యక్తితో పాటు మరికొందరితో కలిసి వాహనంలో తరలించి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అయినా మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో బుధవారం మళ్లీ అక్కడికి వెళ్లి మట్టి, బండరాళ్లతో శరీరం కనిపించకుండా పూడ్చివేశారు.

ఏం  జరిగింది..
మాధవి జంగంరెడ్డిపాలేనికి చెందిన ఓ యువకుడితో  కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరు నివాసం ఉంటున్న ఇంటి కింది పోర్షనులో అతను ఉంటున్నాడు.  ప్రశాంతి అడ్డుగా మారిందని భావించి కడతేర్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మాధవి, అటు ఆ యువకుడు కలిసి గ్రామస్థులు, పోలీసులకు పొంతన లేకుండా సమాధానాలు ఇచ్చారు. మెట్లపై జారిపడి ప్రశాంతి తీవ్రంగా గాయపడిందని, తాను కంగారుపడి ఇంట్లోనే ఉంచగా మృతి చెందిందని ఒకసారి.. గుండెపోటు రావడంతో కారులో కందుకూరులోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందని.. దీంతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేసినట్లు మరోసారి మాధవి చెబుతున్నారు. ఆమెతో పాటు యువకుడు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కుమార్తె మెట్లపై జారిపడి చనిపోయేంత బలమైన గాయాలైనా ఏఎన్‌ఎం అయిన తల్లి ఆమెను ఆసుపత్రికి తరలించకపోవడం.. ఒకవేళ ఆమె చెప్పినట్లుగానే మార్గం మధ్యలో చనిపోతే పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, ఇంటికి కూడా మృతదేహాన్ని తీసుకురాకుండా కాల్చివేయడం వంటివాటిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న లింగసముద్రం పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై రమేష్‌ ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నారు.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని